`లవ్‌స్టోరీ` `టక్ జగదీష్` సినిమాల మధ్య వివాదం సమసినట్టేనట..

  • IndiaGlitz, [Tuesday,February 02 2021]

'లవ్‌స్టోరీ', 'టక్ జగదీష్' సినిమాల మధ్య నెలకొన్న వివాదం సమసిపోయినట్టు తెలుస్తోంది. ఈ రెండు సినిమాల మధ్య విడుదల తేదీల విషయంలో వివాదం తలెత్తింది. దీంతో సమస్యను ఇరు నిర్మాతలు సామరస్య పూర్వకంగా పరిష్కరించుకున్నట్టు తెలుస్తోంది. నేచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో 'టక్ జగదీష్' సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నాని సినిమా కావడంతో ఈ సినిమాపై కామన్‌గానే అంచనాలు భారీగానే ఉన్నాయి. లాక్‌డౌన్ సమయంలో వచ్చిన నాని సినిమా ఆశించిన ఫలితాన్నైతే ఇవ్వకపోడంతో ప్రస్తుతం ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు.

ఈ సినిమాను ఏప్రిల్ 16న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా రూపొందించిన 'లవ్‌స్టోరీ' కూడా అదే డేట్‌ను లాక్ చేసింది. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే శేఖర్ కమ్ముల, సాయి పల్లవి కాంబోలో వచ్చిన ‘ఫిదా’ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ‘లవ్‌స్టోరి’ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే ఈ రెండు సినిమాలు ఒకే విడుదల తేదీని ఎంచుకోవడం వివాదానికి దారి తీసింది. అయితే తాజాగా ఈ రెండు చిత్రాల నిర్మాతలు సమావేశమై విడుదల తేదీ విషయంలో ఓ పరిష్కారానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఏప్రిల్ 16న ‘లవ్‌స్టోరీ’ని, ఆ తర్వాత వారం అంటే ఏప్రిల్ 23న ‘టక్ జగదీష్’ను రిలీజ్ చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు టాక్ నడుస్తోంది.