Janasena : వరదలు తగ్గాక తీరిగ్గా వస్తారా ... బాధితులకు రూ.10 వేల సాయం ఇవ్వాల్సిందే: జనసేన నేత కందుల

  • IndiaGlitz, [Tuesday,July 26 2022]

గోదావరి వరదల కారణంగా నిరాశ్రయులైనవారు, రైతాంగం, పేదలు ఎదుర్కొంటున్న తీవ్ర ఇక్కట్లు, వారిని ఆదుకోవడం గురించి రాష్ట్ర ముఖ్యమంత్రికి జనసేన పార్టీ తరఫున విజ్ఞాపన అందచేస్తామన్నారు ఆ పార్టీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ . రాజమండ్రిలో సోమవారం జనసేన పార్టీ నేతలతో కలసి కందుల దుర్గేష్ విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంగళవారం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని కలిసి విజ్ఞాపన ఇవ్వాలని నిర్ణయించామని ఆయన చెప్పారు. విజ్ఞాపన తీసుకొని పక్షంలో ప్రజాస్వామ్య పద్ధతిలో తమ నిరసన తెలియచేస్తామని దుర్గేష్ వెల్లడించారు.

ముందు మేల్కోనేవాడే పరిపాలకుడు:

మంచి పరిపాలకుడు అంటే ప్రమాదం వచ్చిన తర్వాత పరామర్శించడం కాదని... ప్రమాదాన్ని ముందుగానే ఊహించి ప్రజలను కాపాడుకోవడమే సుపరిపాలకుడి లక్షణమని ఆయన అన్నారు. గోదావరి వరద బాధితుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుర్గేష్ ఎద్దేవా చేశారు. గోదావరి నదికి వస్తున్న భారీ వరదలు అప్రమత్తత లోపించడం వల్ల ప్రజలను నిలువునా ముంచేశారని ఆయన ఆరోపించారు. గోదావరి వరదల వల్ల నష్టపోయిన బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం బాధ్యతను విస్మరించిందని దుర్గేష్ దుయ్యబట్టారు. కేవలం బాధిత కుటుంబాలకు 2000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకోవాలని చూసిందని కందుల ఎద్దేవా చేశారు. ఇదే వైసీపీ నేతలు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, గోదావరికి వరదలు వస్తే బాధితులకు 25 వేల రూపాయల తక్షణ సాయం ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక బాధితులకు రూ.2 వేలు ఇచ్చి సరిపెడుతున్నారని కందుల దుర్గేష్ చురకలు వేశారు.

గోదావరి వరద అంచనాలో ప్రభుత్వం ఫ్లాప్:

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడానికి వస్తున్న ముఖ్యమంత్రిని జనసేన పార్టీ తరఫున తాము కలిసేందుకు ఇప్పటికే అధికారులను అనుమతులు అడిగామని ఆయన వెల్లడించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితుల బాధలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లేందుకు అన్ని సిద్ధం చేసుకున్నామని దుర్గేష్ తెలిపారు. అయితే ఇప్పటివరకు జిల్లా ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదని కందుల విమర్శించారు. వాతావరణ శాఖను, విపత్తుల నిర్వహణ శాఖలను సమన్వయం చేసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుర్గేశ్ ఎద్దేవా చేశారు. గోదావరికి ఎంత వరద వస్తుందో అంచనా వేయడంలోనూ ప్రభుత్వ అసమర్థత అర్థం అవుతోందని ఎండగట్టారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, వారి ఆస్తులను రక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయ్యిందని ఆయన దుయ్యబట్టారు.

వరద తగ్గాక, తీరిగ్గా వస్తారా:

సాక్షాత్తు మంత్రులే వరద ఇంత వస్తుంది అని ఊహించలేమని చెప్పడం వారి పాలనకు నిదర్శనమని... గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు ఆగస్టులో ఎక్కువగా గోదావరి కి వరద వస్తుందని భావిస్తుంటారని దుర్గేష్ తెలిపారు. అయితే ఈసారి జులైలోనే భారీగా వరద వచ్చిందని.. ఎప్పటికప్పుడు తెలుసుకొని ఎగువ ప్రాంతాల్లో పడిన వర్షాన్ని అంచనా వేసి ప్రజలను కాపాడాల్సిన ప్రభుత్వం పూర్తిగా మొద్దు నిద్రలో ఉండిపోయిందని ఆయన చురకలు వేశారు. వరద వచ్చిన తర్వాత బాధితులను ఆదుకోవడంలో కానీ, రక్షించడంలో కానీ ప్రభుత్వం చొరవ చూపలేదని ఆయన ఎద్దేవా చేశారు. అవసరమైన సమయంలో ఎప్పటికప్పుడు సమీక్షలు చేసి అధికారులను అప్రమత్తం చేయాల్సిన ముఖ్యమంత్రి తీరిగ్గా, వరద మొత్తం తగ్గిన తర్వాత పర్యటనకు రావడం హాస్యాస్పదంగా ఉందని దుర్గేష్ విమర్శించారు. ఈ ముఖ్యమంత్రికి పేదల బాధలు పట్టవని... కష్టాల్లో ఉన్నవారి కన్నీళ్లు ఈ పాలకులకు అవసరం లేదని ఆయన తేల్చిచెప్పారు. విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో శాఖలను సమన్వయం చేయడంలో ఈ ప్రభుత్వానికి స్పష్టత లేదని కందుల విమర్శించారు.

బాధితులకు రూ.10 వేల తక్షణ సాయం అందించాలి:

వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను పూర్తిగా గాలికి వదిలేసిన ఈ ప్రభుత్వ చర్యలను ఖండిస్తున్నామన్నారు. కనీసం ముఖ్యమంత్రిని కూడా కలిసేందుకు అనుమతి ఇవ్వని పక్షంలో కోనసీమ జిల్లా గంటి పెదపూడలో ముఖ్యమంత్రి నిర్వహించే కార్యక్రమం వద్ద నిరసన వ్యక్తం చేస్తామని దుర్గేష్ హెచ్చరించారు. ముంపు బారిన పడిన ఒక్కో కుటుంబానికి తక్షణం రూ.పదివేలు సహాయం ప్రకటించాలని...అలాగే ముంపు గ్రామాల్లో పంట నష్టాన్ని మదింపు చేసి, ఆ మేరకు ఆర్థిక సహాయం అందించాలని కందుల డిమాండ్ చేశారు. ప్రభుత్వం చెప్పిన విధంగా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్.ఆర్. ప్యాకేజీని తక్షణం విడుదల చేసి, సురక్షిత ప్రాంతాల్లో ఇళ్ళు నిర్మించాలని దుర్గేష్ కోరారు.

More News

'డై హార్డ్ ఫ్యాన్స మోష‌న్ పోస్ట‌ర్ కి అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల నుండి అనూహ్య స్పంద‌న‌

ప్రియాంక శ‌ర్మ‌, శివ ఆల‌పాటి జంట‌గా, ష‌క‌ల‌క శంక‌ర్‌, రాజీవ్ క‌న‌కాల‌, నోయ‌ల్ ముఖ్య‌పాత్రల్లో శ్రీహాన్ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై అభిరామ్ M దర్శకత్వంలో

68th national film awards: జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ‘‘సూరారైపోట్రు’’ హవా.. ఏకంగా ఐదు అవార్డులు

జాతీయ అవార్డ్స్(National Awards) వేదికపై తమిళ చిత్రం సూరారై పోట్రు(Soorarai Pottru) సత్తా చాటింది.

68th National Film Awards: జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలు వీరే..!!

2020వ సంవత్సరానికి గాను 68వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది.

68th National Film Awards: ఉత్తమ తెలుగు చిత్రంగా ‘‘కలర్ ఫోటో’’... బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ‘థమన్’

2020వ సంవత్సరానికి గాను 68వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది.

Lal Singh Chadda: 'లాల్ సింగ్ చెడ్డా' నుంచి నాగ చైతన్య లుక్ విడుదల

మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా లాల్ సింగ్ చెడ్డా.