Download App

Kavacham Review

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తొలి చిత్రం నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ చేసిన‌వ‌న్నీ భారీ చిత్రాలే. ఆయ‌న మార్కెట్ స్థాయిని మించి ఖ‌ర్చు చేసిన చిత్రాలే. అయితే తొలిసారి సినిమా విడుద‌ల‌కు ముందే సేఫ్‌గా ఉన్నామ‌ని ఆయ‌నే స్వ‌యంగా ప్ర‌క‌టించిన చిత్రం `క‌వ‌చం`. కో డైర‌క్ట‌ర్‌గా ఎన్నో సినిమాల‌కు ప‌నిచేసి అటు ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ఇటు వెంక‌టేష్‌లాంటి హీరోల మెప్పు పొందిన శ్రీనివాస్ మామిళ్ల తొలిసారి మెగాఫోన్ చేత‌బ‌ట్టి చేస్తున్న సినిమా `క‌వ‌చం`. ఈ చిత్రం ఎన్నిక‌ల రోజున శుక్ర‌వారం విడుద‌లైంది. తొలిసారి హీరో కాప్ రోల్ చేసిన ఈ సినిమా ఎలా ఉంది? ఓ సారి చ‌దివేయండి..

క‌థ‌:

విజ‌య్‌.బి. కి నిజాయ‌తీ ఉన్న పోలీస్ ఆఫీస‌ర్‌. పోలీస్ యూనిఫార‌మ్‌మీద గౌర‌వం ఉంటుంది. అత‌ని తండ్రి (ఆహుతి ప్ర‌సాద్‌) కూడా పోలీస్ ఆఫీస‌రే. యూనిఫార్మ్ కు ఉన్న స్పెషాలిటీని వివ‌రిస్తుంది త‌ల్లి. అంటే ఖాకీకి వాళ్ల ఫ్యామిలీ చాలా రెస్పెక్ట్ ఇస్తుంద‌న్న‌మాట‌. అలాంటి కుటుంబంలో పుట్టిన విజ‌య్‌కి ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్ట్ కావాల‌నేది కోరిక‌. అలాంటి క‌ల‌లే కంటుంటాడు. ఓ సారి విజ‌య్ ప‌ర్సు పోతే ఓ లేడీ (కాజ‌ల్‌) తెచ్చిస్తుంది. దాన్ని తీసుకున్న అత‌ను తొలి చూపులోనే ఆమెతో ప్రేమ‌లో ప‌డ‌తాడు. అయితే దాన్ని వ్య‌క్తం చేయ‌డానికి ముందే ఆమె కు పెళ్లి ఫిక్స్ అయింద‌నే సంగ‌తి తెలుస్తుంది. ఓ సారి ప్ర‌మాదంలో ఉన్న సంయుక్త (మెహ్రీన్‌)ను కాపాడుతాడు. ఆమెను తీసుకెళ్లాల్సిన ఆమె ప్రియుడు అక్క‌డికి రాక‌పోవ‌డంతో, వేరే గ‌త్యంత‌రం లేక ఆమెను త‌న ఇంటికి తీసుకొస్తాడు. ఆమెతో చ‌నువు పెరుగుతుంది. ఆమెతో త‌న ప్రేమ‌క‌థ‌ను చెప్పుకొంటాడు. సంయుక్త‌ను ఆమె ఇంటికి పంపించే స‌మ‌యానికి విజ‌య్ త‌ల్లికి యాక్సిడెంట్ అవుతుంది. ఆమె వైద్యం కోసం సంయుక్త సాయం చేస్తుంది. కానీ ఓ సంద‌ర్భంలో నిజ‌మైన సంయుక్త ఈమె కాద‌ని, తాను ప్రేమించిన వ్య‌క్తి అని తెలుస్తుంది విజ‌య్‌. అస‌లు ఈమెకు సంయుక్త‌గా న‌టించాల్సిన అవ‌స‌రం ఏంటి? అస‌లు సంయుక్త‌కు ఏమైంది? ఆమెకు విజ‌య్ అంటే ఇష్ట‌మేనా కాదా? ఆమె  క‌నిపించ‌కుండా పోవ‌డంలో ఆమె బావ ప్ర‌మేయం ఎంత ఉంది? ఆమెకున్న వేల కోట్ల ఆస్తిపై క‌న్నేసింది ఎవ‌రు? వ‌ంటివ‌న్నీ సెకండాఫ్‌లో రివీల్ అయ్యే విష‌యాలు.

