ప్రతిపక్షంలో ఉన్నామని కాకుండా.. నిష్పక్షపాతంగా మాట్లాడాలి: పవన్

  • IndiaGlitz, [Thursday,July 23 2020]

ఏపీలో కరోనా పరిస్థితి.. ప్రభుత్వం విఫలమైందంటూ వస్తున్న వార్తలపై పవన్ స్పందించారు. ఇది ప్రపంచానికి వచ్చిన విపత్తు అని ఒక రాష్ట్రానికి సంబంధించింది మాత్రం కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాగా పని చేసిందంటూనే మరింత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఏదో ప్రతిపక్షంలో ఉన్నామని కాకుండా.. నిష్పక్షపాతంగా దీనిపై మాట్లాడాలి. ఇది ప్రపంచానికి వచ్చిన విపత్తు ఇది. అయితే ప్రభుత్వం సంసిద్ధంగా ఉంటే తీవ్రతను తగ్గించవచ్చు. కాకపోతే మొదట కరోనా విషయంలో ఏపీ గవర్నమెంట్ కూడా ఇంత పెద్ద విపత్తుగా భావించలేదు. ఏదో ఫ్లూలాగా భావించింది.

నిజానికి అలాగే అయ్యేదేమో కానీ ఈ లోగా ఇన్ని వేల మంది చనిపోవడం.. హాస్పిటల్స్‌కి తట్టుకునేంత సమర్థత లేకపోవడం ఇవన్నీ.. ప్రపంచం ఊహించలేదు. లాక్‌డౌన్ విధించడం వల్ల అంత పెద్ద మొత్తంలో ఎవరూ మహమ్మారి బారిన పడలేదు. లాక్‌డౌన్ ఎత్తేశాక ఇబ్బడి ముబ్బడిగా కేసులు పెరిగిపోవడం.. మృత్యువాత పడటం వంటివి జరుగుతున్నాయి. ప్రభుత్వం మరికొంత బాధ్యతగా వ్యవహరించి ఉంటే బాగుండేది. మొన్న నేనొక ట్వీట్‌ చేశాను. ప్రభుత్వం బాగా పని చేస్తోందని.. ఇది నేను మనస్ఫూర్తిగానే చేశాను. ఇది ఒక్క రోజులో అయిపోయేది కాదు కాబట్టి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత నిర్లక్ష్యం వహించినట్టు అనిపించింది. కాబట్టి జాగ్రత్త వహించాలని కోరుతున్నా’’ అని పవన్ పేర్కొన్నారు.