కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం మరోసారి వాయిదా

  • IndiaGlitz, [Thursday,September 17 2020]

విజయవాడ నగర వాసుల ఎన్నో ఏళ్ల కల సాకారమైంది. కనకదుర్గ ఫ్లై ఓవర్ నగరానికే ఒక మణిహారంలా నిలవబోతోంది. అయితే దీని ప్రారంభోత్సవం మాత్రం మరోసారి వాయిదా పడింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా ఈ ఫ్లై ఓవర్ ప్రారంభం కావాల్సి ఉండగా.. బుధవారం ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ప్రారంభోత్సవాన్ని వాయిదా వేస్తున్నట్టు ఎంపీ కేశినేని నాని తెలిపారు. నిజానికి ఈ ఫ్లై ఓవర్ ఈ నెల 4నే ప్రారంభం కావాల్సి ఉంది. అయితే అదే సమయంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణించడంతో కేంద్రం వారం రోజుల పాటు సంతాప దినాలను పాటించాలని సూచించింది. ఈ నేపథ్యంలో ప్రారంభోత్సవం వాయిదా పడింది.

ప్రస్తుతం నితిన్ గడ్కరీకి కరోనా పాజిటివ్ అని తేలడంతో మరోసారి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజుల పాటు రాకపోకలను నిలిపివేస్తే ప్రజలు ఇబ్బంది పడనుండటంతో ఫ్లై ఓవర్‌పై వాహనాల రాకపోకలను రేపటి నుంచి అనుమతిస్తున్నట్టు కేశినేని నాని తెలిపారు. ‘‘గడ్కరీ గారికి కరోనా రావటం వల్ల రేపు జరగబోయే కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభం వాయిదా పడింది కాని ప్రజా అవసరాల దృష్ట్యా కనకదుర్గ ఫ్లైఓవర్ పై ట్రాఫిక్ రేపటి నుండి వదలటం జరుగుతుంది’’ అని కేశినేని నాని ట్వీట్‌లో పేర్కొన్నారు.