దేశంలో రికార్డ్ స్థాయిలో కేసులు.. ప్రపంచంలో ఇదే తొలిసారి

  • IndiaGlitz, [Thursday,April 22 2021]

కరోనా మహమ్మారి దేశంలో ఊహించని విధంగా విజృంభిస్తోంది. కనీవినీ ఎరుగని స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా హెల్త్ బులిటెన్‌ను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3,14,835 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో 2,104 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మన దేశంలో కరోనాకు బలైనవారి సంఖ్య 1,84,672కు చేరింది. మన దేశంలో ప్రస్తుతం సుమారు 2.3 మిలియన్ల యాక్టివ్ కోవిడ్ కేసులు ఉన్నాయి.

ఒక దేశంలో కేవలం 24 గంటల్లో 3 లక్షల కేసులు దాటిపోవడం ప్రపంచంలో ఇదే తొలిసారి. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇప్పటి వరకూ 2021 ఏప్రిల్ 21 వరకు దేశవ్యాప్తంగా 27,27,05,103 శాంపిల్స్‌ను పరీక్షించారు. వీటిలో 16,51,711 శాంపిల్స్‌ను బుధవారం పరీక్షించారు. మన దేశంలో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 1,59,30,965కు చేరుకుంది. ఈ వ్యాధి నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,34,54,880గా ఉంది. దేశ వ్యాప్తంగా జనవరి 16 నుంచి జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియలో 13,23,30,644 మందికి వ్యాక్సినేషన్ జరిగింది. మరోవైపు నిపుణులు షాకింగ్ విషయాలు చెబుతున్నారు.

ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల రేటు 13.82 శాతానికి పెరగగా.. రికవరీ రేటు 85.01 శాతానికి పడిపోవడం ఆందోళ కలిగిస్తోంది. మహారాష్ట్రలో అత్యధికంగా 67,468 కేసులు నమోదవగా.. ఉత్తరప్రదేశ్‌లో 33,106 కేసులు నమోదవగా.. దేశ రాజధాని ఢిల్లీలో 24,638 కేసులు నమోదయ్యాయి. ఇక పశ్చిమబెంగాల్‌లో ఎన్నికలు జరగనుండటంతో అది కరోనాకు హాట్‌స్పాట్‌గా మారింది. అక్కడ తాజాగా 10,784 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 58 మంది మృతి చెందారు. ఒకరోజులో హయ్యెస్ట్‌గా గతంలో అమెరికాలో 3.07 లక్షల కేసులు నమోదవగా.. దానిని మించి తాజాగా ఇండియాలో 3.14 లక్షల కేసులు నమోదవడం గమనార్హం.

ఈ వివరాల ప్రకారం, మే 11-15 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 33 నుంచి 35 లక్షల వరకు యాక్టివ్ కేసులతో కోవిడ్ తారస్థాయికి చేరే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, తెలంగాణల్లో ఏప్రిల్ 25 నుంచి 30 మధ్య కాలంలో కొత్తగా కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య తీవ్ర స్థాయికి చేరవచ్చని నిపుణులు వెల్లడించారు. మే 1 నుంచి 5 మధ్య కాలంలో ఈ కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మే 6 నుంచి 10 మధ్యలో ఈ కేసులు తారస్థాయికి చేరుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. బిహార్‌లో ఏప్రిల్ 25 ప్రాంతంలో ఈ కేసులు తీవ్ర స్థాయికి చేరే అవకాశం ఉందని చెప్తున్నారు.