'కేసీఆర్ అనే నేను..' అసెంబ్లీలో రెండోసారి..!!

  • IndiaGlitz, [Thursday,January 17 2019]

తెలంగాణ ఎన్నికల్లో కనివీని ఎరుగని రీతిలో గెలిచిన టీఆర్ఎస్‌‌.. కేసీఆర్‌‌ను రెండో దఫా సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది. ఫలితాల అనంతరం గవర్నర్ నరసింహన్ సమక్షంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే గురువారం ప్రారంభమైన మొదటి అసెంబ్లీ సమావేశాల్లో మరోసారి.. ‘కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే నేను..’ అంటూ ఆయన ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్.. కేసీఆర్‌తో ప్రమాణం చేయించారు. అనంతరం మహిళా ఎమ్మెల్యేల చేత ప్రమాణం చేయించారు. కాగా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం మధ్యాహ్నం రెండు గంటల వరకు కొనసాగే అవకాశముంది. ప్రమాణం అనంతరం మొదటి రోజు సమావేశాలు ముగియనున్నాయి. అయితే కాంగ్రెస్ ఉద్దండులైన రేవంత్ రెడ్డి, జానారెడ్డి, జీవన్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేకపోవడంతో అసెంబ్లీలో కరువు వచ్చినట్లుందని.. టీఆర్ఎస్‌ను ప్రశ్నించడానికి.. కౌంటర్లు ఇవ్వడానికి ఎవరులేరే..! అంటూ నెటిజన్లు సెటైర్లేస్తున్నారు.

అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు కేసీఆర్‌‌.. ప్రగతి భవన్‌ నుంచి నేరుగా గన్‌పార్క్‌కు వెళ్లి అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. కేసీఆర్ వెంట హోం మంత్రి మహమూద్ అలీ, హరీశ్ రావు, పోచారం, తలసాని శ్రీనివాస్, ఈటెల రాజేందర్ ఉన్నారు. ఇవాళ సాయంత్రం లేదా రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల ముందు కేసీఆర్ తన కేబినెట్‌లోని.. మంత్రుల జాబితాను విడుదల చేస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇదిలా ఉంటే.. మరోవైపు టీడీపీ నేతలు సైతం ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లి నివాళి అర్పించారు. అయితే ఈ కార్యక్రమానికి సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గైర్హాజరయ్యారు. ఖమ్మం జిల్లా టీడీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు గెలవగా... వారిలో ఒకరు కార్యక్రమానికి రాకపోవడంపై ఊహాగానాలు మొదలయ్యాయి. గత కొద్దిరోజులుగా సండ్ర సైకిల్ దిగి కారెక్కుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.