close
Choose your channels

Teachers Day : ఈ కబోది ప్రభుత్వానికి కళ్లు తెరిపించండి .. అండగా వుంటా : ఉపాధ్యాయులకు పవన్ పిలుపు

Monday, September 5, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువులకు శుభాకాంక్షలు తెలియజేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన.. ఒక దేశం లేదా ఒక జాతి భవితవ్యానికి మార్గదర్శకులు ఉపాధ్యాయులేనని మన సమాజంతోపాటు తాను విశ్వసిస్తానని చెప్పారు. ఉపాధ్యాయునిగా ప్రస్థానాన్ని ప్రారంభించి సర్వోన్నతమైన రాష్ట్రపతి పదవి అలంకరించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం గురువులందరితో పాటు సర్వేపల్లిని గౌరవించుకున్నట్లేనని పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన మన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉప కులపతిగా పని చేయడం తెలుగువారికి దక్కిన భాగ్యమన్నారు.

నెల్లూరులో మా టీచర్స్ నా గురించి అడుగుతుంటారు:

వేద కాలం నుంచి భారతదేశంలో గురు-శిష్య అనుబంధం కాలాలకు అతీతంగా కొనసాగుతూనే ఉందని జనసేనాని గుర్తుచేశారు. తమ విద్యార్థుల ఉన్నతిని చూసి గురువులు పులకించిపోతారని, నెల్లూరులో తనకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులు ఇప్పటికీ నా బాల్య స్నేహితుల ద్వారా నా యోగక్షేమాల గురించి తెలుసుకుంటుంటారని పవన్ తెలిపారు. అది తెలిసినప్పుడల్లా మనసు ఆనందంతో నిండిపోతుందని జనసేన చీఫ్ ఉద్వేగానికి గురయ్యారు. వారు చెప్పిన మాటలు, బోధించిన పాఠాలు గుర్తుకు వస్తుంటాయని.. తల్లిదండ్రుల తరువాత గురువుల వద్దే అవాజ్యమైన వాత్సల్యం మనసును స్పర్శిస్తుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అటువంటి దైవ స్వరూపులైన గురువులందరూ సుఖ సంతోషాలతో విరాజిల్లాలని ఆయన ఆకాంక్షించారు.

వైసీపీ వేధింపులతో గురువులు నలిగిపోతున్నారు :

అయితే.. ఆనందోత్సాహాలతో జరుపుకోవాల్సిన ఉపాధ్యాయ దినోత్సవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కళావిహీనంగా కనిపించే పరిస్థితులు నెలకొనడం బాధ కలిగిస్తోందని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. వై.ఎస్.ఆర్.సి.పి. ప్రభుత్వం పెడుతున్న మానసిక క్షోభ, హింసకు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు ఈ వేడుకలు బహిష్కరించాలని తీసుకున్న నిర్ణయాన్ని బట్టి వారు ఎంతగా నలిగిపోతున్నారో తెలుపుతోందన్నారు. జ్ఞానాన్ని పంచే గురువులను వేధించిన వారందరు చరిత్రహీనులుగా మిగిలిపోయారని గత అనుభవాలు తేటతెల్లం చేస్తున్నాయని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. వేధింపులతో పాలిస్తున్న ఈ కబోది ప్రభుత్వానికి ఉపాధ్యాయులు కళ్ళు తెరిపించవలసిన సమయం ఆసన్నమైందన్నారు. ఉపాధ్యాయుల సానుకూల డిమాండ్లకు జనసేన పార్టీ తరపున సంపూర్ణ మద్దతు తెలుపుతున్నానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.