close
Choose your channels

వైసీపీకి దూరంగా ఎస్సీలు, బీసీలు .. కోనసీమ అల్లర్ల వెనక ఓట్ల రాజకీయం : జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ

Thursday, May 26, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏదైనా సమస్య వస్తే పరిష్కరించాల్సిన ప్రభుత్వమే సమస్య సృష్టించాలని చూస్తోందని ఆరోపించారు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ. గురువారం విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ తీరుకు ప్రత్యక్ష ఉదాహరణే అమలాపురం అల్లర్లు అని చెప్పారు. అమలాపురంలో నిరసన వ్యక్తం చేస్తే దానికి రాజకీయ రంగు పులమడం అధికార పార్టీ కుట్రలో భాగమని సత్యనారాయణ ఆరోపించారు. శాంతియుత మార్గంలో సమస్యకు పరిష్కారం చూపించాల్సిన ప్రభుత్వం కావాలనే దీనిని పెంచి పెద్దది చేయాలని చూస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.

అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తే వెంటనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. దానిని పూర్తిగా పక్కన పెట్టేసి, ప్రాథమిక విచారణ కూడా పూర్తి కాక ముందే ప్రభుత్వంలోని పెద్దలు అల్లర్లను ప్రతిపక్షాల మీదకు తోసేసే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. అందరినీ కూర్చొబెట్టి మాట్లాడితే నిమిషాల్లో సమస్య పరిష్కారం అవుతుందని.. కాని అది ఈ ప్రభుత్వానికి అక్కర్లేదని సత్యనారాయణ దుయ్యబట్టారు. వైఎస్ఆర్సీపీకి చెందిన ఎమ్మెల్సీ మీద పడిన హత్య కేసు మరకను, గడపగడపకు ఎదురవుతున్న పరాభవాన్ని తప్పించుకోవడానికే ప్రభుత్వం ఈ కుట్రకు తెరలేపిందని ఆయన ఆరోపించారు.

అంబేద్కర్ మీద ఈ ప్రభుత్వానికి నిజమైన ప్రేమ ఉంటే కచ్చితంగా అంబేద్కర్ పేరును మొదటే పెట్టేదని సత్యనారాయణ ధ్వజమెత్తారు. అలాకాకుండా ఇప్పటికిప్పడు దీనిని ఓ ప్రణాళిక ప్రకారమే ఈ ప్రభుత్వం తెరమీదకు తెచ్చిందని ఆయన ఆరోపించారు. 28 అంశాల్లో ఎస్సీలను మోసం చేశారని.. ఎస్సీల మీద ఎంతో ప్రేమ ఉందని చెప్పుకునే ఈ ప్రభుత్వం... ఎస్సీలకు సంబంధించిన 28 పథకాలను రద్దు చేసిందని సత్యనారాయణ గుర్తుచేశారు. 11 వేల ఎకరాల భూమిని ఎస్సీల వద్ద నుంచి బలవంతంగా లాక్కుందని.. ఈ రోజు విజయనగరంలో ఎస్సీ సంఘాల సమావేశాన్ని అడ్డుకుందని ఆయన మండిపడ్డారు.

అంబేద్కర్ విదేశీ విద్యా పథకం, బుక్ బ్యాంకు స్కీం, ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన, ఎస్సీ, ఎస్టీలకు స్టార్టప్ ఇండియా లోన్లు నిలిపివేత, జీవో నంబరు 172తో ఎస్సీ, ఎస్టీ పిల్లలకు చదువు దూరం, కార్పొరేషన్లు నిర్వీర్యం, ఎస్సీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలను దూరం చేసి దళితులకు ద్రోహం చేస్తూ ఎస్సీలకు సంక్షేమం చేస్తున్నామని మొసలికన్నీరు కారుస్తోందని బొలిశెట్టి విమర్శలు చేశారు. ప్రతి విషయంలో ఎస్సీలను చిన్నచూపు చూస్తున్న ప్రభుత్వం.. కులాల కుంపటి రాజేసి దళితుల్ని సమిధలు చేసి ఓట్ల రాజకీయం చేస్తోందని ఆరోపించారు. ఎస్సీ, బీసీలు వైఎస్సాఆర్సీపీకి దూరమవుతున్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం వారిలో విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తోందని సత్యనారాయణ మండిపడ్డారు. ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, వెంటనే అన్ని పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి.. కోనసీమలో ఎలాంటి అలజడులు లేకుండా చూడాలని బొలిశెట్టి డిమాండు చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.