close
Choose your channels

తలపై తుపాకులు పెట్టినా జ‌న‌సేనను ఏ పార్టీతో క‌ల‌పం!

Saturday, August 17, 2019 • తెలుగు Comments

తలపై తుపాకులు పెట్టినా జ‌న‌సేనను ఏ పార్టీతో క‌ల‌పం!

జ‌న‌సేన పార్టీ అన్ని ప్రాంతీయ పార్టీల్లాంటిది కాద‌ని, పేరుకి ప్రాంతీయ పార్టీ అయిన‌ప్పటికీ ప్రతి భార‌త పౌరుడిని సమంగా చూడాల‌న్న ల‌క్ష్యంతో, జాతీయ స‌మ‌గ్రత‌ను కాపాడాల‌న్న ల‌క్ష్యంతో, స్వతంత్ర ఫ‌లాలు అంద‌రికీ అందాల‌న్న ల‌క్ష్యం ఉన్న పార్టీ అని జ‌న‌సేన అధ్యక్షులు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స్పష్టం చేశారు. టీడీపీ తెలుగు ప్రజ‌ల ఆత్మగౌర‌వ నినాదంతో, టీఆర్ఎస్ తెలంగాణ ప్రజ‌ల కోసం, మ‌రో పార్టీ తండ్రి వార‌స‌త్వాన్ని అంది పుచ్చుకుని ముఖ్యమంత్రి అవ్వాల‌న్న ల‌క్ష్యాల‌తో ఆవిర్భవిస్తే, జ‌న‌సేన పార్టీ జాతి కోసం ఆవిర్భవించింద‌న్నారు. ఏ జాతీయ పార్టీ అయినా.. తల మీద తుపాకులు పెట్టినా జ‌న‌సేన పార్టీని క‌లిపే ప్రస‌క్తే లేద‌ని తెలిపారు. దీన్ని పార్టీ మాట‌గా ముందుకు తీసుకువెళ్లాల‌ని కార్యక‌ర్తల‌కు పిలుపునిచ్చారు. ఇటీవల మంగ‌ళ‌గిరిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో విజ‌య‌వాడ పార్లమెంట్ ప‌రిధిలోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల నాయ‌కులు, కార్యక‌ర్తలతో స‌మావేశం అయ్యారు.

భావోద్వేగాలు ఎక్కువ‌గా ఉంటాయ్!

ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్‌ మాట్లాడుతూ.. ‘పార్టీ నిర్మాణంలో భావ‌జాలాన్ని అర్ధం చేసుకున్న వారికి ఇంఛార్జీలు అవ‌కాశం ఇస్తున్నాం. రాజ‌కీయం అంటే ఏది ప‌డితే అది మాట్లాడ‌డం కాదు. కొంద‌రికి భావోద్వేగాలు ఎక్కువ‌గా ఉంటాయి. రాజ‌కీయాల్లో ఉండాలి అంటే మాట మీద నియంత్రణ ఉండాలి. నోటికి వ‌చ్చింది మాట్లాడి సోష‌ల్ మీడియా అనే అద్భుత‌మైన వ్యవ‌స్థని దుర్వినియోగం చేయవద్దు. ఎవ‌రో కొద్ది మందిని కూర్చోబెట్టి మాట్లాడిస్తే అవేమీ న‌న్ను ఆప‌లేవు. ఎవ‌రికైనా అభిప్రాయాలు చెప్పే హ‌క్కు ఉంది’ అని పవన్ పిలుపునిచ్చారు.

అలా చేస్తే మరింత ఇబ్బందిపడతారు!

