చర్యలు తీసుకోకుండా, తల్లి పెంపకమే తప్పు అంటారా... ఏపీలో అత్యాచారాలపై నాదెండ్ల మనోహర్ ఆగ్రహం

రాష్ట్రంలో వరుసగా ఆడబిడ్డలపై అత్యాచారాలు, వేధింపులపై జనసేన పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. చర్యలు తీసుకోవాల్సిందిపోయి.. బాధ్యత కలిగిన మంత్రులు తల్లి పెంపకమే తప్పు అంటూ తప్పించుకొంటున్నారని ఆయన ఫైరయ్యారు. ఇది కచ్చితంగా పాలకుల వైఫల్యమేనని నాదెండ్ల మనోహర్ దుయ్యబట్టారు. ఈ పరిస్థితులను ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారని .. వైసీపీ ప్రభుత్వం చేసిన దిశ చట్టం ఎటుపోయిందని ఆయన ప్రశ్నించారు. మహిళలకు రక్షణ ఇవ్వాలని ప్రశ్నించినా ... వినతి పత్రం ఇవ్వబోయినా, నిరసన తెలిపినా కేసులు నమోదు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్‌చార్జ్ కోట వినుత అధ్వర్యంలో తిరుపతిలో మహిళలకు రక్షణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపడితే అడ్డుకోవడం భావ్యం కాదని నాదెండ్ల మనోహర్ హితవు పలికారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వినుత, ఆమె భర్త కోట చంద్రబాబు, ఇతర నాయకులపై పోలీసులు అనుసరించిన వైఖరి అప్రజాస్వామికమన్నారు. అరెస్టు చేసిన విధానాన్ని , పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడాన్ని ఖండిస్తున్నామని నాదెండ్ల చెప్పారు.

అటు నిన్న కర్నూలులో జరిగిన జనసేన కౌలు రైతు భరోసా యాత్రలోనూ రాష్ట్రంలో అత్యాచారాల ఘటనపై స్పందించారు పవన్ కల్యాణ్. రోజుకో అత్యాచార ఘటన మనసును బాధ పెడుతోందని... పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పే పరిస్థితి వచ్చిందని... వీటిపై దృష్టి నిలిపి, శాంతిభద్రతలను అదుపులోకి తీసుకురావాల్సిన ప్రభుత్వం, బాధితులకు అండగా నిలబడాల్సిన ప్రజాప్రతినిధులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

తల్లి పెంపకం బాగా లేకుంటేనే అఘాయిత్యాలు జరుగుతాయని బాధ్యతగల పదవుల్లో ఉన్నవారు మాట్లాడడం అత్యంత బాధాకరమని పవన్ వ్యాఖ్యానించారు. ఆడబిడ్డల కన్నీళ్లు తుడవలేని అధికారం ఎందుకు అని జనసేన అధినేత ప్రశ్నించారు. కర్నూలు జిల్లాకు చెందిన సుగాలి ప్రీతి అనే విద్యార్థినికి కనీస న్యాయం చేయలేని ప్రభుత్వ తీరు మీద పోరాడిన విషయాన్ని పవన్ గుర్తుచేశారు. దీనిపై వైసీపీ పాలకులు అనవసర చర్చలు పక్కనపెట్టి .. అఘాయిత్యాలు అరికట్టేందుకు కఠినంగా వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యవహారాలపై ప్రశ్నిస్తూనే ఉంటానని... మీ అందరి జీవితాల కోసం బాధ్యత తీసుకంటాని పవన్ స్పష్టం చేశారు.

More News

మేజర్ ట్రైలర్ : చూస్తున్నంత సేపు ఉద్వేగం.. సెల్యూట్ కొట్టాల్సిందే

26/11 ముంబయి ఉగ్రవాద దాడుల్లో అమరుడైన మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ జీవిత కథ ఆధారంగా అడివి శేష్ హీరోగా ‘‘మేజర్’’

ఒక్కసారి అవకాశమివ్వండి.. కోట్ల మంది కన్నీరు తుడుస్తా : కౌలు రైతుల భరోసా యాత్రలో పవన్

ఒక్కసారి అవకాశమిస్తే.. కోట్ల మంది కన్నీరు తుడుస్తానన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

కర్నూలు జిల్లాలోని కొణిదెల నా ఇంటి పేరు.. భయపెడితే భయపడే రకం కాదు: పవన్ కల్యాణ్

కర్నూలు మసూరి బియ్యానికి దేశవ్యాప్తంగా గుర్తింపు వుందని.. .

సింగిల్‌గా రమ్మనడానికి మీరెవరు.. మీ అతి తగ్గించుకోండి : వైసీపీ నేతలకు పవన్ హెచ్చరిక

వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.

పాన్ ఇండియా గా రా బోతున్న లవ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ 'ది గార్డ్ 2020'

వీరాజ్ రెడ్డి చేలం హీరోగా, జగ పెద్ది దర్శకత్వంలో, అనసూయ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం గార్డ్ 2020.