ప్ల‌స్ పాయింట్లు:

సినిమాకు ఇంట‌ర్వెల్ బ్లాక్ ప్ల‌స్ అవుతుంది. కెమెరాప‌నిత‌నం బావుంది. తొలి షాట్, ఆ స‌న్నివేశంలో వాడిన లైట్లు బావున్నాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కి ఖాకీ యూనిఫార్మ్ బాగా సూట్ అయింది. యాక్ష‌న్ ఎపిసోడ్స్ లో అత‌ను ఫైట్ చేస్తుంటే న‌మ్మ‌ల‌నిపించేలా ఉంది. డ్యాన్సులు కూడా బాగా చేశాడు. మెహ్రీన్ గ‌త చిత్రాల‌తో పోలిస్తే బాగా త‌గ్గింది. న‌ట‌నాప‌రంగానూ కాస్త ఫ‌ర్వాలేద‌నిపించింది. ఆర్ట్ డిపార్ట్ మెంట్‌ను త‌ప్ప‌కుండా ప్ర‌శంసించాల్సిందే. వాళ్ల ప‌నితీరు మెప్పించింది. లొకేష‌న్లు కూడా క‌నుల‌కింపుగా బావున్నాయి. సెకండాఫ్ కాస్త స్పీడ్‌గా సాగిన తీరు, స్క్రీన్‌ప్లే బావుంది.

మైన‌స్ పాయింట్లు:

కాజ‌ల్ హెయిర్ స్టైల్ పెద్ద‌గా మెప్పించ‌దు. కాజ‌ల్‌లో చార్మ్ త‌గ్గిన‌ట్టే అనిపిస్తుంది కొన్ని స‌న్నివేశాల్లో. డైలాగులు అక్క‌డ‌క్క‌డా ఫ‌ర్వాలేద‌నిపించినా, పెద్ద‌గా బాగోవు. కామెడీ చెప్పుకోద‌గ్గ‌ట్టు లేదు. పోసాని కేర‌క్ట‌ర్ రొటీన్‌గా అనిపించింది. చాలా పాత్ర‌లకు ప్రాధాన్యం ఉండ‌దు. ఏదో ఉన్నాయంటే ఉన్నాయ‌న్న‌ట్టు అనిపిస్తుంది. త‌మ‌న్ ఇచ్చిన బాణీలు రిపీటెడ్‌గా హ‌మ్ చేసుకునేలా లేవు. రీరికార్డింగ్ కూడా గొప్ప‌గా అనిపించ‌దు

విశ్లేష‌ణ‌:

క‌టౌట్ల‌ను చూసి కొన్ని కొన్నిటిని న‌మ్మేయాల‌న్న‌ట్టు.. ఈ సినిమాలోని పోలీస్ వేషం బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు బాగానే సూట్ అయింది. హెయిర్ స్టైల్‌, మ‌జిల్స్.. అన్నీ అచ్చం పోలీస్ ఆఫీస‌ర్ లా అనిపించాయి. హీరో బిల్డ‌ప్ షాట్‌లు కూడా చాలానే ప‌డ్డాయి. వాటన్నిటిమీద‌, భారీత‌నం మీద పెట్టిన ధ్యాస‌ను ఫ‌స్టాఫ్‌లో ప్రీ ఇంట‌ర్వెల్ కి ముందు వ‌చ్చే స‌న్నివేశాల‌పై ఇంకాస్త పెట్టి ఉంటే బావుండేదేమో. దర్శ‌కుడు కొత్త‌వాడైనా ఎక్క‌డా త‌డ‌బ‌డ్డ‌ట్టు అనిపించ‌లేదు. చేసినంత వ‌ర‌కు సాఫీగా చేసుకుంటూ వెళ్లారు. చోటా.కె.నాయుడు త‌న కెమెరా ప‌నిత‌నానికి మ‌రోసారి మంచు మార్కులు వేయించుకున్నారు. కాజ‌ల్‌కి డ‌బ్బింగ్ పెద్ద‌గా సెట్ కాలేదు. లొకేష‌న్లు బావున్నాయి. డైలాగులు కూడా ఆద్యంతం కాక‌పోయినా, అక్క‌డ‌క్కడా బావున్నాయి. కొన్నిసార్లు డైలాగ్‌లో ప‌వ‌ర్ ఉన్నా, దాన్ని మోయ‌ద‌గ్గ స్థాయి సీన్ల‌కు లేదేమోన‌నిపించింది. పై ఆఫీస‌ర్లుండ‌గా, కింది స్థాయి ఉద్యోగులు ఎంత వ‌ర‌కు అధికారాన్ని ఉప‌యోగించ‌గ‌ల‌రు?  వంటి విష‌యాల‌న్నీ కొన్ని లాజిక్‌ల‌కు అంద‌ని విష‌యాలు. వాటన్నిటినీ సినిమాటిక్ లిబ‌ర్టీ అని ఫీల్ కావాల్సిందే. `క‌వచం` క‌థ‌గానూ కొత్త క‌థేమీ కాదు. రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ ల‌వ్ స్టోరీ. కాక‌పోతే బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కి కొత్త త‌ర‌హా సినిమా.

బాట‌మ్ లైన్‌:  రొటీన్ క‌మ‌ర్షియ‌ల్‌ 'క‌వ‌చం'

Read 'Kavacham' Movie Review in English

Rating : 2.5 / 5.0