‘కమ్మరాజ్యం..’ పై కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్

  • IndiaGlitz, [Thursday,November 21 2019]

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన సంచలన చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా వివాదాల్లో చిక్కుకుంది. ఇప్పటికే ఈ చిత్రంపై అటు టీడీపీ.. ఇటు వైసీపీ నేతలు పలువురు దీనిపై తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానులైతే ట్విట్టర్ వేదికగా ఆర్జీవీపై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. ఈ సినిమాలో ఆ పార్టీ.. ఈ పార్టీ అని కాకుండా టీడీపీ, వైసీపీ మొదలుకుని జనసేన , కేఏ పాల్ పార్టీని సైతం లాగాడు ఆర్జీవీ. అయితే ఇంతవరకూ ఈ వ్యవహారంపై మీడియా ముందుకొచ్చి ఎవరూ స్పందించలేదు కానీ.. ఫస్ట్ టైమ్‌ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ ‘కమ్మరాజ్యం..’పై హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. మరికాసేపట్లో దీనిపై హైకోర్టు విచారణ జరపనుంది.

నన్ను అవమానిస్తారా!?

‘నన్ను అవమానించేలా కొన్ని చిత్రంలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. సినిమా విడుదల నిలిపేయాల్సిందే. ప్రతివాదులుగా కేంద్ర మంత్రిత్వ శాఖ, సెన్సార్ బోర్డ్, రాంగోపాల్ వర్మ, జబ్బర్దస్త్ కమెడియన్ రాము తదితరులను చేరుస్తున్నాను’ అని పాల్ పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా ఈ పాల్ పిటిషన్‌పై మరి కొద్దిసేపటిలో విచారణ జరగనుంది. మరోవైపు ఈ చిత్రం ఈనెల 29 న విడుదలకు సిద్దమవుతున్న టైమ్‌లో ఇలాంటి వివాదాలు ‘కమ్మరాజ్యం’ను చుట్టుముడుతుండటంతో పరిస్థితి ఎలా ఉంటుందే అనే దానిపై సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే ఈ వ్యవహారంపై ఇంతవరకూ ఆర్జీవీ మీడియా ముందుకు రావడం కానీ.. కనీసం సోషల్ మీడియా వేదికగా కానీ రియాక్ట్ అవ్వలేదు.. ఆయన రియాక్ట్ అయితే ఎన్ని సైటైర్లేస్తారో ఏంటో మరి.

ఆర్జీవీ ఇవేం కొత్త కాదే..!

కాగా సినిమాలపై పోలీసులు, హైకోర్టులను ఆశ్రయించడం మామూలే.. మరీ ముఖ్యంగా ఆర్జీవీ లాంటి వివాదాస్పద దర్శకుడి సినిమాలపై కోర్టుమెట్లెక్కడం షరామామూలే.. ఇదేం ఫస్ట్ టైమ్ కాదు.. ఇప్పటి వరకూ ఆర్జీవీ తెరకెక్కించిన దాదాపు అన్ని సినిమాలపైనా కేసులు నడిచాయి. వాటన్నింటినీ ఆయన ఏ రోజూ లెక్కచేయలేదు. చివరికి కొన్ని సినిమాలు రిలీజ్ పోస్ట్ చేసుకున్నప్పటికీ.. రిలీజ్ అయితే చేసి తీరారు. మరి తాజా పిటిషన్‌పై హైకోర్టు విచారించి ఎలాంటి తీర్పునిస్తుందో అనేదానిపై అటు కమ్మరాజ్యం.. చిత్ర యూనిట్.. ఇటు పాల్, పాల్ వీరాభిమానులు వేచి చూస్తున్నారు.