close
Choose your channels

జగన్ కీలక నిర్ణయం.. ‘తెలుగు’కు కాలం చెల్లిపోయింది!?

Wednesday, November 6, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

జగన్ కీలక నిర్ణయం.. ‘తెలుగు’కు కాలం చెల్లిపోయింది!?

అవును మీరు వింటున్నది నిజమే.. తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ‘తెలుగు’కు కాలం చెల్లిపోనుంది. మనం చిన్నప్పుడు అ అంటే అమ్మ.. ఆ అంటే ఆవు అని చదువుకున్నాం కదా.. ఇప్పుడు మన తర్వాత జనరేషన్.. మన పిల్లలు A అంటే ఆపిల్, B అంటే బ్యాట్ అని మాత్రమే చదువుకుంటారన్న మాట. ప్రభుత్వ నిర్ణయం ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అన్న నినాదాన్ని అవమానించినట్లేనన్న నమాట. అసలు ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకుందో తెలియదు కానీ.. ఇది మాత్రం పెద్ద సంచలన నిర్ణయమే.

సీఎంగా ప్రమాణం చేసిన నాటి నుంచి కీలక, సంచలన నిర్ణయాలతో ప్రభుత్వాన్ని సాగిస్తున్న వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తాజాగా మరో వివాదాస్పద నిర్ణయమే తీసుకున్నారు. ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్తు పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి అంటే 2020 నుంచి 01-08 తరగతులకు గాను తెలుగు మాధ్యమాన్ని రద్దు చేయనున్నట్లు సంబంధిత కార్యదర్శి ఓ ప్రకటనలో తెలిపారు. అంటే ఇకపై అన్నీ ఆంగ్లంలోనే అన్న మాట. అంతేకాదు.. తప్పనిసరిగా దీన్ని పాటించాలని ఆదేశాలు సైతం జారీ అయ్యాయి. ఇందుకు గాను ఉపాధ్యాయులకు వేసవి సెలవుల్లో శిక్షణ ఇవ్వాలని.. అంతేకాకుండా హ్యాండ్‌బుక్ రూపొందించాలని అధికారులను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సూచించారు. అంటే తెలుగును ఇక పూర్తిగా పక్కనెట్టేసినట్లేనన్న మాట. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇప్పటికే ఒకట్రెండు జీవోల విషయంలో తప్పటడుగులు వేసిన వైఎస్ జగన్ సర్కార్.. తాజాగా మరోసారి తప్పులో కాలేసిందని ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరిచేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించాలంటూ డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి. ఇంగ్గీష్‌తో పాటు తెలుగుకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. అలా చేయకపోతే.. ప్రభుత్వ నిర్ణయంతో తొలి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ లో మాతృభాషను కించపరిచినట్లవుతుందని విమర్శలు వస్తున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.