దేవుడా.. ఎక్కడ చూసినా కరోనా పేషెంట్లే.. ఏ శ్మశానం చూసినా డెడ్ బాడీలే..!

  • IndiaGlitz, [Thursday,April 22 2021]

దేశంలో కరోనా కేసుల సంఖ్య మూడు లక్షలు దాటేసింది. రాష్ట్రాలన్నీ కరోనా కారణంగా అల్లాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఎక్కడ చూసినా.. టెస్టులు చేయించుకునేందుకు బారులు తీరిన జనం.. వ్యాక్సిన్ కోసం క్యూలు.. ఆసుపత్రుల నిండా కరోనా పేషెంట్లు.. మార్చురీ లోపలే కాదు.. బయటా శవాలు.. శ్మశానాల్లో కాల్చేందుకు చోటు లేక బయట శవాలతో క్యూ.. నిజంగా ఇలాంటి పరిస్థితిని ఎప్పుడైనా ఊహించామా? అసలు మన దేశానికి ఇంతటి దౌర్భాగ్యం దాపురిస్తుందని కలలోనైనా అనుకున్నామా? విచిత్రం ఏంటంటే.. జనాలు ఏదైనా ఊరెళ్లాల్సి వస్తే ఆక్సిజన్ సిలిండర్‌ను వెంట తీసుకెళ్లడం.. వినడానికే విడ్డూరంగా ఉన్న ఈ దృశ్యం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కెమెరా కంటికి చిక్కింది.

ఎంతటి దయనీయ పరిస్థితిలో ఉన్నామో.. మరో విచిత్రం ఏంటంటే.. ఆసుపత్రికి వెళ్లి అడ్మిట్ అవ్వాల్సి వస్తే.. మన వస్తువులతో పాటు ఒక టేబుల్ ఫ్యాన్‌ను కూడా తీసుకెళ్లాల్సిన పరిస్థితి. ఒకరు ఛస్తేనే మరొకరికి ఆక్సీజన్ లభించే పరిస్థితి.. దేవుడా.. ఎంతటి దయనీయ స్థితిలో ఉన్నాం మనం. టెస్ట్ చేయించుకోవడానికని ఆసుపత్రికి వెళితే చాలా పెద్ద క్యూలు.. కొన్ని గంటల పాటు నిలబడి అన్నీ దాటుకుని వెళితే ఇవాల్టి లిమిట్ అయిపోయింది.. ఇక కరోనా టెస్ట్ కోసం రేపే రావాలంటూ తరిమే ఆసుపత్రి సిబ్బంది. పోనీ నానా తిప్పలు పడి కరోనా టెస్ట్ చేయించుకున్నామా..పాజిటివ్ వస్తే ఇక అంతే సంగతులు...ఆస్పత్రికి పోవాలంటే వణుకు.. ఇంట్లో ఉందామంటే ఎప్పుడేం జరుగుతుందో అని భయం.

సరేలే అని ధైర్యం చేసి ఆసుపత్రికి వెళితే బెడ్లు లేక.. ఆక్సిజన్ అందక.. తీవ్ర అవస్థలు. కరోనా వస్తే చేర్చుకోవడానికి బెడ్లు లేవ్.. చస్తే తీసుకెళ్లడానికి అంబులెన్స్‌లు లేవ్.. ఒక వేళ అంబులెన్స్ దొరికితే శ్మశానంలో కాల్చడానికి ఖాళీలుండవ్.. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఇతర రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి హైదరాబాద్‌కు కరోనా రోగులు క్యూ కడుతుండటం.. దీంతో బెడ్లు, ఆక్సిజన్ కొరత భారీగా ఉంది. ఇలాంటి దిక్కుమాలిన, దయనీయ పరిస్థితిని టీవీల్లో, పేపర్లలో చూసి జనాలు వణికిపోతున్నారు. పోనీ రాష్ట్రాలు ముందుడగు వేసి ఏదైనా చేద్దామంటే కేంద్రం సహకరించదు. ఆక్సిజన్ కొరత ఉందన్నా నోరు మెదపదు.. టెస్ట్‌ల సంఖ్య పెంచే విషయంలో సైతం సహకారముండదు. కనీసం రాష్ట్రాలకు సరిపడా నిధులైనా ఇస్తుందా.. అంటే అదీ లేదు. ఇదిలా ఉంటే మళ్లీ సాధారణ స్థితి ఎప్పుడొస్తుందా? మునుపటిలా ప్రశాంతంగా తిరిగిన రోజులు ఎప్పుడొస్తాయా అని కళ్లు కాయలు కాచేలా జనం ఎదురు చూస్తున్నారు.

More News

భారత్‌ను బెంబేలెత్తిస్తున్న కరోనా మూడో అవతారం

ఓవైపు డబుల్‌ మ్యూటెంట్‌ (రెండు ఉత్పరివర్తనాలు చెందింది) వైరస్‌ వల్లనే దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఆ మలయాళీ స్టార్ కపుల్.. తెలుగులో బిజీబిజీ

తెలుగు సినిమాల్లో చేసేందుకు అన్ని ఇండస్ట్రీల వారూ చాలా ఇష్టపడుతుంటారు. తెలుగు ప్రేక్షకులు ఎవరినైనా సరే త్వరగా ఓన్ చేసుకుంటారు.

'పంచతంత్రం'లో లేఖ పాత్రలో శివాత్మిక రాజశేఖర్... పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల

‘పద్మశ్రీ’ బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య ప్రధాన తారాగణంగా

అడివి శేష్ చేతుల మీదగా 'పంచతంత్రం' టైటిల్ పోస్టర్, నటీనటుల వివరాలు విడుదల

‘పద్మశ్రీ’ బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య ప్రధాన తారాగణంగా

దేశంలో రికార్డ్ స్థాయిలో కేసులు.. ప్రపంచంలో ఇదే తొలిసారి

కరోనా మహమ్మారి దేశంలో ఊహించని విధంగా విజృంభిస్తోంది. కనీవినీ ఎరుగని స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి.