close
Choose your channels

Janasena : అమ్ముడుపోతారంటూ జగన్ వ్యాఖ్యలు.. కాపు నాయకులకు పౌరుషం లేదా: జనసేన నేత విజయ్ కుమార్

Saturday, July 30, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

Janasena : అమ్ముడుపోతారంటూ జగన్ వ్యాఖ్యలు..  కాపు నాయకులకు పౌరుషం లేదా: జనసేన నేత విజయ్ కుమార్

కాపుల సంక్షేమానికి సంబంధించి ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై విమర్శలు గుప్పించారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్. హైదరాబాద్‌లోని జనసేన కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాపుల సంక్షేమం కోసం ఏటా రూ.2 వేలు కోట్లు కేటాయిస్తామని చెప్పారంటూ మండిపడ్డారు. గత మూడేళ్లలో కాపులకు ఖర్చు చేసిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. వివిధ పథకాలకు ఇచ్చిన నిధులన్నీ కాపుల కోటాలో చూపిస్తూ మోసం చేయడం మానుకొని, కాపులకు ఈ ప్రభుత్వం చేసిన అసలైన లబ్ధిని చూపించాలని ఆయన ఎద్దేవా చేశారు. ఈబీసీ కోటాలో కాపులకి ఉన్న రిజర్వేషన్ తొలగించి కాపు జాతికి ద్రోహం చేసింది జగన్ రెడ్డి అని విజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాపులకు రిజర్వేషన్లు ఇవ్వనని తేల్చిచెప్పేశారు:

కాపులకు ఎలాంటి రిజర్వేషన్లు ఇచ్చేది లేదని ఎన్నికల సభల్లో ఖరాఖండిగా చెప్పిన ఈ ముఖ్యమంత్రి కాపులకు లబ్ధి చేశారంటే నమ్మే పరిస్థితి లేదని ఆయన దుయ్యబట్టారు. కాపు మంత్రులను కేవలం మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌ని తిట్టించడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారని విజయ్ కుమార్ ఫైరయ్యారు. వారికి మరే పనీ ఉండదని... అధికారం అసలే ఉండదని చురకలు వేశారు. ఈబీసీ రిజర్వేషన్లలోనూ ఈ ప్రభుత్వం కాపులకు అన్యాయం చేసిందని.. కాపులకు ప్రత్యేకంగా ఇచ్చిన 5 శాతం కోటాను కూడా తీసేసి.. కాపులకు ఏదో అద్భుతం చేశామని ఈ ముఖ్యమంత్రి చెప్పడం సిగ్గుచేటన్నారు. సీఎం మాటలను ఎవరూ నమ్మే పరిస్థితి లేదని... వివిధ పథకాల ద్వారా కాపులకు అందిన ప్రతిఫలాన్ని సైతం కాపుల సంక్షేమం కోటాలో పెట్టడం ఈ ప్రభుత్వం ఆడుతున్న నాటకంలో భాగమేనని విజయ్ కుమార్ ఆరోపించారు,

బటన్ రెడ్డి గారూ... పిల్లికి చారలుంటే పులి కాదు:

కాపులను ప్రతిసారీ అవమానిస్తూ... కాపు సామాజిక వర్గ నేతలతోనే బూతులు తిట్టిస్తున్న ఈ ముఖ్యమంత్రి తీరును కాపు సోదరులు గమనిస్తున్నారని విజయ్ కుమార్ హెచ్చరించారు. ఏవేవో లెక్కలు చెప్పి, కాపులకు ఏదేదో చేస్తున్నాం అని మభ్యపెట్టాలని చూస్తున్న ఈ ప్రభుత్వ తీరును ప్రతి ఒక్కరూ ఎండగట్టాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. బటన్ నొక్కితే అద్భుతాలు జరిగిపోతాయని భావిస్తున్న ఈ ముఖ్యమంత్రి కాపు కార్పొరేషన్ ను పూర్తిగా నిర్వీర్యం చేశారని.. దాని నుంచి ఎలాంటి ప్రయోజనం లేకుండా ఈ ప్రభుత్వం చేసిందని విజయ్ కుమార్ ధ్వజమెత్తారు.

కనీసం కాపు కార్పొరేషన్ ఛైర్మెన్ ఎవరో కూడా సగటు కాపులకు తెలియదని... కాపులకు అద్భుతాలు చేశామని చెబితే, ఎవరూ నమ్మే పరిస్థితి లేదనే విషయాన్ని ఈ బటన్ రెడ్డి గుర్తుంచుకోవాలని ఎండగట్టారు. కాపులు అమ్ముడుపోతారు అని అవమానిస్తుంటే వేదిక మీద ఉన్న కాపు నేతలకు పౌరుషం రాలేదా అని విజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లికి పులి చారలు ఉన్నంత మాత్రాన పులి కాదు.. అలాగే కాపులకు ప్రత్యేక నిధులు ఇవ్వకుండా వేరే పథకాలు పేరుతో ఉన్న నిధులు ఇచ్చినంత మాత్రాన కాపు సంక్షేమం కాదు అనే విషయాన్నీ బటన్ రెడ్డి గారూ, ఆయన అభిమానులు గుర్తుంచుకోవాలని విజయ్ కుమార్ చురకలు వేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.