కూతురి రాకకై నిరీక్షణ.. సాయంత్రం తల్లిదండ్రుల సమాధుల వద్ద పునీత్ అంత్యక్రియలు

  • IndiaGlitz, [Saturday,October 30 2021]

కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుతో శుక్రవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆసుపత్రి నుంచి ఆయన పార్థీవ దేహాన్ని నిన్న సాయంత్రం బెంగళూరు సదాశివనగర్‌లోని ఆయన ఇంటికి తరలించారు. అక్కడి నుంచి అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం కంఠీరవ స్టేడియంకు తీసుకెళ్లారు. తమ అభిమాన నటుడిని చివరిసారిగా చూసేందుకు కర్ణాటక నలుమూలల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు తరలివస్తున్నారు. దీంతో కంఠీరవ స్టేడియం ఇసుక వేస్తే రాలనంత మంది జనాలతో నిండిపోయింది.

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు శనివారం సాయంత్రం 6 గంటలకు కంఠీరవ స్టూడియోలోని ఆయన తల్లిదండ్రుల సమాధుల పక్కనే జరగనున్నాయి. అమెరికాలో వున్న పునీత్ కుమార్తె ధృతి న్యూయార్క్ నుంచి బయల్దేరారు. ఇప్పటి వరకు అందుకున్న సమాచారం  ప్రకారం ఆమె మధ్యాహ్నానికి న్యూఢిల్లీకి చేరుకుంటారని.. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 4.30 గంటలకు బెంగళూరుకు వస్తారని తెలుస్తోంది.

అనంతరం కంఠీరవ స్టేడియం నుంచి తమ కుటుంబానికి చెందిన కంఠీరవ స్టూడియో వరకు పునీత్ అంతిమయాత్ర జరగనుంది. పునీత్ తండ్రి డాక్టర్ రాజ్‌కుమార్, ఆయన తల్లి పార్వతమ్మ రాజ్‌కుమార్ అంత్యక్రియలు కూడా కంఠీరవ స్టూడియోలోనే జరిగాయి.