Download App

Kalki Review

`పి.ఎస్‌.వి గ‌రుడ‌వేగ‌`  చిత్రంతో రాజ‌శేఖ‌ర్‌కు చాలా గ్యాప్ త‌ర్వాత‌ స‌క్సెస్ ద‌క్కిన‌ట్ల‌య్యింది. ఆ స‌క్సెస్ ట్రాక్‌లో వెళ్లాల‌ని మ‌రోసారి త‌న‌కు క‌లిసొచ్చిన పోలీస్ ఆఫీస‌ర్ క్యారెక్ట‌ర్ ఉన్న క‌థ‌నే ఎంపిక చేసుకున్నారు.`అ!` వంటి డిఫ‌రెంట్ మూవీతో ద‌ర్శ‌కుడిగా మ‌న్న‌న‌లు పొందిన యువ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో `క‌ల్కి` మూవీని అనౌన్స్ చేశారు. ప్రారంభం నుండి విడుద‌ల వ‌ర‌కు సినిమా అంద‌రిలో ఆస‌క్తిని రేపింది. 1980 బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ మూవీ ఇది. మ‌రి సినిమా ప్రేక్ష‌కుల‌ను ఏ మేర ఆక‌ట్టుకుంది. అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా క‌థంటో చూద్దాం.

క‌థ‌

క‌ల్కి (రాజ‌శేఖ‌ర్‌) స్పెష‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఆఫీస‌ర్‌. ఆయ‌న్ని ఓ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ చేధించ‌డానికి కొల్లాపూర్‌కు ప్ర‌భుత్వం పంపుతుంది. అక్క‌డ న‌ర్స‌ప్ప (అశుతోష్ రాణా) త‌మ్ముడు శేఖ‌ర్ బాబు (సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌) హ‌త్య‌కు గుర‌యి ఉంటాడు. అంద‌రూ ఆ హ‌త్య చేసింది పెరుమాండ్లు(శ‌త్రు) అని అనుకుంటారు. ఆ హ‌త్య‌లు జ‌రిగిన ప్ర‌దేశంలో అక్క‌డికి వేరే విష‌యాన్ని క‌వ‌రేజ్ చేయ‌డానికి వ‌చ్చిన క్రైమ్ రిపోర్ట‌ర్ (రాహుల్ రామ‌కృష్ణ‌) ఉంటాడు. అత‌నికి ఈ హ‌త్య వెనుక జ‌రిగిన విష‌యాల గురించి తెలుసుకోవాల‌నే ఆస‌క్తి పెరుగుతుంది. హ‌త్య‌కు సంబంధించి కొన్ని విష‌యాలు తెలుసుకుంటాడు. వాటిని ఐపీయ‌స్ క‌ల్కితో షేర్ చేసుకుంటాడు. ఈ క్ర‌మంలో వారిద్ద‌రూ క‌లిసి నాగుల‌కోన‌కు, మ‌ల్లెల‌తీరానికి వెళ్తారు. ఆ రెండు ప్ర‌దేశాల‌కు, శేఖ‌ర్‌బాబు ప్రేయసి అసీమాఖాన్ (నందితాశ్వేత‌)కు ఉన్న సంబంధం ఏంటి?  అస‌లు శేఖ‌ర్‌బాబును ఎవ‌రు చంపారు?  ప‌గ‌తో పెరుమాండ్లు చంపాడా?  ప్రేమ పేరుతో అసీమా చంపిందా?  లేకుంటే స‌వ‌తి త‌ల్లి బిడ్డ అని, ప్ర‌జ‌ల్లో అత‌నికి వ‌స్తున్న పేరును చూసి భ‌రించ‌లేని అన్న చంపాడా? అనేది ఆస‌క్తిక‌రం. కొల్లాపూర్ రాజ‌కుటుంబానికి క‌ల్కికి ఉన్న సంబంధం ఏమిట‌న్న‌ది కూడా ఆస‌క్తిక‌రం. నిత్య జీవితంలో జ‌రిగే ఘ‌ట‌న‌లు క‌ర్మానుసారంగా జ‌రుగుతాయా?  లేకుంటే లాజిక‌ల్‌గా ఉంటాయా? అనేదాన్ని కూడా ఇందులో ప్ర‌స్తావించారు.

ప్ల‌స్ పాయింట్లు

- ఆర్టిస్టుల  పెర్ఫార్మెన్స్
- రీరికార్డింగ్‌
- ఫైట్లు
- కెమెరా
- ద‌శావ‌తారాల కాన్సెప్ట్

మైన‌స్ పాయింట్లు

- మామూలు క‌థ‌
- ఆక‌ట్టుకోని స్క్రీన్‌ప్లే
- అంత‌గా థ్రిల్లింగ్ విష‌యాలు లేక‌పోవ‌డం

