‘షా’ మాస్టర్ ప్లాన్.. వర్కవుటయితే వాళ్లకు కష్టాలే!

  • IndiaGlitz, [Thursday,October 17 2019]

కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాస్టర్ ప్లాన్ వేశారు. ఇదే వర్కవుట్ అయితే వాళ్ల పరిస్థితి దారుణంగా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి. హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్రంలో దాదాపు అన్నీ తానై చూసుకుంటున్న షా తాజాగా.. నేషనల్ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్‌ (ఎన్‌ఆర్సీ) సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్‌ఆర్సీపై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీ అమలుకు చర్యలు మొదలయ్యాయని అమిత్ షా సంకేతాలు పంపతున్నారు. దేశంలో అక్రమంగా ఉండిపోయిన విదేశీయులను తిప్పి పంపేందుకు ఫారినర్స్‌ ట్రిబ్యునల్స్‌ ఏర్పాటవుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు.

అయితే ఇందుకు సంబంధించిన ప్రక్రియ మొదలైందని జాతీయ చానల్‌ ఇంటర్వ్యూలో షా తేల్చిచెప్పారు. ప్రభుత్వ పరంగా చేయాల్సిన సన్నాహాలు అన్నీ జరుగుతున్నాయని స్పష్టం చేశారు. కర్నాటక, మహారాష్ట్ర, హైదరాబాద్‌ లాంటి ప్రాంతాల్లో ఇప్పటికే వేల సంఖ్యలో విదేశీయులు అక్రమంగా తిష్ట వేశారని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఇప్పటికే అసోంలో ఎన్‌ఆర్సీ అమలయ్యింది. బెంగాల్‌లోనూ అమలు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. అయితే ఈ వ్యవహారంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అలియాస్ దీదీ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి. మొత్తానికి చూస్తే.. ఎన్‌ఆర్సీతో అక్రమంగా ఉండిపోయిన విదేశీయులకు తిప్పలేనని స్పష్టంగా అర్థమవుతోంది.