close
Choose your channels

Pawan Kalyan : ఏపీలో అడుగుపెట్టిన ‘‘వారాహి’’.. దుర్గమ్మ ఆశీస్సులు పొందిన పవన్ కల్యాణ్

Wednesday, January 25, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన రాష్ట్ర వ్యాప్త పర్యటనల కోసం సిద్ధం చేసిన ‘‘వారాహి’’ ప్రచార రథం ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టింది. బుధవారం విజయవాడ ఇంద్రకీలాద్రికి చేరుకున్న పవన్ కల్యాణ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారాహి రథానికి కూడా ఆయన ప్రత్యేక పూజలు జరిపించారు. ఇప్పటికే తెలంగాణలోని కొండగట్టు, ధర్మపురి ఆలయాల వద్ద వారాహికి పవన్ కల్యాణ్‌ ప్రత్యేక పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే. పవన్‌కి దుర్గగుడి ఈవో భ్రమరాంభ, అధికారులు, వేదపండితులు సంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికి అమ్మవారి తీర్ధ ప్రసాదాలు , ఆశీర్వచనం అందించారు.

అభిమానులతో కిక్కిరిసిపోయిన దుర్గగుడి పరిసర ప్రాంతాలు :

అంతకుముందు విజయవాడకు చేరుకున్న పవన్ కల్యాణ్‌కు జనసేన నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. పవన్ రాకతో దుర్గగుడి , కనకదుర్గ ఫ్లై ఓవర్, వన్ టౌన్ పరిసర ప్రాంతాల్లో జనంతో కిక్కిరిసిపోయాయి. ఆయనను చూసేందుకు చలిని కూడా లెక్క చేయకుండా అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో పవన్ వారాహిపైకెక్కి ప్రజలకు అభివాదం చేశారు. గుంటూరు, కందుకూరు తొక్కిసలాట ఘటనలను దృష్టిలో వుంచుకుని పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ కల్యాణ్ పార్టీ నేతలతో సమావేశం కానున్నారు.

వారాహిపై వైసీపీ రాద్ధాంతం:

కాగా.. వారాహికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపక్ష వైసీపీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. దానికి వారాహి కాకుండా నారాహి అని పేరు పెట్టుకోవాల్సిందని చురకలంటించారు. ఇంకొందరైతే.. ఈ వాహనానికి వినియోగించిన రంగును సామాన్యులు ఉపయోగించకూడదని, పవన్‌కి ఆ మాత్రం తెలియదా అంటూ ఫైర్ అయ్యారు. దీనికి జనసేన పార్టీ నేతలు కూడా ధీటుగా బదులిచ్చారు. పవన్ జనంలోకి వెళితే తమ పరిస్ధితి ఏంటోనన్న భయంతోనే అధికార పార్టీ ఈ రకమైన వ్యాఖ్యల్ని చేస్తుందంటూ కౌంటరిచ్చారు. వివాదం నేపథ్యంలో తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వారాహికి క్లీన్ చీట్ ఇచ్చారు. వాహనాల రంగులకు కూడా కోడ్స్ వుంటాయని.. భారత సైన్యం ఉపయోగించే కలర్ కోడ్ 7B8165 కాగా... జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొత్తగా తయారు చేయించుకున్న వారాహి కలర్ కోడ్ 445c44 అని మంత్రి స్పష్టం చేశారు. ఈ రంగుపై ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని పువ్వాడ తెలిపారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.