ఏపీ నగరపాలక సంస్థల మేయర్‌ల విషయంలో ఆసక్తికర విషయాలివే..

  • IndiaGlitz, [Friday,March 19 2021]

ఏపీలోని నగరపాలక సంస్థల్లో కొత్త మేయర్లు కొలువుదీరిన విషయం తెలిసిందే. అయితే దీనిలో కొన్ని ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి. ఏపీలో మొత్తంగా 11 నగరపాలక సంస్థలుండగా.. వాటిలో పదింటికి కొత్త వాళ్లు.. వారిలో కొందరు అసలు ఏమాత్రం రాజకీయ నేపథ్యం లేని వాళ్లు ఉండటం విశేషం. కడప మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన సురేష్ బాబు మినహా మిగిలిన వారంతా కొత్తవారే. సురేష్ బాబు రెండోసారి మేయర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇక ఒంగోలు మేయర్ సుజాత ఒక్కరు మాత్రమే రాజకీయాలకు సుపరిచితురాలు. ఇక గుంటూరు మేయర్ భాగ్యలక్ష్మి గతంలో ఒకసారి కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓడిపోయారు.

మిగిలిన 8 మంది ఏమాత్రం రాజకీయ అనుభవం లేని వారే కావడం విశేషం. మరో విశేషం ఏంటంటే.. నలుగురు మినహా మిగిలిన వారంతా అతివలే కావడం విశేషం. జగన్ సర్కార్ మేయర్ ఎన్నికలో మహిళలకు పెద్ద పీట వేసింది. విజయవాడలో భాగ్యలక్ష్మి, విశాఖపట్నంలో హరి వెంకటకుమారి, తిరుపతిలో శిరీష, ఒంగోలులో సుజాత, విజయనగరంలో విజయలక్ష్మి, చిత్తూరులో ఆముద, మచిలీపట్నంలో వెంకటేశ్వరమ్మ మేయర్లుగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇక ఈసారి బీసీ సామాజిక వర్గానికి సైతం జగన్ పెద్ద పీట వేసి ఆ సామాజిక వర్గాన్ని ఆకట్టుకున్నారు.

ఇక జనరల్‌కు కేటాయించిన మూడు స్థానాల్లో బీసీలకు అవకాశమిచ్చారు. విజయవాడ, తిరుపతి, మచిలీపట్నం జనరల్ మహిళలకు రిజర్వ్ చేయగా వాటిని బీసీ మహిళలకు కేటాయించారు. ఇక అనంతపురం సైతం జనరల్‌కు రిజర్వ్ చేయగా అక్కడ మైనారిటీకి చెందిన మహిళకు కేటాయించారు. మొత్తానికి జగన్ అన్ని వర్గాలకూ దాదాపు సమన్యాయం చేయడంతో పాటు.. మహిళలకు అధిక ప్రాధాన్యమిచ్చి అందరి మన్ననలూ పొందుతున్నారు.