అదృష్టం అందలం ఎక్కిస్తే...బుద్ధి బురదలోకి దిగిన్నట్టుంది: పవన్
అదృష్టం అందలం ఎక్కిస్తే...బుద్ధి బురదలోకి దిగిందన్నట్టు వైసీపీ వైఖరి ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. నేడు తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉదాసీనతవల్లే ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. దోషులు ఏ పార్టీవారైనా శిక్షించాల్సిందేనని పేర్కొన్నారు. పార్టీలకతీతంగా దోషులపై కఠిన చర్యలు చేపట్టాలని పవన్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఉదాసీనత వైఖరిని విడనాడాలన్నారు. బలమైన వ్యవస్థ, అధికార యంత్రాంగం ఉండి కూడా చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. భవిష్యత్‌లో పరిణామాలు కకావికలం అవుతాయి.. ఇప్పటికైనా అప్రమత్తం కావాలని సూచించారు.
మిగితా ఘటనలపై ఎందుకు స్పందించరు?
మతం కంటే మానవత్వం గొప్పదని జనసేన భావిస్తుందని పవన్ తెలిపారు. ఆలయాలపై దాడులు దురదృష్టకరమన్నారు. రామతీర్థం వచ్చి ఆందోళనలు చేపట్టడం పెద్ద విషయం కాదన్నారు. 142 ఆలయాలపై దాడులు జరిగితే ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. 40 సంఘటనలు మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారన్నారు. మిగితా ఘటనలపై ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. ఆదాయం కోసం పేకాట క్లబ్బులను నిర్వహిస్తున్నారని పవన్ మండిపడ్డారు. మీడియాలో వ్యతిరేక వార్తలు రాస్తే వారిని బెదిరిస్తున్నారన్నారని.. అధికార నేతలు నోటికివచ్చినట్టు మాట్లాడుతున్నారని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అరాచకాలన్నింటిపై సమిష్టిగా పోరాడాలి..
తిరుపతిలో పోటీపై పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చర్చించామన్నారు. దేవాలయాలపై దాడుల ఘటనలను చర్చించామని వెల్లడించారు. వైసీపీది ఫ్యూడలిస్టిక్ వైఖరిలా ఉందన్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తే ప్రజలు ఊరుకోరని.. రోడ్లపైకి వస్తారని పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు. రామతీర్థం వచ్చి ఆందోళన చేయడానికి తమకు క్షణం పట్టదన్నారు. ఎన్నికల్లో పోటీకి నిలబడిన వారిపై దాడులు చేసే సంస్కృతి మంచిది కాదన్నారు. ఈ అరాచకాలన్నింటిపై సమిష్టిగా పోరాడాలని దీని కోసం జనసేన పార్టీ ముందుంటుందని పవన్ స్పష్టం చేశారు.