వైసీపీ సీక్రెట్స్‌ పై బాంబు పేల్చిన జనసేనాని!

  • IndiaGlitz, [Saturday,January 12 2019]

వైఎస్ జగన్- పవన్‌ను ఒక్కటి చేయడానికి కొందరు నేతలు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారా..?. 2014 ఎన్నికల్లో టీడీపీని గెలిపించడానికి కారణమైన పవన్‌‌తో ఈ ఎన్నికల్లో జగన్‌‌‌కు పనిపడిందా..? వీరిద్దరూ కలిస్తే కచ్చితంగా విజయమేనని కొందరు పక్క రాష్ట్రం నేతలు పొత్తు ప్రయత్నాలు చేస్తున్నారా..? వీరిద్దర్నీ కలపడానికి మూడో కంటికి తెలియకుండా రహస్య మంతనాలు జరిపారా..? అంటే ఇవన్నీ అక్షరాలా నిజమేనని స్వయానా జనసేన అధినేత పవన్ కల్యాణే చెప్పడం గమనార్హం.

సీక్రెట్స్ చెప్పేసిన పవన్..

గత కొన్నిరోజులుగా జిల్లాల వారిగా జనసైనికులతో పవన్ వరుస సమావేశాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఎన్నికల్లో ఏవిధంగా ముందుకెళ్లాలి..? టీడీపీ, వైసీపీలను ఏ విధంగా ఎదుర్కోవాలన్న విషయాలపై నేతలకు, ముఖ్య కార్యకర్తలకు పవన్ దిశానిర్దేశం చేస్తున్నారు. శుక్రవారం విజయవాడ కార్యకర్తల సమావేశంలో పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ తమ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తోందన్నదే ఆ వ్యాఖ్యల సారాంశం. అంతటితో ఆగని పవన్ కల్యాణ్.. మాతో కలిసి పొత్తుపెట్టుకోమని టీఆర్ఎస్ నేతలతో వైసీపీ మాట్లాడిస్తోందని జనసేనాని చెప్పుకొచ్చారు. ఓ వైపు జనసేనకు ఎలాంటి బలం లేదని వైసీపీనే చెబుతూ.. మాతోనే పొత్తుకు యత్నిస్తోందని పవనే స్వయంగా చెప్పడం గమనార్హం. అయితే ఈ వ్యాఖ్యలతో ఉన్నట్టుండి పవన్ బాంబు పేల్చడంతో.. అటు నెట్టింట్లో.. ఇటు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి.

ఆ టీఆర్ఎస్ నేతలెవ్వరో..!

ఇన్ని విషయాలు చెప్పిన పవన్.. పొత్తులు కుదిరేంచేందుకు యత్నించిన టీఆర్ఎస్ నేతలు ఎవరు..? వైసీపీ అధినేతే ఇలా చేయమన్నారా..? లేకుంటే ఇంకెవరైనా రహస్యంగా మంతనాలు జరిపిస్తున్నారా..? అనే విషయాలపై మాత్రం పవన్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. రాజకీయాల్లో ఆరోపణులు-ప్రత్యారోపణాలు, విమర్శలు- ప్రతివిమర్శలు షరా మామూలే. అయితే ఇప్పటికే వైసీపీ అధినేత మొదలుకుని.. వైసీపీ నేతల వరకూ పొత్తు ఎవరితోనూ పెట్టుకునే ప్రసక్తే లేదని కుండ బద్ధలు కొట్టిన సంగతి తెలిసిందే. ఆఖరికి ఇటీవల జరిగిన పాదయాత్ర ముగింపు సభలో సైతం జగన్.. ఒంటరిగానే చంద్రబాబుతో పోరాటం చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. సరిగ్గా 24 గంటలు గడిచిన తర్వాత పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పలు అనుమానాలకు తావిపిస్తోంది.

ఇప్పటికే పలువురు నోట పొత్తు మాటలు..!

గతం పార్లమెంట్ ఎన్నికలు జరిగిన సమయంలో పవన్ తమ పార్టీకి దగ్గరగా ఉన్నారని వైసీపీ మాజీ ఎంపీ వరప్రసాద్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన మీడియా ముందుకొచ్చి పవన్ గురించి మాట్లాడిన దాఖలాల్లేవ్. అయితే ఇటీవల మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు అవును.. పవన్-నేను కలిస్తే తప్పేంటి.. జగన్‌కెందుకు అంత బాధ అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించిన విషయాలు అందరికీ గుర్తుండే ఉంటాయి. ఇంటర్వ్యూలు మొదలుకుని తాజాగా జరిగిన బహిరంగ సభలో పవన్‌‌తో పొత్తు ఎవరితో పెట్టుకునేది లేదని సింగిల్‌‌గానే పోటీ చేస్తామని జగన్ చెప్పారు. మరోవైపు పవన్ కూడా కచ్చితంగా తాము ఏ పార్టీకి మద్ధతిచ్చేది లేదని ఈ ఎన్నికల్లో జనసేన సత్తా చూపించడానికి వ్యూహాలు రచిస్తున్నారు. ఇలాంటి టైమ్‌లో పొత్తు యత్నాలపై పవన్‌ను ఎందుకు బాంబు పేల్చారో అర్థం కాని పరిస్థితి.

ఇది ఎంత వరకూ నిజం..?

పవన్ కల్యాణ్ వ్యాఖ్యల్లో నిజం ఎంత మేరకు ఉంది..? ఒక వేళ నిజంగానే పవన్- వైఎస్ జగన్ మధ్యలో టీఆర్ఎస్ నేతలున్నారా..? లేకుంటే ఎలాగూ ఎన్నికలు వస్తున్నాయ్ కదా అని పవనే ఓ రాయేస్తున్నారా..? అనే విషయాలపై స్పష్టత రాలేదు. అయితే పవన్ వ్యాఖ్యలపై ఇప్పటి వరకూ వైసీపీ నేతలు స్పందించలేదు. మరోవైపు టీఆర్ఎస్ నేతలు సైతం ఈ ఆరోపణలపై స్పందించకపోవడం గమనార్హం. అయితే అటు టీఆర్ఎస్.. ఇటు వైసీపీ నేతలు స్పందిస్తే గానీ ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పడే అవకాశాల్లేవ్.