Nandamuri Taraka Ratna: తారకరత్నకు గుండెపోటు.. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలి : పవన్ కల్యాణ్


Send us your feedback to audioarticles@vaarta.com


టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో సుదీర్ఘ పాదయాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ఆయన ఈరోజు పాదయాత్రను ప్రారంభించారు. అయితే తొలిరోజే యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. సినీనటుడు నందమూరి తారకరత్న గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను టీడీపీ శ్రేణులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్ధితిపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన కుప్పంలోని పీఈఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ప్రస్తుతానికి కుప్పంలోనే తారకరత్నకు చికిత్స :
అయితే మరింత మెరుగైన చికిత్స నిమిత్తం తారకరత్నను బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఆసుపత్రి యాజమాన్యంతోనూ స్పందింపులు జరిపారు. అటు బెంగళూరు నుంచి రెండు అంబులెన్స్‌లు కూడా కుప్పానికి చేరుకున్నాయి. కుప్పం నుంచి బెంగళూరు వరకు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి తారకరత్నను తరలించాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైతో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు మాట్లాడినట్లుగా తెలుస్తోంది. అయితే తారకరత్న భార్య.. కుప్పానికి వచ్చిన తర్వాత ఆయనను బెంగళూరు తరలించాలా..? వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. బెంగళూరు నుంచి నారాయణ హృదయాలయా వైద్యులు అత్యాధునిక పరికరాలతో ప్రస్తుతం కుప్పం పీఈఎస్ ఆసుపత్రిలోనే తారకరత్నకు చికిత్స అందిస్తున్నారు.
తారకరత్న కోలుకోవాలన్న పవన్ :
మరోవైపు తారకరత్న గుండెపోటుకు గురైనట్లుగా తెలుసుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. బాలకృష్ణ కుప్పంలోనే వుండి పరిస్ధితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అటు జూనియర్ ఎన్టీఆర్ సైతం బాలయ్యకు ఫోన్ చేసి తారకరత్న ఆరోగ్యంపై ఆరా తీశారు. తాజాగా ఈ లిస్ట్‌లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తారకరత్న గుండెపోటుకు గురికావడం బాధాకరమన్న పవన్.. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు. తారకరత్న సంపూర్ణ ఆరోగ్య వంతుడిగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు పవన్ పేర్కొన్నారు.
శ్రీ నందమూరి తారకరత్న త్వరగా కోలుకోవాలి - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/FRr9EIkWBW
— JanaSena Party (@JanaSenaParty) January 27, 2023
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.