Pawan - Lokesh: ఈనెల 23న లోకేష్-పవన్ అధ్యక్షతన టీడీపీ-జనసేన సమన్వయ సమావేశం.. క్యాడర్‌కు దిశానిర్దేశం..

  • IndiaGlitz, [Saturday,October 21 2023]

టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ స్కాంలో అరెస్టు కావడం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తు ప్రకటించడం చకచకా జరిగిపోయాయి. పొత్తు ప్రకటించి నెల రోజులు దాటినా ఇంత వరకు ఉమ్మడి కార్యాచరణ మాత్రం సిద్ధం కాలేదు. ఇరు పార్టీలు మాత్రం సమన్వయ కమిటీలను మాత్రం ప్రకటించాయి. ఈ నేపథ్యంలో టీడీపీ-జనసేన తొలి సమన్వయ కమిటీ భేటీ ఈనెల 23న రాజమండ్రిలో జరగనుంది. నారా లోకేష్- పవన్ కల్యాణ్‌ అధ్యక్షతన జాయింట్ యాక్షన్ కమిటీ తొలి సమావేశం కానుంది. ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటం, ఉద్యమ కార్యాచరణ, తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ కక్ష సాధింపును ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి అంశాలపై ఈ కమిటీ చర్చించనుంది.

టికెట్ల సర్దుబాటు, ఉమ్మడి కార్యాచరణపై చర్చ..

ముఖ్యంగా టికెట్ల సర్దుబాటు, వైసీపీపై వ్యతిరేకంగా పోరాటం, కలిసి పోరాటం చేయాల్సిన అంశాలు, ఉమ్మడి మేనిఫెస్టో వంటి తదితర అంశాలపై ఇరు పార్టీలు సమాశేంలో చర్చించనున్నాయి. అలాగే క్షేత్రస్థాయిలో రెండు పార్టీల మధ్య సమన్వయం కోసం తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయాలు తీసుకోనుంది. టీడీపీ పోటీ చేసే స్థానాలు, జనసేనకు కేటాయించాల్సి సీట్లుపై లోకేష్- పవన్‌ చర్చించే అవకాశం ఉంది. చంద్రబాబు అరెస్టుతో టీడీపీ నేతలు ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఉమ్మడి భవిష్యత్ కార్యచరణపై ఓ ప్రకటన వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

పర్యటనలతో ప్రజల్లో ఉండేలా ప్రణాళికలు..

రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు బయటకు రావడం ఆలస్యం అవుతూ వస్తోంది. ఓవైపు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో.. క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో క్యాడర్‌లో నిస్తేజం నెలకొంది. దీంతో వారికి ఆత్మస్థైర్యం కల్పించేలా టీడీపీ, జనేసన సంయుక్తంగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నాయి. సోమవారం జరగనున్న సంయుక్త సమావేశం తర్వాత వరుసగా సమావేశాలు నిర్వహించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మరోవైపు నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి.. భవిష్యత్‌కు గ్యారంటీ పేరుతో లోకేష్ ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఇక పవన్ కల్యాణ్ కూడా దసరా తర్వాత వారాహి యాత్రను ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో రెండు పార్టీలు ప్రజల్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ మూడు కార్యక్రమాల్లో టీడీపీ, జనసేన క్యాడర్ పాల్గొనేలా దిశానిర్దేశం చేయనున్నారు.