కేరళలో జరిగిన ఆ మూడు వివాహాలు ఆద్యంతం ఆసక్తికరమే..

  • IndiaGlitz, [Monday,October 26 2020]

కేరళలో ఒకే వేదికపై మూడు వివాహాలు జరిగాయి. దీనిలో ఆసక్తికరమేముంది అంటారా? ఆ ముగ్గురూ కవలలు కావడమే ఆసక్తికరం. అయితే ఆ ముగ్గురు మాత్రమే ఒకే కాన్పులో జన్మించలేదు. మరో ఇద్దరితో కలిసి ఐదుగురు ఒకే కాన్పులో కేరళలోని తిరువనంతపురానికి చెందిన రమాదేవి అనే మహిళకు 1995 నవంబర్ 18న జన్మించారు. వారిలో నలుగురు ఆడపిల్లలు కాగా.. ఒక్కరు మాత్రం మగపిల్లవాడు. వీరికి పెట్టిన పేర్లు సైతం చాలా ఆసక్తికరంగా మారాయి.

ఈ ఐదుగురు శిశువులు కేరళ క్యాలెండర్ ప్రకారం ఉత్తమ్ నక్షత్రంలో జన్మించారట. దీంతో రమాదేవి, ప్రేమ్ కుమార్ దంపతులు ఈ ఐదుగురికి ఉత్తర, ఉత్తమ, ఉత్రా, ఉత్రజా, ఉత్రాజన్ అనే పేర్లు పెట్టారు. అప్పటి నుంచి ఈ కవలలపై పలు పత్రికల్లో పలు కథనాలు వెలువడ్డాయి. ఇప్పుడు నలుగురు కవల యువతుల్లో ముగ్గురు ఒకే వేదికపై వివాహం చేసుకుని మరోమారు వార్తల్లో వ్యక్తులుగా నిలిచారు. అయితే నాలుగో యువతి కూడా ఇదే వేదికపై పెళ్లి చేసుకోవాల్సి ఉందట.

అయితే వరుడు సమయానికి కువైట్ నుంచి సమయానికి రాలేకపోవడం వల్ల ఆ యువతి వివాహం నిలిచిపోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్బంగా రమాదేవి మాట్లాడుతూ ఇంత మంది పిల్లలను పెంచి పోషించడం కోసం తాము చాలా కష్టపడ్డామని.. తన భర్త ఆత్మహత్య చేసుకోవడంతో ఐదుగురు పిల్లల బాధ్యత తనపైనే పడిందని తెలిపారు. ఆ తరువాత కష్టపడి ప్రభుత్వోద్యోగం సంపాదించి పిల్లలను ఎంతో కష్టపడి చదివించానని తెలిపారు. తమ నలుగురు కుమార్తెలకు ఉద్యోగంలో స్థిరపడిన భర్తలు దొరికారని ఆమె పేర్కొన్నారు.