close
Choose your channels

రాజధానులపై అంత పట్టుదలా.. చంద్రబాబుకు ప్రయోజనం చేకూరవద్దనేనా?

Monday, July 13, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రాజధానులపై అంత పట్టుదలా.. చంద్రబాబుకు ప్రయోజనం చేకూరవద్దనేనా?

ముచ్చటగా మూడు రాజధానులు.. తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎప్పుడూ కనీవినని కాన్సెప్ట్. కనీసం ఎన్నికల క్షేత్రంలో నిలిచే ముందైనా జగన్ నోటి నుంచి వెలువడని మాట. ఎన్నికల మ్యానిఫెస్టోని ఎంత తరచి చూసినా కనపడని కాన్సెప్ట్. ఆ తరువాత ఎందుకొచ్చిందనేది మిలియన్ డాలర్ క్వశ్చన్. ఈ కాన్సెప్ట్ అక్కడిదంటారు.. ఇక్కడిదంటారు.. కానీ ఎక్కడా కూడా మూడు రాజధానుల కాన్సెప్ట్ వర్కవుట్ అయిన దాఖలాలు మాత్రం లేదు. అయినా జగన్ సర్కార్ వెనక్కి తగ్గేదే లేదు. విశాఖలో రాజధాని అంత మంచిది కాదంటూ కొన్ని రిపోర్టులు సైతం వెల్లడించాయి. అయినా సరే మేము పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్లన్నట్టుగా ఉంది ప్రభుత్వ వ్యవహారం. అయితే అమరావతి రాజధానిగా కొనసాగితే టీడీపీ అధినేత చంద్రబాబుకు కలిసి వస్తుందనే.. ఈ నిర్ణయం తీసుకున్నారా? అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి.

అసలే.. ఆర్థిక లోటులో ఉన్న రాష్ట్రం. ఇప్పటికే టీడీపీ హయాంలో చంద్రబాబు అమరావతి పేరుతో ఓ రాజధానికి కొన్ని వేల కోట్లు ఖర్చు చేశారు. అమరావతి కూడా ఏపీ సెంట్రల్‌లో ఉంది. అటు సీమ వాసులకు.. ఇటు కోస్తా వాసులకు అనుకూలంగా ఉంది. దానిని పునుద్ధరించుకుని వాడుకోవాల్సింది పోయి.. రాష్ట్రంపై మరింత ఆర్థిక భారం మోపడమేంటని విపక్షాలు మండిపడుతున్నాయి. ఇప్పటి వరకూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తమ ఆలోచనా విధానాన్ని ప్రజలకు వివరించింది లేదు. ఎందుకు ఈ కాన్సెప్ట్‌ను చేపట్టారో వెల్లడించింది లేదు. దీంతో ఈ మూడు రాజధానుల కాన్సెప్ట్ తమకు ఎంత వరకు కలిస్తుందో తెలియక ప్రజలు సైతం గందరగోళానికి లోనవుతున్నారు. విశాఖను అభివృద్ధి చేయడానికి అంటారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖను ఇంకేం అభివృద్ధి చేస్తారో తెలియదు. మొత్తానికి ప్రజలకు భూముల రేట్లు పెరుగుతాయనే భరోసా తప్ప తమకిది ఎంత మేరకు లాభిస్తుందో తెలియని పరిస్థితి.

ఇదంతా పక్కనబెడితే కరోనా కాలంలోనూ.. మూడు రాజధానుల అంశం చకచకా ముందుకు వెళుతోంది. తాజాగా డీజీపీ గౌతమ్ సవాంగ్ విశాఖ పర్యటనతో దీనిపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం విశాఖ వచ్చేందుకు సిద్ధమని ఆయన తేల్చి చెప్పారు. కాగా ఈ నెల మూడో వారంలో కేబినెట్ భేటీ కానుంది. ఈ భేటీలో విశాఖ అంశం తప్పనిసరిగా చర్చిస్తారని సమాచారం. రూట్ మ్యాప్‌ను కూడా సిద్ధం చేస్తున్నాట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే అక్టోబర్‌లో విజయదశమి దీనికి ముహూర్తం కానున్నట్టు సమాచారం. మరి దీనికి పరిస్థితులు అనుకూలిస్తాయో లేదో.. ఏం జరగబోతోందో వేచి చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.