పెనుగొండ ప్రజలకు మాటిచ్చిన జనసేనాని

  • IndiaGlitz, [Thursday,February 14 2019]

జ‌న‌సేన పార్టీ అధికారంలోకి వ‌చ్చాక పెనుగొండ ఊరు పేరును 'శ్రీ వాస‌వి క‌న్యకాప‌ర‌మేశ్వరి పెనుగొండ'గా మారుస్తామ‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పెనుగొండ ప్రజలకు మాటిచ్చారు. గురువారం ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పెనుగొండ‌లో శ్రీ వాస‌వి క‌న్యకాప‌ర‌మేశ్వరి అమ్మవారి కుంబాభిషేకం, విగ్రహ‌ప్రతిష్టాప‌న మ‌హోత్సవాల్లో పవన్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా.. ప్రపంచంలోనే అత్యంత ఎతైన, పంచ‌లోహ‌ల‌తో త‌యారైన 90 అడుగుల శ్రీ వాస‌వీక‌న్యకా ప‌ర‌మేశ్వరి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నాకు ఆ బాగ్యం కలిగింది..

ఈ సందర్భంగా పవన్ ట్లాడుతూ.. ధ‌ర్మం దారి త‌ప్పిన‌ప్పుడు ప్రాణం కంటే మానం గొప్పదని భావించి ఆత్మార్పణ చేసుకున్న పవిత్రమూర్తి కన్యకాపరమేశ్వరి అమ్మవారు. ఆమె జన్మించిన ఊరుగానే కాదు, ఆత్మార్పణ చేసుకున్న పవిత్ర స్థలంగానూ పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండకు విశిష్ట స్థానం ఉంది. నాతోపాటు ఇన్నివేల మంది ఇక్కడికి వ‌చ్చి అమ్మవారిని ద‌ర్శించుకోవ‌డం మ‌నం చేసుకున్న పుణ్యం. భక్త జనకోటి కొంగు బంగారంగా విశేష పూజలందుకుంటున్న ఆ త‌ల్లి విగ్రహాన్ని ద‌ర్శించుకునే బాగ్యం క‌లిగించినందుకు ట్రస్ట్ స‌భ్యుల‌కు ధ‌న్యవాదాలు. చ‌ల్లని త‌ల్లి శుభాశీస్సులు రాష్ట్రంలోని అంద‌రి ఆడ‌ప‌డుచుల‌పై ఉండాల‌ని కోరుకున్నాన‌ు అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.

జ‌య‌జ‌య‌ధ్వానాలతో ద‌ద్దరిల్లిన పెనుగొండ

కాగా విగ్రహావిష్కరణకు ముందు ఆల‌య లాంఛ‌నాల ప్రకారం వేద‌పండితుల మంత్రోచ్చర‌ణ‌లు, మంగ‌ళ‌వాద్యాల‌తో ఆల‌యం లోప‌లికి ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. శ్రీ వాస‌వీ మాత భారీ విగ్రహాన్ని ద‌ర్శించుకుని, ప్రత్యేక పూజ‌లు నిర్వహించారు. ముందుగా అమ్మవారి పాద‌భాగంలో వేద‌పండితుల మంత్రోచ్చర‌ణ‌ల మ‌ధ్య పవన్ పూజ‌లు నిర్వహించారు. అనంతరం రూ. 17 కోట్లతో ఏర్పాటు చేసిన శ్రీ వాస‌వీమాత 90 అడుగుల భారీ విగ్రహానికి ప్రతిష్టాప‌న‌, కుంబాభిషేక మ‌హోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. అమ్మవారి ద‌ర్శనానికి పవన్ వ‌స్తున్న విష‌యాన్ని తెలుసుకుని జ‌న‌సైనికులు, జనసేన పార్టీ అభిమానులు ఉద‌య‌మే పెద్ద సంఖ్యలో పెనుగొండ చేరుకున్నారు. హెలీ ప్యాడ్ నుంచి అమ్మవారి ఆల‌యం వ‌ర‌కు అడుగ‌డుగునా ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌పై పూల వ‌ర్షం కురిపించారు. పెనుగొండ ప్రాంతం జ‌న‌సేన నినాదాలు, జ‌న‌సైనికుల జ‌య‌జ‌య‌ధ్వానాలతో ద‌ద్దరిల్లింది.