రోడ్ల మీద‌కి వెళ్లి సోష‌ల్ మీడియాలో మాట్లాడితే పిల‌వ‌డానికి నేను కాంగ్రెస్ పార్టీలాగా భ‌య‌ప‌డ‌ను. మీకొచ్చిన బ‌లం నేను, నాకు అండ‌గా నిల‌బ‌డిన జ‌న‌ సైనికుల వ‌ల్ల వచ్చినదే. అది మీ సొంత బ‌లం అనుకోవ‌ద్దు. మీరు బ‌య‌టికి వెళ్లి మాట్లాడితే పిలిచేస్తాను అనుకుంటే మ‌రింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సోష‌ల్ మీడియాలో మాట్లాడే జ‌న‌సైనికులు సంయ‌మ‌నంతో మాట్లాడాలి. నేను నా స్వార్ధం కోసం పార్టీ పెట్టలేదు. అట్టడుగు స్థాయి నుంచి రాజ‌కీయాల్లో ఎద‌గ‌డానికి వ‌చ్చాను. దొడ్డి దారిన ఎద‌గ‌డానికి రాలేదు. తెలుగువారు ఎక్కడ ఉన్నా వారికి అండ‌గా ఉండాల‌న్న ఆలోచ‌న‌తో పెట్టాను. ఓటమిగానీ, ఇలాంటి విమ‌ర్శలు గానీ న‌న్ను భ‌య‌పెట్టలేవు. ప‌ని తీరు ఆధారంగా బాధ్యత‌లు అప్పగిస్తాం’ అని పవన్ తెలిపారు

నన్ను విమర్శించే హక్కు వాళ్ళకుందా?

ప్రజా స‌మ‌స్యల మీద మాట్లాడ‌డానికి ఎవ‌రినైనా క‌ల‌సి న‌మ‌స్కారంపెడితే వారికి అమ్ముడైపోయిన‌ట్లు కాదు. అది సంస్కారం. అలా అనుకుంటే అంద‌రూ అమ్ముడుపోయిన‌ట్టే. న‌న్ను చాలా మంది విమ‌ర్శిస్తూ ఉంటారు. అస‌లు న‌న్ను విమ‌ర్శించే హ‌క్కు వాళ్ల‌కు ఉందా. కోటి రూపాయలు సంపాదించి  కోట రూపాయలు వ‌దులుకునే ప‌నులు ఎవ‌రైనా చేశారా.?  నేను వంద‌ల‌సార్లు  చేశాను. రూపాయి సంపాద‌న లేని స‌మ‌యంలో కూడా స్నేహితుల‌కు స‌హాయం చేయ‌డానికి ప‌ది ల‌క్ష‌లు అప్పు చేసి మ‌రీ ఇచ్చిన వాడిని. అది నా నైజం. అలాంటి న‌న్ను కూర్చోబెట్టి పిచ్చిపిచ్చిగా మాట్లాడితే చూస్తూ ఊరుకోను. మీరు న‌న్ను ఏదైనా ప్రశ్నించండి. నా వ్యక్తిత్వాన్ని ప్రశ్నిస్తే మాత్రం నాలో మ‌రో వ్యక్తిని చూస్తారు. మీకు కెపాసిటీ లేక‌పోతే మూల‌న కూర్చో. అంతే కానీ నా క‌ళ్ల‌లోకి చూసి న‌న్ను ప్రశ్నించాల‌ని చూడ‌కండి. నేను మీ జీవితాల గురించి మాట్లాడితే ముఖం కూడా చూప‌లేరు.  డ‌బ్బు ప‌రంగా న‌న్ను ప్రశ్నించాల‌నుకునే వారు ఎవ‌రైనా ఒక‌టి గుర్తుంచుకోండి. నేను కోట్ల సంపాద‌న వ‌దులుకుని వ‌చ్చినవాడిని. ఇర‌వై వేల టాక్స్ క‌ట్ట‌లేని వారు ఉన్న ప‌ళంగా కోట్లు టాక్స్ క‌ట్టిన‌ట్టు నేను దోపిడి చేసి సంపాదించ‌లేదు.  సినిమాలు చేసి మీతో తిట్టించుకున్నా, మెప్పు పొందా, డ‌బ్బు సంపాదించా. ఇక్కడ స్థలాలు కొంటే  వేల కోట్లు వ‌స్తాయని తెలిసి కూడా నేను అలాంటి ప‌నులు చేయ‌లేదు. నా ల‌క్ష్యం వ్యాపారం కాదు. మాన‌వ‌త్వం’ అని పవన్ స్పష్టం చేశారు.

Get Breaking News Alerts From IndiaGlitz