close
Choose your channels

'కల్కి' వంటి మాస్‌ కమర్షియల్‌ చిత్రం ద్వారా కథ రచయితగా పరిచయం అయినందుకు చాలా హ్యాపీగా ఉంది - కథ రచయిత సాయితేజ్ దేశరాజ్

Wednesday, July 3, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కల్కి వంటి మాస్‌ కమర్షియల్‌ చిత్రం ద్వారా కథ రచయితగా పరిచయం అయినందుకు చాలా హ్యాపీగా ఉంది - కథ రచయిత సాయితేజ్ దేశరాజ్

యాంగ్రిస్టార్‌ డా. రాజశేఖర్‌ లాంటి కమర్షియల్‌ హీరోకి 'కల్కి' కథ చెప్పి సింగిల్‌ నేరేషన్‌లోనే ఆయన్ని మెప్పించి ఇండస్ట్రీ ద ష్టిని తన వైపు తిప్పుకున్నారు రైటర్‌ సాయి తేజ్ దేశరాజ్. ప్రస్తుతం ఆయన కథ అందించిన 'కల్కి' జూన్‌ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి కమర్షియల్‌ హిట్‌గా నిలిచింది. ఈ సందర్భంగా 'కల్కి' చిత్ర కథ రచయిత సాయి తేజ దేశరాజు ఇంటర్వ్యూ..

మీ గురించి చెప్పండి?

మాది మహబూబ్‌ నగర్‌ జిల్ల్లా. నాకు చిన్నప్పటి నుండి రైటింగ్‌ అంటే ఉన్న ఇంట్రెస్ట్‌తో ఎన్నో కథలు రాసేవాణ్ణి. కానీ వాటిని ప్రచురించడానికి లేదా సమాజంలోకి తీసుకెళ్లడానికి సరైన మాధ్యమం లేదు. వాటిని ఒక బుక్‌ రూపంలో తీసుకురావడానికి చాలా డబ్బు అవసరమవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాను.

మరి 'కల్కి' కథ ఎలా బయటకు వచ్చింది?

కరెక్ట్‌గా అలాంటి సమయంలోనే నేను ఆన్‌లైన్‌లో 'కహానిడాట్‌కామ్‌' అనే ఒక వెబ్‌ సైట్‌ను చూశాను. అందులో ఫ్రీగా మీ కథలు రాయొచ్చు అని చదివి వెంటనే కథ రాయడం మొదలుపెట్టాను. అలా నేను రాసిన మొదటి కథే 'కల్కి'. ఈ కథను నేను దాదాపు ఆరు నెలలపాటు 46 ఎపిసోడ్స్‌గా రాశాను. ఆ వెబ్‌సైట్‌లో 'కల్కి' కథ ఎక్కువ ప్రాధాన్యం పొందింది. ఆ తరువాత ఆ వెబ్‌సైట్‌ ఓనర్‌ పల్లవ్‌ అనే వ్యక్తి నన్ను ప్రశాంత్‌ వర్మకు పరిచయం చేశారు.

ప్రశాంత్‌ వర్మతో మీ జర్నీ ఎలా ఉంది?

నేను ప్రశాంత్‌ వర్మగారికి పరిచయం అయినప్పుడు ఆయన 'అ'! సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమాకు అసోసియేట్‌ రైటర్‌గా పని చేశాను. ఆ జర్నీలోనే ఏదైనా మంచి కథ ఉందా రాజశేఖర్‌గారికి అన్నారు. అప్పుడు ఈ 'కల్కి' కథ గురించి చెప్పాను. దాదాపు మూడున్నర గంటల నేరేషన్‌ ఇచ్చాను. ఆయనకు నచ్చడంతో వెంటనే వెళ్లి రాజశేఖర్‌గారికి నేరేషన్‌ ఇవ్వడం జరిగింది.

కథ చెప్పగానే రాజశేఖర్‌ రియాక్షన్‌ ఎలా ఉంది?

నేను ఆయనకు ఈ కథను 2018 శ్రీరామనవమి రోజున చెప్పాను. కథ చెప్పగానే రాజశేఖర్‌గారికి బాగా నచ్చింది. ఆయనతో పాటు జీవితగారికి నచ్చడంతో వెంటనే సినిమా సెట్స్‌ మీదకి వెళ్ళింది.

సినిమా రిలీజ్‌ అయ్యాక రెస్పాన్స్‌ ఎలా ఉంది?

లాస్ట్‌ వీక్‌ సినిమా విడుదలైంది. ఈరోజు వరకు కూడా స్టోరీ చాలా అద్భుతంగా ఉంది అని ప్రేక్షకులు, సినీ విశ్లేషకులు ప్రశంసించడం చాలా హ్యాపీగా ఉంది. ఎక్కువగా క్లైమాక్స్‌ ట్విస్ట్‌ గురించే మాట్లాడుతున్నారు కథ రాసుకునే సమయం లొనే ఆ ట్విస్ట్ అందరికి నచ్చుతుంది అని నేను నమ్మాను. ఇంత తక్కువ వయసులో పెద్ద బేనర్‌ పేరు మీదుగా ఒక యంగ్‌ డైరెక్టర్‌ ద్వారా నా కథ ఎగ్జిక్యూట్‌ అయినందుకు చాలా సంతోషంగా ఉంది.

