close
Choose your channels

బీజేపీలోకి జానారెడ్డి.. నాగార్జున సాగర్ నుంచి బరిలోకి?

Saturday, December 5, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బీజేపీలోకి జానారెడ్డి.. నాగార్జున సాగర్ నుంచి బరిలోకి?

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రభావం కాంగ్రెస్ పార్టీపై దారుణంగా పడనుందా? కౌంటింగ్ ముగిసిన గంటల్లోనే అనూహ్య పరిణామాలకు కాంగ్రెస్ పార్టీ వేదికవుతోందా? అంటే జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే నిజమేననిపిస్తోంది. ఒకవైపు కౌంటింగ్ జరుగుతుండగానే కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయగా.. కౌంటింగ్ పూర్తైన వెంటనే పీసీసీ అధ్యక్ష పదవికి ఆ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ పార్టీ కీలక నేత జానారెడ్డి ఆ పార్టీకి ఝలక్ ఇవ్వనున్నట్టు ప్రచారం జరుగుతోంది.

నిన్న గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ జరుగుతుండగానే కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ట్విట్టర్ వేదికగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ హవా కొనసాగించడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉద్యోగులు, పెద్దల అభిప్రాయాన్ని ప్రతిబింభించాయన్నారు. ఈ ఓట్లను పరిశీలిస్తే రెండు విషయాలు స్పష్టమవుతున్నాయన్నారు. సాధారణ ప్రజలు టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్నారని... వారంతా జీహెచ్ఎంసీలో బీజేపీ మాత్రమే టీఆర్ఎస్‌ను ఎదుర్కొంటుందని భావించారన్నారు. కాంగ్రెస్.. టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేదని ప్రజలు స్పష్టతనిచ్చారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
దీంతో కొండా విశ్వేశ్వరరెడ్డి భవిష్యత్‌లో బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

కాగా.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పీసీసీ అధ్యక్ష పదవికి ఆయన శుక్రవారమే రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఏఐసీసీకి పంపించారు. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు చోట్లే విజయం సాధించింది. ఉప్పల్, ఏఎస్‌రావునగర్‌లో ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు మాత్రమే గెలుపొందారు. ఇటీవల జరిగిన దుబ్బాక ఉపఎన్నికలో కూడా కాంగ్రెస్ పరాజయం పాలైంది. వరుస పరాజయాల కారణంగా మనస్థాపం చెందిన ఉత్తమ్ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

తాజాగా కాంగ్రెస్ పార్టీకి జానారెడ్డి ఝలక్ ఇచ్చి బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. ప్రస్తుతం కేరళలో ఉన్న జానారెడ్డితో బీజేపీ ఇప్పటికే టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. బీజేపీ ఇచ్చిన ఆఫర్‌కు జానారెడ్డి కూడా సరే అన్నట్లు సమాచారం. ఈనెల 7 న ఢిల్లీ వెళ్లి, బీజేపీ అగ్రనేతల సమక్షంలో కండువా కప్పుకోనున్నట్లు ఓ జాతీయ మీడియా కథనాన్ని వెలువరించింది. అంతేకాకుండా నాగార్జున సాగర్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీజేపీ తరుఫున బరిలోకి కూడా దిగనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో పట్టు నిలుపుకునేందుకు వివిధ పార్టీల సీనియర్లను తమ పార్టీలోకి లాక్కొనే దిశగా బీజేపీ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య హఠాన్మరణంతో నాగార్జున సాగర్‌‌ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ తరుఫున జానారెడ్డిని బరిలోకి దింపి మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.