close
Choose your channels

‘అన్నా రాంబాబుపై పోటీకి వెంగయ్య భార్యను నిలుపుతాం’

Monday, January 25, 2021 • తెలుగు Comments

‘అన్నా రాంబాబుపై పోటీకి వెంగయ్య భార్యను నిలుపుతాం’

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కి ఎమ్మెల్యే అన్నా రాంబాబు సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఆయన సవాల్‌కు జనసేన పార్టీ ఒంగోలు పార్లమెంట్ ఇన్‌చార్జి షేక్ రియాజ్ సమాధానమిచ్చారు. తన మీద పోటీ చేసి గెలవాలని గిద్దలూరు శాసనసభ్యులు అన్నా రాంబాబు గారు మాట్లాడటం హాస్యాస్పదమని రియాజ్ ఎద్దేవా చేశారు. రాంబాబుతో పోటీకి ఆయన బెదిరింపులతో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న వెంగయ్య నాయుడి భార్యను నిలుపుతామని స్పష్టం చేశారు. ఆమెపై గెలిచి చూపించాలని సవాల్ విసిరారు.  ఆ ఎన్నికల్లో రాంబాబు ఓడిపోతే వెంగయ్య నాయుడు ఆత్మహత్యకు తాను, తన అనుచరులే కారణమని ఒప్పుకోవాలని రియాజ్ పేర్కొన్నారు. రాంబాబు రాజీనామా చేస్తే టికెట్ ఇవ్వడానికి కూడా వైసీపీ సిద్ధంగా లేదని అన్నారు.

సోమవారం సాయంత్రం రియాజ్ మీడియాతో మాట్లాడుతూ “అన్నా రాంబాబు గారు గతం మరిచిపోయినట్లు ఉన్నారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసిన ఆయన... గెలవలేని స్థితిలో ఉంటే పవన్ కళ్యాణ్ గారే వచ్చి ప్రచారం చేసి గెలిపించిన విషయం మరిచిపోయారా? 2014 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన మీరు ఓడిపోతారన్న భయంతో ... పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చి ప్రచారం చేయాలని బతిమిలాడిన సంగతి గుర్తు లేదా? చేసిన మేలు మరిచిపోయి ఇవాళ పవన్ కల్యాణ్ గారి మీద అవాకులు చెవాకులు పేలుతారా?’’ అని ప్రశ్నించారు.  

ఏ ఎండకా గొడుగు పడతారు

అన్నా రాంబాబు గారి చరిత్ర చూసుకుంటే... ఆయన 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యాక అప్పటి ముఖ్యమంత్రులు అయిన రోశయ్య గారికి, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారికి భజన చేస్తూ బతికారు. 2014లో తెలుగుదేశం పార్టీలో చేరి చంద్రబాబు నాయుడు గారికి భజన చేశారు. ఆ సమయంలో జగన్మోహహన్ రెడ్డి గారిని ఎట్టిపరిస్థితుల్లో నమ్మొద్దని  గిద్దలూరులో ధర్నా కూడా చేశారు. తర్వాత 2019లో వైసీపీలో చేరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు... మా నాయకుడు అంటున్నారు. ఏ ఎండకు ఆ గొడుకు పడుతూ... ప్రతి ఐదేళ్లకోసారి పార్టీ మారిన చరిత్ర మీది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మీరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో మీకే తెలియదు. మీరు కూడా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేవారే.

రాంబాబు ఆస్తులు అమ్ముకోలేదు.. పెంచుకున్నారు

ఆస్తులు అమ్ముకొని ప్రజాసేవ చేస్తున్నామని అన్నా రాంబాబు గారు అంటున్నారు. ఆయన ఆస్తులు అమ్ముకొని రాజకీయాలు చేయలేదు.. ఆస్తులు పెంచుకోవడానికి రాజకీయాలు చేశారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో కూడా సంపాదించడానికే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు కూడా. 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసినప్పుడు అఫిడవిట్ లో ఆయన నమోదు చేసిన వివరాల ప్రకారం అప్పట్లో ఆయన ఆస్తులు విలువ కోటి రూపాయలు ఉంటే అప్పులు రెండు కోట్లు ఉన్నాయి. 2014లో ఆయన ఆస్తులు రూ. 27కోట్లకు, 2019లో రూ. 42 కోట్లకు పెరిగాయి. కనుక ఆయన ఏ ఆస్తులు అమ్ముకొని ప్రజాసేవ చేశారో గిద్దలూరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది..

గిద్దలూరు నియోజకవర్గంలో ఒక మహిళను బెదిరించి ఆస్తులు రాయించుకుంటే... ఆ మహిళ మీ మీద కేసు పెట్టింది. ఆ కేసులో ఎక్కడ శిక్ష ఖరారు అవుతుందో అని భయపడి కొందరు పెద్దల ద్వారా రాజీ చేయించుకొని, ఆమె కాళ్ల మీద పడి తప్పు ఒప్పుకున్న సంగతి మరిచిపోయారా? మీరు బూతులు మాట్లాడుతూ అది సాంప్రదాయమైన భాష అంటున్నారు. రేపు పదవికి రాజీనామా చేసి ఇవే బూతులతో ప్రజలను సంబోధిస్తూ ఓట్లు అడిగితే తెలుస్తుంది. మీరు మాట్లాడేది బూతులా? సాంప్రదాయ భాషా అని. మీ నియోజకవర్గంలో ఇంత జరుగుతున్నా మీ సహచర ఎమ్మెల్యేలుగానీ, మంత్రులుగానీ మీకు అనుకూలంగా ఒక్క మాట కూడా మాట్లాడటం లేదంటేనే అర్థం చేసుకోవచ్చు పార్టీలో మీ పరిస్థితి ఏంటనేది. గిద్దలూరు ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మీరు ఎప్పుడు రాజీనామా చేస్తే అప్పుడు డిపాజిట్లు కూడా రాకుండా ఓడించాలని చూస్తున్నారు.

భూకబ్జాలు చేసి ఆస్తులు కూడబెట్టారు

శ్రీ పవన్ కళ్యాణ్ గారు యువతకు దిశానిర్దేశం చేస్తున్నారు. యువతను చెడగొట్టేది అన్నా రాంబాబు, వైసీపీ నాయకులే. అవినీతి కేసుల్లో ఇరుక్కొని జైలుకు వెళ్తొచ్చిన వ్యక్తి మీ పార్టీ అధ్యక్షులు... ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అలాంటి వ్యక్తి పార్టీలో ఉన్న మీరు నీతి, నిజాయితీల గురించి మాట్లాడటం హాస్యాస్పదం. అన్నా రాంబాబు పేరిట ఉన్న అసెంబ్లీ స్టిక్కర్ తో ఉన్న కారులో కోట్ల రూపాయల అక్రమ నగదు చెన్నై శివార్లలో పోలీసు తనిఖీల్లో దొరికిన మాట వాస్తవమా కాదా? అది తన స్టిక్కర్ కాదు.. ఎలా వెళ్ళిందో తెలియదు అంటూ బుకాయించిన రాంబాబు... ఆ తర్వాత ఆ కేసు బయటకు రాకుండా అష్టకష్టాలు పడిన మాట నిజం కాదా? భూకబ్జాలు చేసి ఆస్తులు కూడగట్టుకున్న మీరు... నిస్వార్థంగా ప్రజాసేవ చేయడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడం నిజంగా సిగ్గుచేటు.  చివరి సారిగా చెబుతున్నాం. మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి అవాకులు చెవాకులు పేలితే ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెబుతామని’’ హెచ్చరించారు.

Get Breaking News Alerts From IndiaGlitz