రైటర్‌గానే కంటిన్యూ అవుదామనుకుంటున్నారా?

అవునండి! 'కల్కి' సక్సెస్‌ తరువాత చాలా కాన్ఫిడెన్స్‌ వచ్చింది. అలాగే ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్స్‌ కూడా కాంటాక్ట్‌ అయ్యారు. వారికి కథ చెప్పాను. వారి నుండి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఇంకా ముఖ్య విషయం ఏంటంటే ఇదే వీక్‌లో నేను రాజశేఖర్‌గారికి మరో కథ చెప్పబోతున్నాను. అది మంచి ఎమోషన్‌తో కూడిన కాప్‌ థ్రిల్లర్‌. ఆయనకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను.

ఇంకా ఎవరైనా మీ కథ ఓకే అన్నారా?

ఈ ట్రావెలింగ్‌లోనే కొంత మంది స్నేహితుల ద్వారా ముంబై వెళ్లి 'రేస్‌' వంటి సూపర్‌ హిట్‌ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు అబ్బాస్‌ మస్తాన్‌గారికి కథ చెప్పడం జరిగింది. వారికి కూడా కథ నచ్చింది. త్వరలోనే వారి నుండి పిలుపు వస్తుందని ఆశిస్తున్నాను.

రైటర్‌గానే కెరీర్‌ కొనసాగిస్తారా! లేదా దర్శకుడు అయ్యే ఆలోచన ఏమైనా ఉందా?

ఆలోచన అయితే ఉంది. కాకపోతే నేను ఇప్పటి వరకు రాసుకున్న కథలు అన్ని హై బడ్జెట్‌ కథలే. అందుకోసం తక్కువ బడ్జెట్‌తో రూపొందించే కథ రాయాలని చూస్తున్నాను. మాది మహబూబ్‌నగర్‌ కాబట్టి ఆ బ్యాక్‌ డ్రాప్‌తో కథ రాస్తున్నాను. 'కల్కి' చిత్రం కూడా అక్కడి కొల్లాపూర్‌ సంస్థానం, నల్లమల ఫారెస్ట్‌, కృష్ణా నది పరిసర ప్రాతాల్లో 1991 - 92లో జరిగిన కొన్ని యదార్థ ఘటనల ఆధారంగా రాసుకున్న కల్పిత కథే.

రాజశేఖర్‌గారితో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది?

అదొక మెమొరబుల్‌ ఎక్స్‌పీరియన్స్‌. ఫస్ట్‌ ఆయనకు కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు కాస్త భయపడ్డాను. కానీ ఆయనకు సెన్సాఫ్‌ హ్యూమర్‌ చాలా ఎక్కువ. నేను కథ కూడా రాత్రి 10 గంటల నుండి దాదాపు మూడున్నర గంటలు చెప్పాను. చాలా ఓపికగా విన్నారు. 'గరుడవేగ' తర్వాత చాలా కథలు విన్నాను. కానీ.. నన్ను ఇంతలా ఎగ్జయిట్‌ చేసింది ఈ కథే అని సింగిల్‌ నేరేషన్‌లోనే ఓకే చెప్పారు. జీవితగారు కూడా సెట్లో చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. అందరికీ 'కల్కి' రైటర్‌ అని పరిచయం చేశారు.

మీ ఫ్యామిలీ సపోర్ట్‌ ఎలా ఉంది?

మా నాన్నగారు రిటైర్డ్‌ ప్రభుత్వ అధికారి. హౌసింగ్‌ కార్పొరేషన్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌గా వర్క్‌ చేసేవారు. మా ఫ్యామిలీలో ఎవరికీ సినిమా ఇండస్ట్రీతో టచ్‌ లేదు. మొదట నేను ఇండస్ట్రీలోకి వెళ్తాను.. అనగానే వాళ్లు షాక్‌ అయ్యారు. కానీ ఇప్పుడు 'కల్కి'లాంటటి కమర్షియల్‌ సినిమా టైటిల్స్‌లో రచయితగా నా పేరు చూడగానే చాలా హ్యాపీగా ఫీల్‌ అయ్యారు. మానాన్న ఏమైనా కథలు ఉంటే ముందు నాకే చెప్పు అని చాలా బాగా ఎంకరేజ్‌ చేస్తున్నారు.

మీ నెక్స్ట్‌ ప్రాజెక్ట్స్‌ గురించి?

ఇటీవల 'కార్తికేయ' సినిమా నిర్మాత వెంకట శ్రీనివాస్‌గారికి ఒక సీరియల్‌ కిల్లర్‌ కి సంబంధించిన స్టోరీ చెప్పడం జరిగింది. అయన ప్రొడ్యూస్‌ చేయడానికి ముందుకు వచ్చారు. టైటిల్‌ 'కిన్నెరసాని'. తరువాత ఒక భారీ స్టార్‌కి స్టోరీ లైన్‌ చెప్పాను. చాలా బాగుంది. ఫుల్‌ స్టోరీ నేరేట్‌ చేయమని చెప్పారు. ఇంకో రెండు రోజుల్లో ఆ స్టోరీ చెప్తాను. తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఆ తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తాను.. అంటూ ఇంటర్వ్యూ ముగించారు రైటర్‌ సాయి తేజ దేశరాజు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.