close
Choose your channels

సాగర్‌లో జానా పోటీ.. టీఆర్ఎస్, బీజేపీ గుండెల్లో గుబులు..!

Saturday, February 13, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సాగర్‌లో జానా పోటీ.. టీఆర్ఎస్, బీజేపీ గుండెల్లో గుబులు..!

కాంగ్రెస్ పార్టీ తరుఫున నాగార్జున సాగర్ ఉపఎన్నికలో తాను పోటీ చేస్తున్నానని మాజీ మంత్రి జానారెడ్డి ప్రకటించారు. అటు నియోజకవర్గ ప్రజల కోరికతో పాటు పార్టీ అభిప్రాయం, ప్రజాస్వామ్యాన్ని, నైతిక విలువలను కాపాడాలని తాను బరిలో దిగుతున్నట్టు వెల్లడించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలకున్న భ్రమలు క్రమక్రమంగా తొలిగిపోతున్నాయని.. జీహెచ్ఎంసీ ఫలితాలను ఉదాహరణగా పేర్కొన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో తమ పార్టీ నేతలను గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై సైతం జానారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ఏం చేసిందంటూ సీఎం కేసీఆర్‌ మాట్లాడుతున్నారని.. అసలు కాంగ్రెస్‌ చేసిన అభివృద్ధి వల్లే రాష్ట్రానికి ఇప్పుడు ఇంత ఆదాయం వస్తోందని జానారెడ్డి తెలిపారు.

ఇకపోతే.. కాంగ్రెస్ పార్టీ చాలా ఇంటెలిజెంట్‌గా జానారెడ్డిని నాగార్జునసాగర్ బరిలో నిలిపింది. ఆయనకున్న అనుభవం కానీ.. నియోజకవర్గంపై ఆయనకున్న పట్టు కానీ వేరొక నేతకు లేదంటే అతిశయోక్తి కాదు. అత్యధిక సార్లు విజయం సాధించి తన సత్తా ఏంటో చూపించారు. అత్యంత సౌమ్యుడు కావడంతో ఆయనను నియోజకవర్గ ప్రజలు ఎంతగానో అభిమానిస్తారు. ప్రతిపక్ష పార్టీలు సైతం జానారెడ్డిని మాట అనేందుకు సాహసించరు. చివరకు సీఎం కేసీఆర్ కూడా ఆయనను మర్యాదపూర్వకంగానే సంబోధిస్తారు. అలాంటి జానారెడ్డి నాగార్జున సాగర్‌ బరిలో దిగుతున్నారంటేనే టీఆర్ఎస్, బీజేపీలు ఒకింత భయపడుతున్నాయి. ఆయనకు ధీటైన నాయకుడిని బరిలో నిలపడం కోసం కసరత్తు చేస్తున్నాయి.

ఒకప్పుడు దేశాన్నేలిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలోనే ఆదరణ లేకుండా పోయింది. ఒకరకంగా నాయకత్వ లేమి తెలంగాణలో స్పష్టంగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మూడవ స్థానానికి పడిపోయింది. ఇప్పుడు పుంజుకోకుంటే ఇక మీదట కష్టమే. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకునే అధిష్టానం జానారెడ్డిని బరిలోకి దింపినట్టు తెలుస్తోంది. ఇక్కడ జానారెడ్డి గెలిస్తే టీఆర్ఎస్‌ పరిస్థితి దారుణంగా మారే అవకాశం ఉంది. అలాగే కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. ఇప్పటికే అటు దుబ్బాక.. ఇటు జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్‌కు గట్టి దెబ్బే తగిలింది. ఇప్పుడు సాగర్‌లో కూడా దెబ్బపడితే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఫలితం ప్రభావం చూపే అవకాశం ఉంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.