విశ్లేష‌ణ‌

ఐపీయ‌స్ అధికారిగా రాజ‌శేఖ‌ర్ త‌న‌దైన పంథాలో మెప్పించారు. ఇన్వెస్టిగేష‌న్ సాగించే స‌న్నివేశాల్లోనూ, ఆంజ‌నేయ దండ‌కం చ‌దివే స‌న్నివేశాల్లోనూ, దుష్టుల‌ను చీల్చిచండాడే స‌న్నివేశాల్లోనూ, గొడుగు పట్టుకుని స్టైల్‌గా చేసిన ఫైట్ల‌లోనూ మ‌రోసారి యాంగ్రీ యంగ్‌మ్యాన్ అని అనిపించుకున్నారు. ఆదాశ‌ర్మ కొన్నిచోట్ల గ్లామ‌ర‌స్‌గా క‌నిపించింది. డాక్ట‌ర్ పాత్ర‌లో చ‌క్క‌గా పెర్ఫార్మ్ చేసింది. ఒక‌ప్ప‌టి ప్రియుడు, విడిపోయిన త‌ర్వాత క‌లిసిన క్ష‌ణంలో ఆమె ప్ర‌ద‌ర్శించిన హావ‌భావాలు మెప్పించాయి. రెండు జ‌డ‌లు వేసుకున్న కొన్ని చోట్ల మాత్రం మేక‌ప్ ఆమెకు స‌రిగా కుద‌ర‌లేదు. భ‌య‌ప‌డుతూనే క్రైమ్ రిపోర్టింగ్ చేసే విలేక‌రి పాత్ర‌లో రాహుల్ రామ‌కృష్ణ న‌వ్వించాడు. సినిమాకు పెద్ద రిలీఫ్ రాహుల్‌. అదే విధంగా క‌ల్కి పాత్ర‌కు పెద్ద స‌పోర్ట్ కూడా రాహుల్ పాత్రే. మ‌హేష్ ఇందులో నాగుల‌కోన వ్య‌క్తిగా కొత్త గెట‌ప్‌లో క‌నిపించాడు. అశుతోష్ రాణా తెర‌పై ఉంటే క్రూర‌త్వానికి ప‌రాకాష్ట అన్న‌ది తెలిసిందే. ఈ సినిమాలోనూ అది క‌నిపించింది. శ‌త్రు విల‌నిజం గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఇందులోనూ అదేపంథాలో క‌నిపించాడు. సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ డ్యూయ‌ల్ మెంటాలిటీని ఎస్టాబ్లిష్ చేసే రోల్‌ను చాలా బాగా పెర్ఫార్మ్ చేశాడు. హిందూ, ముస్లిమ్ మ‌తాల‌ను స‌మానంగా చూసే పాత్ర‌లో నందితా శ్వేత బాగా న‌టించింది.

టెక్నిక‌ల్ విష‌యానికి వ‌స్తే.. `అ!` వంటి డిఫ‌రెంట్ మూవీని తెర‌కెక్కించి ప్ర‌శంస‌లు అందుకున్న ప్ర‌శాంత్ వ‌ర్మ `క‌ల్కి` చిత్రాన్ని కూడా మంచి స్క్రీన్ప్లేతో న‌డిపించాడు. సినిమాలో ఓ మర్డ‌ర్ చుట్టూ సినిమా తిరుగుతుంటుంది. కానీ దాని చుట్టూ ప్రేక్ష‌కుడికి తెలియ‌ని క‌థ ఒక‌టి జ‌రుగుతుంటుంది. అది చివ‌రి ఇర‌వై నిమిషాల్లోనే రివీల్ అయ్యేలా సినిమాను ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ ఆస‌క్తిక‌రంగా మ‌లిచాడు. ఫ‌స్టాఫ్ క్యారెక్ట‌ర్స్‌ను రివీల్ చేసుకుంటూ వచ్చిన ద‌ర్శ‌కుడు సెకండాఫ్‌లో అస‌లు క‌థ‌లోకి తీసుకెళ్లిన తీరు బావుంది. అలాగే 1983 బ్యాక్‌డ్రాప్‌లో సినిమాను ఆసక్తిక‌రంగా నెటివిటీకి స‌రిపోయేలా తెర‌కెక్కించాడు. హీరో ఎంట్రీ సీన్... యాక్ష‌న్ స‌న్నివేశాలు, ఆస‌క్తిక‌రంగా స‌న్నివేశాల‌ను తెరెక్కించిన తీరు అన్నీ ప్రేక్ష‌కుడిని ఆక‌ట్టుకుంటాయి. శ్ర‌వ‌ణ్ భ‌రద్వాజ్ సంగీతం, నేప‌థ్య సంగీతం చాలా బావుంది. క‌థానుగుణంగా సినిమా ఆస‌క్తిక‌రంగా ముందుకు సాగుతున్న‌ప్పుడు సన్నివేశాల‌కు శ్ర‌వ‌ణ్ భ‌రద్వాజ్ సంగీతం వెన్నుద‌న్నుగా నిలిచింది. దాశ‌ర‌థి శివేంద్ర కెమెరా ప‌నిత‌నం చాలా బావుంది. ఇక ఎడిటింగ్ విషయంలో కాస్త కేర్ తీసుకుని ఉండాల్సింది. సినిమా స్లోగా సాగుతుంటుంది. ముఖ్యంగా ఫ‌స్టాఫ్‌లో క‌థ ప‌రంగా చెప్పుకునేంత ఏమీ క‌న‌ప‌డదు.

దుష్ట శిక్ష‌ణ శిష్ట ర‌క్ష‌ణ చేయ‌డానికి మ‌హావిష్ణువు ఎత్తిన ద‌శావ‌తారం `క‌ల్కి`. ఆ ద‌శావ‌తారాన్ని వివ‌రించే క్ర‌మంలో ప్ర‌తి అవ‌తారాన్ని ద‌ర్శ‌కుడు స‌న్నివేశాల‌కు అనుగుణంగా అమ‌ర్చుకుంటూ వెళ్లిన తీరు బావుంది. చాలా నిశితంగా గ‌మ‌నిస్తే అది మ‌న‌కు అర్థ‌మ‌వుతుంది.

చివ‌ర‌గా.. క‌ల్కి.. దుష్ట‌శిక్ష‌ణార్ధం.. క‌ర్మానుసారం

Read Kalki Movie Review in English

Rating : 3.0 / 5.0