close
Choose your channels

చంద్రబాబుకు ముందే తెలుసా.. ఇదంతా భారీ ప్లానా!?

Friday, June 21, 2019 • తెలుగు Comments

చంద్రబాబుకు ముందే తెలుసా.. ఇదంతా భారీ ప్లానా!?

టీడీపీకి చెందిన నలుగురు ఎంపీలు బీజేపీలో చేరతారని చంద్రబాబుకు ముందే తెలుసా..? చంద్రబాబే ఆ నలుగుర్ని బీజేపీలో చేర్పించారా..? ఈ చేరిక వెనుక భారీ ప్లాన్ ఉందా..? అంటే తాజా రాజకీయ పరిణామాలు, రాజకీయ విశ్లేషకుల మాటలు చూస్తుంటే అక్షరాలా నిజమనిపిస్తోంది. ఇంతకీ ఇది ఎంతవరకు నిజమే ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. సరిగ్గా ఫలితాలు వచ్చి నెల గడవక ముందే టీడీపీకి చెందిన నేతలు జంపింగ్‌లు షురూ చేశారు. ఇటీవల నలుగురు టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి రామ్మోహన్ రావులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఇది టీడీపీకి కోలుకోలేని ఎదురుదెబ్బ అని కొందరు అంటుండగా.. రాజకీయ విశ్లేషకులు మాత్రం ఇదంతా పక్కా ప్లాన్ చంద్రబాబే దగ్గరుండి ఇదంతా చేస్తున్నారని అంటున్నారు.

ఓసోస్.. ఇదేనా అసలు కథ!

వాస్తవానికి బీజేపీతో టీడీపీకి ఉన్న సత్సంబంధాలు ఈనాటివి కావు.. ఎప్పట్నుంచో ఇరు పార్టీలకు మైత్రి ఉంది. 2014 ఎన్నికల్లో కలిసి కూడా పనిచేశారు. అయితే హోదా సాకుతో ఎన్డీఏ నుంచి టీడీపీ బయటికొచ్చేయడం.. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి ఘోరంగా పరాజయం పాలయ్యారు. అయితే కేంద్రంలో రెండోసారి బీజేపీ అధికారంలోకి రావడంతో చంద్రబాబుపై రివెంజ్ తీర్చుకుంటుందని పలువురు కమలనాథులు హెచ్చరించారు. దీంతోపాటు పలువురు టీడీపీకి పెద్ద దిక్కులైన సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి వ్యక్తుల ఇళ్లు, ఆఫీసులపై సీబీఐ, ఈడీ దాడులు చేయడంతో చంద్రబాబు కంగుతిన్నారు. ఆ ఇద్దరూ అయిపోతే చివరగా మిగిలేది తానేనని భావించిన బాబు.. పక్కా ప్లాన్ ప్రకారమే ఆ నలుగురు ఎంపీలను బీజేపీలో చేర్పించితే బీజేపీ వారి జోలికి రాదని.. వారే తనపై దాడులు జరగకుండా ఆపుతారని భావించిన బాబు ఈ వ్యూహ రచన చేశారట.

2024 కోసం ఇప్పట్నుంచే ఎత్తులు!

2019 ఎన్నికల్లో బీజేపీతో సఖ్యతగా ఉండే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయ దుందుభి మోగించారని.. 2024 ఎన్నికల్లో కూడా తాము బీజేపీతో సఖ్యతతో ఉంటే అంతా మంచే జరుగుతుందని టీడీపీ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే 2014 ఎన్నికల్లో మాదిరిగానే.. 2024లో కూడా కలిసి పోటీ చేయాలని భావించి ఇప్పట్నుంచే చంద్రబాబు ఈ రకంగా ఎంపీలను బీజేపీలో చేర్చి ఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

ఆ వ్యాఖ్యలకు అర్థమేంటో!

మరీ ముఖ్యంగా తాము పార్టీ మారుతున్న విషయం చంద్రబాబుకు ముందే తెలుసని.. ఇటీవల తాము ఆయనతో భేటీ అయినప్పుడు బీజేపీలో చేరుతున్నట్లు ప్రస్తావించామని బీజేపీ తీర్థం పుచ్చుకున్న తర్వాత ఓ ఎంపీ చెప్పడం ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. అంతేకాదు.. తమపై ఒత్తిడి ఉందని.. దాన్ని భరించలేకే టీడీపీని వీడుతున్నట్లు ఎంపీలు చెప్పడం గమనార్హం. అయితే ఇంతకీ ఆ నలుగురు ఎంపీలు ఎందుకు టీడీపీని వీడారో..? చంద్రబాబే ప్లాన్ గీసి మరి పంపారో..? అనేది ఆ పెరుమాళ్లకు ఎరుక గానీ.. రకరకాలుగా, చిత్ర విచిత్రాలుగా కథనాలు మాత్రం పెద్ద ఎత్తున వచ్చేస్తున్నాయ్..!

Get Breaking News Alerts From IndiaGlitz