close
Choose your channels

Janasena: ఈ సీఎం వస్తాడు, వెళ్తాడు.. వరద బాధితులకు ఉపయోగమేంటీ, జనం ఆలోచన ఇదే : నాదెండ్ల మనోహర్

Tuesday, July 26, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

Janasena : ఈ సీఎం వస్తాడు, వెళ్తాడు.. వరద బాధితులకు ఉపయోగమేంటీ, జనం ఆలోచన ఇదే :  నాదెండ్ల మనోహర్

గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జరిపిన పర్యటన బాధితుల్లో కనీస భరోసా నింపలేకపోయిందన్నారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. ఏదో డ్రామా కంపెనీ కార్యక్రమం జరిగినట్లు అనిపించిందని... వైసీపీ సానుభూతిపరులను కొంతమందిని ఎంపిక చేసి వాళ్లకు ఐ.డి. కార్డులు ఇచ్చి ముఖ్యమంత్రి ముందు నిలబెట్టారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ సాయం అద్భుతం, చాలా గొప్పగా ఆదుకున్నారని వాళ్లతో చెప్పించడానికి వైసీపీ నేతలు, అధికారులు పడ్డ తిప్పలు అన్నీఇన్నీ కావన్నారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పని తీరు తెలుసుకోవాలంటే నిజమైన బాధితులు ఇద్దరిని పిలుపించుకొని మాట్లాడినా చాలని నాదెండ్ల సూచించారు.

గోదావరి వరదల వల్ల ఆరు జిల్లాల్లో.. 54 మండలాల్లో తీవ్ర నష్టం:

గోదావరి వరదలు వల్ల ఆరు జిల్లాలు... 54 మండలాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని, సామాన్యులు, రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వరద ప్రాంతాల్లో చిన్న పిల్లలు పాలు లేక యాతన అనుభవించారని... వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని మనోహర్ చెప్పారు. వారం రోజులుగా పశుగ్రాసం లేక పశువులు ఆకలితో అలమటిస్తే... ప్రభుత్వం చేసిన సహాయం చూసి నోరు లేని పశువులు కూడా ఆనందిస్తాయని ముఖ్యమంత్రి మాట్లాడం హాస్యాస్పదంగా వుందని నాదెండ్ల చెప్పారు. క్షేత్రస్థాయిలో వేలాది కుటుంబాలు ఇబ్బందులు పడుతుంటే జిల్లా అధికార యంత్రాంగం ఏమైపోయింది? ఎంతమందికి ఆర్థిక సాయం అందించింది? ఎన్ని కుటుంబాలను ఆదుకుందని మనోహర్ ప్రశ్నించారు. ఈ విషయాలను గురించి ప్రస్తావించకుండా ముఖ్యమంత్రి ఇతరులను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని... సీఎం స్థాయి వ్యక్తి పర్యటించినప్పుడు బాధితులకు సాయం అందిందనే భావన ఎక్కడ కలగలేదని మనోహర్ ఎద్దేవా చేశారు.

కందుల దుర్గేష్ హౌస్ అరెస్ట్ బాధాకరం:

వరద బాధితుల కష్టాలు, ప్రభుత్వం అందిస్తున్న సాయంపై ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్ ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం అందించాలని ప్రయత్నిస్తే వాళ్లను బలవంతంగా హౌస్ అరెస్టు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద బాధిత కుటుంబాలకు రూ. 10 వేలు తక్షణ సాయం అందేలా చూడాలని ఒక వైసీపీ ప్రజా ప్రతినిధిని తమ పార్టీ వీర మహిళలు కోరితే... వారిని అవమానించేలా మాట్లాడటం బాధాకరమన్నారు.

పొరుగు రాష్ట్రాల్లో రూ.10 వేల సాయం.. ఏపీలో మాత్రం రూ. 2 వేలు:

పొరుగు రాష్ట్రాల్లో వరద బాధితులకు రూ. 10 వేలు తక్షణ పరిహారం అందిస్తుంటే ఇక్కడ మాత్రం రూ 2 వేలు ఇవ్వడం దుర్మార్గమని నాదెండ్ల ఎద్దేవా చేశారు. ఇతర రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో ఎక్కువ నష్టం జరిగిందని.. వేలాది ఇళ్లు, లక్షలాది ఎకరాలు నీట మునిగాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వరద బాధితులతో పునరావాస కేంద్రాలు నిండిపోయాయని.. పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు తమ నాయకులు బాధితులకు కనీస అవసరాలు తీరుస్తుంటే వాళ్లను నిర్భందించడం సిగ్గుచేటని నాదెండ్ల మనోహర్ దుయ్యబట్టారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా ఉండాలని జనసేన పార్టీ ప్రయత్నిస్తుంది తప్పించి ఏనాడు ఓట్ల కోసం స్వార్ధ రాజకీయాలకు పాల్పడదని ఆయన స్పష్టం చేశారు.

వరద నష్టంపై అంచనా ఏది:

వరద నష్టంపై ఇతర రాష్ట్రాల్లో అధికారులు ప్రాథమిక అంచనా వేసి కేంద్రానికి నివేదిక సమర్పించి తక్షణ సాయం కోరుతుంటే... మన రాష్ట్రంలో మాత్రం ఇంకా ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని నాదెండ్ల మనోహర్ దుయ్యబట్టారు. ప్రమాద హెచ్చరికలు ఉన్నాయి అందుకే వరద నష్టంపై ప్రాథమిక అంచనా వేయలేదని ముఖ్యమంత్రి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదని.. వరదలు రాగానే రెవెన్యూ అధికారులు నష్టంపై ప్రాథమిక అంచనా వేసి, ఆ నివేదికను కేంద్రానికి పంపించాలని మనోహర్ గుర్తుచేశారు.

ఈ సీఎం వస్తాడు, వెళ్తాడనే జనం భావన:

కేంద్రం నుంచి ప్రత్యేక బృందం రాష్ట్రంలో పర్యటించి నష్టంపై అంచనా వేసి అందుకు అనుగుణంగా కేంద్రం నుంచి నిధులు విడుదల అయ్యేవన్నారు. కానీ ఈ ప్రభుత్వం తూతూ మంత్రంగా పనిచేస్తోందని.. ముఖ్యమంత్రి ఇలానే పనిచేస్తాడు, వరదలు వచ్చిన వారానికి వస్తాడు... వెళ్తాడు అనే భావన ప్రజల్లో ఉందని నాదెండ్ల ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాల నుంచి వినతిపత్రం కూడా తీసుకోలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని... ఒక రాజకీయ పార్టీగా క్షేత్రస్థాయి పరిస్థితిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని మనోహర్ పేర్కొన్నారు. వరద బాధితులకు తక్షణ సాయం కింద రూ. 10 వేలు అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని ఆయన స్పష్టం చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.