close
Choose your channels

ఆర్టీసీ సమ్మె వెనకున్నది వాళ్లేనా.. అందుకే కేసీఆర్ ఇలా..!

Monday, October 21, 2019 • తెలుగు Comments

ఆర్టీసీ సమ్మె వెనకున్నది వాళ్లేనా.. అందుకే కేసీఆర్ ఇలా..!

తెలంగాణ పేరు గల్లీ నుంచి ఢిల్లీ వరకు మార్మోగుతోంది. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోందో..? అసలు ఏం పరిపాలన సాగుతోందో..? రాష్ట్రానికి సీఎం ఉన్నాడా లేడా..? అనేది అర్థం కాలేదంటూ రాజకీయ విశ్లేషకులు, నిపుణులు తలకాయలు పట్టుకుంటున్నారు. ఓ వైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె.. మరోవైపు విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు సిద్ధమవుతుండటం.. త్వరలోనే టీచర్స్ సమ్మె ఇలా వరుస పంచాయితీలతో ప్రభుత్వం ఇరకాటంలో పడినట్లైంది. ఇప్పటికే సుమారు 18 రోజులు పూర్తి చేసుకున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె.. ఇంకా కొనసాగుతుంది. తమ డిమాండ్స్‌ను తీర్చాల్సిందేనని పట్టుబట్టి మరీ కార్మికులు తిష్టవేసి కూర్చున్నారు. అయితే సీఎం కేసీఆర్ మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటూ కాలికి బలపం కట్టుకున్నట్లుగా ప్రవర్తిస్తున్నారు.

అసలెందుకు ఇలా..!?

అసలు ఆర్టీసీ కార్మికులు ఇంత సడన్‌గా ఎందుకు రోడ్డెక్కారు..? అసలు ఈ వ్యవహారం వెనుక బీజేపీ ఉండి కర్త, కర్మ, క్రియ అంటూ నడిపిస్తోందా..? లేకుంటే మరేవైనా దుష్టశక్తులు ఉన్నాయా..? నోట్ల ప్రభావంతో ఇలా ఆర్టీసీ యూనియన్ సభ్యులు రోడ్డెక్కారా..? అనే అనుమానాలు గత కొన్నిరోజులుగా బలపడిపోతున్నాయి. ఇదే విషయాన్ని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇందుకు కారణం ఆర్టీసీ కార్మికుల సమ్మె చేపట్టిన మరుక్షణం నుంచి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ రంగంలోకి దిగడం.. ఆ తర్వాత జిల్లాల వారిగా బీజేపీ నేతలు ధర్నాలు చేపట్టడం.. ఇక తాము సైలెంట్‌గా ఉంటే బాగోదని కాంగ్రెస్‌ కూడా నిరసనలు చేపడుతూ ముందుకెళ్తున్నారు.

ఎమ్మెల్సీ సంగతేంటి.. అందుకేనా!?

మొత్తానికి చూస్తే.. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తానని టీఆర్ఎస్ మోసం చేసిందనే ఆరోపణలూ ఉన్నాయి. అంతేకాదు ఒకరిద్దరు మంత్రులు స్వయానా మీడియా ముందుకొచ్చి ఈ ఎమ్మెల్సీ వ్యవహారం గురించి మాట్లాడారు. ఈ విషయాన్ని ఇంతవరకూ అశ్వత్థామా ఖండించకపోవడం గమనార్హం. అయితే.. సరిగ్గా ఇదే టైమ్‌లో ఏపీ సీఎం జగన్.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు కలిసొచ్చింది.. దీంతో ఇక్కడ కూడా ఆర్టీసీని విలీనం చేయాలని రంగంలోకి దిగిన యూనియన్ నేతలు.. కార్మికులను సమ్మెకు దింపారు. ఇలా దసరా మొత్తం గడిచిపోయింది.. ఇప్పుడు ఇంకా పరిస్థితులు చక్కబడలేదు. మున్ముంథు మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా ఆశ్చర్యపోనక్కర్లేదేమో!

ఇందుకే కేసీఆర్ పట్టించుకోలేదు!?

ఆర్టీసీ కార్మికులకు అడగందే ఫిట్‌మెంట్ పెంచిన కేసీఆర్‌.. ఇప్పుడు అదే కార్మికులపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. దీంతో ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లందర్నీ పక్కనెట్టి.. కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని దాదాపు ఫిక్స్ అయ్యారు. అయితే.. ఈ కార్మిక నేతలు, జేఏసీ కన్వీనర్, ఆర్టీసీ యూనియన్ల లీడర్స్ వెనుక బీజేపీ ఉందని పసిగట్టిన కేసీఆర్.. అసలు ఈ కార్మికులకు ఏమీ చేయకూడదని.. వీరు చేసే సమ్మెలో నిజాయితీ అస్సలు లేదని కోపంతో రగిలిపోతున్నారట. అందుకే ఈ వ్యవహారంపై కనీసం మీడియా ముందుకు రావడం గానీ.. చిన్నపాటి ప్రకటన ఇవ్వడం గానీ కేసీఆర్ చేయలేదు. ఇందుకు అసలు కారణం పైన చెప్పిందేనని స్పష్టంగా అర్థమవుతోంది. అయితే కేసీఆర్ పట్టించుకోకపోవడం వెనుక ఈ కారణం ఎంతవరకూ ఉండొచ్చో..? అసలు కేసీఆర్ ఏం చేయబోతున్నారు..? ఇలాగే ఉండిపోతారా..? సమస్యను పరిష్కరించరా..? అనేది పైనున్న పెరుమాళ్లకే ఎరుక మరి.

Get Breaking News Alerts From IndiaGlitz