అవ్వా.. ఇంకా ఈ అనుమానాలేంటి కోదండరామ్!

  • IndiaGlitz, [Friday,January 11 2019]

తెలంగాణలో ఎన్నికలు అయిపోయాయ్.. ఫలితాలూ వచ్చేశాయ్.. కలలో కూడా ఊహించనంతగా రాష్ట్రమంతటా గులాబీ జెండా రెపరెపలాడింది.. ఇక రేపోమాపో కేబినెట్ ఏర్పడబోతోంది. అయితే అన్నీ అయిపోయినా తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌‌కి మాత్రం రోజురోజుకూ అనుమానాలు పుట్టుకొస్తూనే ఉన్నాయ్..! ఆయన అనుమానాలకు బహుశా 2024వరకు సమాధానాలు దొరకవేమో.! ఎందుకంటే ఇప్పటికే ఎన్నికల సీజన్ ముగిసింది గనుక.. రానున్న సీజన్‌లోనే కాస్త తెలివిగా ప్రదర్శిస్తే ఏమైనా ఫలితాలుంటాయేమో.!! అసలు ఆ ఫ్రొఫెసర్ అనుమానాలేంటి..? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా కోదండ ఎందుకిలా పొంతనలేని మాటలు మాట్లాడుతున్నారనే విషయాలు ఈ కథనంలో చూద్దాం.

అనుమానాలన్నీ ఆయనపైనే..!
త్వరలో సర్పంచ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మీడియా ముందుకొచ్చిన కోదండరాం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికలను గుర్తుచేసుకున్న ఆయన.. ఎన్నికల్లో అనేక అవకతవకలు జరిగాయన్నారు. నిష్పక్షపాతంగా విధులు నిర్వహించడంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ విఫలమైందన్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌పై పలు అనుమానాలు ఉన్నాయని.. ఆయణ్ని పార్లమెంట్‌ ఎన్నికల వరకు కొనసాగించవద్దని ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల కమిషన్‌‌ను మీడియా ముఖంగా ఆయన కోరారు. త్వరలో ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని కోదండరాం స్పష్టం చేశారు.

విధి విధానాల్లేవ్..!
సర్పంచ్‌ల ఏకగ్రీవం రాజకీయ స్వేచ్ఛకు గొడ్డలి పెట్టులాంటిది. గ్రామానికి చెందిన ప్రజలంతా కలిసి ఒక వ్యక్తిని ఏకగ్రీవంగా ఎన్నకోవడం మంచిదే కానీ.. రాజకీయ పెత్తనంతో ఈ నిర్ణయం చేయడం తగదు. పంచాయతీ ఎన్నికల్లో టీజేఎస్ పోటీ చేస్తోంది. ప్రస్తుతం పార్టీలకు, రాజకీయ నాయకులకు సిద్ధాంతపరమైన విధానాలు లేకుండా పోయాయి. స్వార్థ ప్రయోజనాల కోసం బట్టలు మార్చినంత తేలిగ్గా పార్టీలను మార్చేస్తున్నారు. అయితే టీజేఎస్ ప్రత్యేక రాజకీయ పక్షంగా ఉంటుందని.. ఏ పార్టీలో విలీనం కాదు అని కోదండరామ్‌ ఈ సందర్బంగా తేల్చిచెప్పారు.

ఏపీ ఎన్నికలపై..
పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలా వద్దా అనేదానిపై ప్రస్తుతం పార్టీలో చర్చలు జరుగుతున్నాయన్నారు. ఏపీ ఎన్నికలకు వెళ్లే తీరిక‌ మాకు లేదని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణలో తాము చేయాల్సింది చాలా ఉందని.. ఆంధ్రా ప్రజలు అభివృద్ధి చెందాలని కోదండరాం ఆకాంక్షించారు.