close
Choose your channels

నిజాముద్దీన్ ఘటనతో తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తోన్న కరోనా!

Saturday, April 4, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నిజాముద్దీన్ ఘటనతో తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తోన్న కరోనా!

కరోనా మహామ్మారి తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ విస్తరిస్తోంది. ఎప్పుడైతే ఢిల్లీ నిజాముద్దీన్ ఘటన వెలుగుచూసిందో ఆ రోజు నుంచి ఏపీ, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు అమాంతం పెరిగిపోతున్నాయి. ఏపీలో ఇప్పటి వరకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 190కి చేరుకుంది. ఇవాళ కొత్తగా 20కు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఢిల్లీలో మర్కజ్‌కు వెళ్లిన వారిని గుర్తించి ఎక్కడికక్కడ క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. అయితే.. క్వారంటైన్‌కు తరలింపును అడ్డుకున్న వారిపై ఏపీ ప్రభుత్వం కేసులు కూడా నమోదు చేస్తోంది.

తూర్పుగోదావరి జిల్లాలో

క్వారంటైన్ సెంటర్లు పెట్టొద్దంటూ కొందరు వ్యక్తులు అడ్డుకున్నారు. దీంతో ఈ విషయాన్ని సీరియస్ తీసుకున్న అమలాపురం డీఎస్పీ మాసూమ్ బాషా.. వారిపై కేసులు నమోదు చేశారు. రావులపాలెం, అనాతవరం, భట్లపాలెం, కొత్తపేటలో ఆందోళన చేసిన వారిపై కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే అరెస్ట్ చేస్తామని.. వ్యవసాయ అనుబంధ రంగాల వాహనాల రాకపోకలకు అనుమతి ఉంటుందన్నారు. అంతేకాదు.. వ్యవసాయ కార్మికులు పనులు చేసుకోవడానికి కూడా అనుమతిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు.

తెలంగాణ విషయానికొస్తే..

తెలంగాణలోనూ కరోనా పాజిటివ్ కేసులు గంట గంటకూ ఎక్కువవుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే నల్గొండ జిల్లాలో నాలుగు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే వీరందరూ ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారి కుటుంబ సభ్యులే కావడం గమనార్హం. ఇప్పటికే ప్రభుత్వ ఐసోలేషన్ వార్డులో పాజిటివ్ బాధితులు ఉండగా వారిని చికిత్స కోసం హైదరాబాద్‌కు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తమ్మీద ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరోనా కేసులు సంఖ్య 14కు చేరింది. ఇదిలా ఉంటే.. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం మాండ్రలో హైస్కూల్ టీచర్‌కు కరోనా పాజిటివ్ రావడంతో.. విద్యార్థులకు వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. హోం క్వారంటైన్‌లో ఉండాలని విద్యార్థులు, తల్లిదండ్రులకు వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు.

హైదరాబాద్‌లో..

నగరంలోని దిల్‌సుఖ్‌నగర్ పీ అండ్ టీ కాలనీలో కరోనా కలకలం రేగింది.
ఢిల్లీ మర్కజ్ వెళ్లి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌ రావడంతో 10 మంది కుటుంబ సభ్యులను రాజేంద్రనగర్ క్వారంటైన్‌కు తరలించారు. మరో నలుగురు కుటుంబ సభ్యులు గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే.. ఆదిలాబాద్ జిల్లాలో 10 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. వీరంతా ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చినవారే. ఆదిలాబాద్‌లో ఆరుగురు, నేరడిగొండ మండలంలో ముగ్గురికి, ఉట్నూర్ మండలంలో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలింది.

దేశ వ్యాప్తంగా చూస్తే..

మొత్తానికి చూస్తే నిజాముద్దీన్ ఘటనతో తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఓ రేంజ్‌లో పెరిగిపోతోంది. దేశ వ్యాప్తంగా దాదాపు 22 వేల మందికి పైగా తబ్లిగి జమాత్ కార్యకర్తలు వారి సన్నిహితులను గుర్తించి క్వారంటైన్‌కి తరలించినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటి వరకు నమోదైన కోవిడ్-19 పాజిటివ్ కేసుల్లో 1,023 మంది (30 శాతం) తబ్లిగి జమాత్‌కి సంబంధించిన వారే ఉన్నారని పేర్కొంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.