close
Choose your channels

Janasena Party : దోచుకోవడం , దాచుకోవడం.. ఎదురు తిరిగితే బ్లాక్‌మెయిలింగ్ : వైసీపీ పాలనపై పవన్ విమర్శలు

Monday, July 4, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

జనవాణి కార్యక్రమంలో వచ్చిన అర్జీల్లో ఎక్కువగా వ్యవసాయం , గృహ నిర్మాణం , విద్య మీదే వచ్చాయన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆదివారం విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో జరిగిన జనవాణి కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. సరైన గిట్టుబాటు ధర లేక, ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేక రైతులు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రశ్నిస్తే.. కేసులు పెట్టి వేధింపులు:

టిడ్కో ఇళ్ళు ఇవ్వడానికి సైతం ప్రభుత్వానికి మనసు రావడం లేదని.. లక్షల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించిన పేదలు దీని వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారని పవన్ వాపోయారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య దారుణంగా ఉందని.. ఏదైనా విషయం మీద నిలదీసినా, ప్రజాప్రతినిధులను ప్రశ్నించినా ప్రభుత్వ పథకాలు నిలుపుదల చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ కేసులు పెట్టి కక్ష సాధిస్తున్నారని.. బంగారు భవిత ఉన్న విద్యార్థుల మీద కూడా ఇష్టానుసారం పోలీస్ కేసులు పెట్టి బెదిరించడం దారుణమన్నారు. దీంతో యువత కూడా ఏదైనా ప్రశ్నించేందుకు ముందుకు రావడం లేదని... ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని సైతం నిర్వీర్యం చేస్తున్నారని పవన్ కల్యాణ్ తెలిపారు.

దాచుకోవడం, దోచుకోవడమే:

ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి ఉందని.. ప్రకాశం జిల్లా, గురజాల నియోజకవర్గం, బ్రాహ్మణపల్లి లో సరస్వతీ పవర్ అండ్ మినరల్స్ కంపెనీ కోసం 300 ఎకరాల భూమి తీసుకొని తర్వాత వారికి కనీసం ఉపాధి కల్పించకుండా పరిహారం ఇవ్వకుండా వైసీపీ నాయకులు ఇబ్బందులుపెడుతున్నారని ఆయన ఆరోపించారు. చాలా ప్రాంతాల నుంచి మంచి నీరు బాగాలేదని ఫిర్యాదులు వచ్చాయని... మైలవరం, జగ్గయ్యపేట, కైకలూరు లాంటి ప్రాంతాల్లో కూడా మంచినీటి నమూనాలను ప్రజలు తీసుకువచ్చి మరీ చూపించడం బాధించిందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల కోట్లు డబ్బులు దాచుకోవడం.. దోచుకోవడం తప్ప, కనీసం ప్రజలకు మంచినీళ్లు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉండడం శోచనీయమన్నారు.

కాపు కార్పోరేషన్‌కు నిధులు ఆపేస్తామని బెదిరింపులు:

ఈ ప్రభుత్వం కాపులకు విపరీతమైన ద్రోహం చేస్తోందని.. కాపులు ఎదురు తిరిగితే కాపు కార్పొరేషన్ కు వచ్చే నిధులు ఆపేస్తామని బెదిరింపులు చేస్తున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. అలాగే ముస్లిం వర్గాలకు చెందిన పథకాలను నిలుపుదల చేశారని... ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు మళ్లించడమే కాదు.. వారి సంక్షేమానికి ఉద్దేశించిన 27 పథకాలను రద్దు చేశారని ఆయన మండిపడ్డారు. దళితులు మావైపే అని చెప్పుకొనే వైసీపీ ప్రభుత్వం వారిని వంచన చేస్తోందని.. దీనిపై ఎస్సీ మేధావులు ఆలోచించాలని పవన్ కల్యాణ్ సూచించారు. అలాగే ఆటో డ్రైవర్లకు 10,000 డబ్బులు ఇచ్చి, వివిధ చలాన్ల రూపంలో అంత కంటే ఎక్కువగా డబ్బులు దండుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.