close
Choose your channels

Shankarabharanam: 'శంకరాభరణం' విడుదలైన రోజే విశ్వనాథ్ శివైక్యం.. మరణంలోనూ వీడని కళానుబంధం

Friday, February 3, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

దిగ్గజ దర్శకుడు, కళాతపస్వి కే. విశ్వనాథ్ మరణంతో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. రోజుల వ్యవధిలో జమున, సాగర్.. ఇప్పుడు విశ్వనాథ్ కూడా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఇక యాధృచ్చికమో లేక మరో కారణమో కానీ శంకరాభరణం విడుదలైన రోజే విశ్వనాథ్ కన్నుమూశారు.

కమర్షియల్‌ సినిమాకు సవాల్ విసిరిన శంకరాభరణం:

విశ్వనాథ్ పేరు చెబితే టక్కున గుర్తుచ్చేది శంకరాభరణమే. కమర్షియల్ సినిమాలు, యాక్షన్ సినిమాలు రాజ్యమేలుతున్న సమయంలో వచ్చిన ఈ సినిమా రికార్డులను దుమ్ముదులిపింది. అప్పట్లో ఏ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నా.. ఖచ్చితంగా శంకరాభరణం ప్రస్తావన తప్పనిసరిగా వుండేది. అంతేకాదు.. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏదైనా పని జరగాలంటే సదరు అధికారి కుటుంబానికి శంకరాభరణం సినిమా టికెట్లు ఇస్తే చాలని ఈ సినిమాలో నటించిన చంద్రమోహన్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. రిలీజ్ చేయడానికే నానాపాట్లు పాడిన శంకరాభరణం జాతీయ అవార్డ్‌తో పాటు మరెన్నో పురస్కారాలు , అవార్డులను సొంతం చేసుకుంది.

రిలీజ్ కోసం నానాపాట్లు పడ్డ శంకరాభరణం:

వృద్ధుడైన సంగీత విద్వాంసుడు, ఓ దేవదాసీ, శాస్త్రీయ సంగీతం కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. జేవీ సోమయాజులు, మంజు భార్గవి, చంద్రమోహన్, రాజ్యలక్ష్మీ, తులసి, అల్లు రామలింగయ్య, నిర్మలమ్మ, సాక్షి రంగారావు, డబ్బింగ్ జానకి తదితరులు నటించారు. అప్పట్లో సినిమాను మద్రాస్‌లో ప్రదర్శించి చూసిన తర్వాత జిల్లాల వారీగా కొందరు కొనుగోలు చేస్తూ వుండేవారు. శంకరాభరణాన్ని కూడా నడిగర్ సంఘం ఆవరణలోని థియేటర్‌లో ప్రదర్శించారు. ఈ షో చూసేందుకు విశ్వనాథ్ మిత్రులు, పరిశ్రమకు చెందిన ముఖ్యమైన వాళ్లు వచ్చారు. కానీ సినిమాను కొనేందుకు ఎవ్వరూ ఆసక్తి చూపించలేదు. కానీ చివరికి నష్టానికి సినిమాను అమ్ముకున్నారు నిర్మాత ఏడిద నాగేశ్వరరావు. చివరికి 1980, ఫిబ్రవరి 2న ఎలాగోలా రిలీజైంది శంకరాభరణం .

ఏమీ లేదన్న చోట కలెక్షన్ల వర్షం:

తొలి వారంలో థియేటర్లు వెల వెలబోయాయి. కానీ తర్వాత పరిస్థితి మారిపోయింది. థియేటర్లు హౌస్‌ఫుల్ బోర్డులతో జామ్ ప్యాక్ అయిపోయాయి. అనంతరం శంకరాభరణానికి థియేటర్ల సంఖ్యను పెంచుతూ పోయారు. ఈ సినిమాకు వస్తున్న పబ్లిసిటీని చూసి పరిశ్రమ వర్గాలు ఆశ్చర్యపోయాయి. మూడో వారం నాటికి బ్లాక్‌లో టిక్కెట్లు కొని సినిమాను చూడాల్సి వచ్చేది. తమిళ, కన్నడ భాషల్లోనూ శంకరాభరణం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. కే విశ్వనాథ్ దర్శకత్వ ప్రతిభ, జేవీ సోమయాజులు, మంజు భార్గవి నటన.. కేవీ మహదేవన్ సంగీతం ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశాయి. పాశ్చాత్య సంగీతహోరులో కొట్టుకున్న తరుణంలో.. సంప్రదాయ సంగీతంలో వున్న మాధుర్యం ఎంత గొప్పగా వుంటుందో సమాజానికి తెలియజేసింది శంకరాభరణం.

రికార్డులు, రివార్డులు, జాతీయ, అంతర్జాతీయ అవార్డులు:

కలెక్షన్ల సునామీ సృష్టించిన శంకరాభరణం అవార్డుల వేటలోనూ సంచలనం సృష్టించింది. నాలుగు నేషనల్ అవార్డ్స్, ఒక ఫిల్మ్ ఫేర్ అవార్డ్, 7 నంది అవార్డ్‌లు వచ్చాయి. 2013లో ఫోర్బ్స్ సెంచరీ ఆఫ్ ఇండియా సినిమా 25 గ్రేటెస్ట్ పెరఫార్మన్సులలో సోమయాజులు పేరు కూడా వుంది. అలాగే భారతీయ సినిమా వందేళ్ల వేడుకల్ని పురస్కరించుకుని 2013లో సీఎన్ఎన్- ఐబీఎన్ "greatest Indian film ever" పేరిట నిర్వహించిన పోల్‌లో శంకరాభరణానికి 11వ స్థానం లభించింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.