close
Choose your channels

Janasena : మేమూ లోకల్ మాసే.. మీకంటే బాగా బూతులు తిట్టగలం, జాగ్రత్త: వైసీపీ నేతలకు పవన్ వార్నింగ్

Monday, July 18, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విద్యా రంగం మీద దాదాపు రూ.55 వేల కోట్లు ఖర్చు చేశామని చెబుతున్న ప్రభుత్వం దాని లెక్కలు బయటకు తీయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఆదివారం భీమవరంలో జరిగిన జనవాణి కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం పవన్ మాట్లాడుతూ.. నాడు - నేడు, అమ్మ ఒడి అంటూ రకరకాల పేర్లు పెట్టి లెక్కలు చెప్పే ప్రభుత్వం విద్యార్థుల ఉత్తీర్ణతలో ఎందుకు వెనుక బడిందని ప్రశ్నించారు. వరల్డ్ విజన్ సంస్థ దేశంలో విద్యా రంగం అభివృద్ధి మీద కృషి చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ పేరు ఎక్కడ లేదని పవన్ దుయ్యబట్టారు. డిగ్రీ చదివి ఉద్యోగం తెచ్చుకోని యువత రాష్ట్రంలో ఎక్కువవుతున్నారని... గత మూడేళ్లలో 36 ఉద్యోగాలు ఇచ్చిన గొప్ప ప్రభుత్వం ఇదేనంటూ జనసేనాని సెటైర్లు వేశారు. యువత నిరుద్యోగితలో రాజస్థాన్, బీహార్ సరసన ఆంధ్ర ప్రదేశ్ నిలిచిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని పవన్ కల్యాణ్ మండిపడ్డారు.

విలీనాల పేరుతో అయోమయం:

విద్యా రంగంలో జీవో నెంబర్ 117 తీసుకొచ్చి విద్యా వ్యవస్థను పూర్తిగా అయోమయంలో పడేసారని..విలీనాల పేరుతో పాఠశాలల విద్యార్థులకు యాతన మిగిల్చారని జనసేనాని ఎద్దేవా చేశారు. స్కూల్ ఎడ్యుకేషన్ ఆరు రకాలుగా విభజిస్తూ తీసుకొచ్చిన జీవోలో పూర్తిగా విద్యావ్యవస్థను తికమక పరిచారని పవన్ చురకలు వేశారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ప్రతి 25 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలని.. అయితే ప్రస్తుతం విలీనాల పేరుతో విద్యారంగం అస్తవ్యస్తం కావడంతో ఇరుకు తరగతుల్లో చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని జనసేనాని పేర్కొన్నారు.

ప్రపంచ బ్యాంక్ చెప్పినట్లు ఏపీ ఆడుతోంది :

ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకున్న అప్పు నిబంధనల మేరకు "సాల్ట్" పాలసీను అమలు చేస్తున్నారని.. దీనిలో భాగంగానే టీచర్ల సంఖ్యను తగ్గించారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. మరోపక్క ఎయిడెడ్ స్కూల్స్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని.. ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏ పాలసీ కూడా సరిగా లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఆడపిల్లలకు కనీసం స్కూళ్లలో మరుగుదొడ్లు కూడా లేని పరిస్థితి ఉందంటే ఎటు వెళ్తున్నామో గుర్తించాలని పవన్ పిలుపునిచ్చారు. అన్నొచ్చాడు.. మామయ్య వచ్చాడు అని మీరు పిలిపించుకోవద్దని.. తాము మిమ్మల్ని ఆప్యాయంగా పిలిచిన రోజు మీరు విజయం సాధించినట్లు లెక్క అని జనసేనాని వ్యాఖ్యానించారు.

గోదావరి జిల్లాల్లోనూ మూత్ర పిండాల వ్యాధులు:

జనవాణి కార్యక్రమంలో ఎన్నో సమస్యలు తన దృష్టికి వచ్చాయని పవన్ చెప్పారు. గతంలో నేను పరిశీలించిన భీమవరం డంపింగ్ యార్డు సమస్యతో పాటు వివిధ పట్టణాలు, గ్రామాల్లో డంపింగ్ యార్డుల సమస్యలు తన దృష్టికి వచ్చాయన్నారు. చెరువులు, కుంటలు ఇతర ప్రాంతాల్లో చెత్తను ఇష్టానుసారం డంపింగ్ చేయడంతో తాగునీరు కలుషితమవుతోందని , గోదావరి జిల్లాలో కూడా మూత్రపిండాల వ్యాధులు ఎక్కువవుతున్నాయని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.

డంపింగ్‌లో భోపాల్‌ను ఆదర్శంగా తీసుకోండి:

డంపింగ్ యార్డ్ సమస్యను అత్యంత చాకచక్యంగా పరిష్కరించిన భోపాల్ నగరాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రతి జిల్లాలోనూ డంపింగ్ యార్డుల సమస్యలను తీర్చాలని.. తుందుర్రు ఆక్వా ఫ్యాక్టరీ కాలుష్యం కూడా తన దృష్టికి వచ్చిందని పవన్ తెలిపారు. అవినీతి, దోపిడీ విషయాలతోపాటు వంతెనలు, రోడ్ల సమస్యలు నా దృష్టికి వచ్చాయన్నారు. ఆడపడుచుల స్వయం సహాయక సంఘాల సమస్యలు తెలుసుకున్నానని... రాష్ట్రంలో మౌలిక వసతులు కల్పించడానికి మీకు ఎందుకు మనసు రాదని జనసేనాని ప్రశ్నించారు. మీ జేబులో డబ్బులు రూపాయి తీయడానికి మీకు ఎలాగూ మనసు ఒప్పదని.. కనీసం ప్రజాధనం నుంచి అయినా ఖర్చు పెట్టాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.

మీ కంటే బాగా బూతులు తిట్టగలం .. జాగ్రత్త :

ఆంధ్రప్రదేశ్ దేనిలో మొదటి స్థానంలో ఉన్నా లేకున్నా గంజాయి సాగు, రవాణాలో మాత్రం మొదటి స్థానంలో ఉందని జనసేనాని చురకలు వేశారు.యువతలో చైతన్యం వస్తే తమకు ఎక్కడ ఇబ్బంది అవుతుంది అన్న భయంతో యువతరాన్ని గంజాయి మత్తులో ఉంచాలని ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోందని పవన్ ఆరోపించారు. ప్రతి ఒక్కరూ వాడేం చేశాడు వీడేం చేశాడు అని లెక్కలు వేయకుండా.. మీ రాష్ట్రానికి మీరేం చేయదలుచుకున్నారో ముందు నిర్ణయించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ను రక్షించడం ఎవరి తరం కాదని.. ఏమైనా అడిగితే బూతులతో మంత్రులు రెచ్చిపోతున్నారని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం కూడా లోకల్ మాసేనని.. ఇక్కడ బడుల్లో చదువుకున్నవాళ్ళమేనని, మీరు బూతులు తిడితే అంతకన్నా దారుణంగా బదులు ఇవ్వగలమని ఆయన హెచ్చరించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.