close
Choose your channels

నిన్న కేసీఆర్.. ఇవాళ హరీష్.. కేంద్రంపై యుద్ధం!?

Wednesday, May 6, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నిన్న కేసీఆర్.. ఇవాళ హరీష్.. కేంద్రంపై యుద్ధం!?

కేంద్ర ప్రభుత్వంపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పీకల్లోతు కోపంతో ఊగిపోతున్నాయి. ఇప్పటికే మానిటోరియం, కేంద్రం చేతుల్లోకి కరెంట్, ఎఫ్ఆర్‌బీఎమ్‌, వలస కార్మికుల తరలింపుతో పాటు పలు విషయాల్లో కేంద్రం ప్రవర్తించిన సరిగ్గా లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ మీడియా మీట్ పెట్టి మరీ తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు.. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం తీరుపై ఆకాశం, భూమిని ఏకం చేస్తామని అనగా.. ప్రతిపక్ష, బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసి నిరసనకు దిగుతామని కూడా కేసీఆర్ ప్రకటించారు. దీంతో మరోసారి ఢిల్లీ వేదికగా కేసీఆర్ చక్రం తిప్పడానికి సిద్ధమయ్యారని స్పష్టంగా అందరికీ అర్థమైంది. కేసీఆర్ మాటల యుద్ధం మరువక ముందే రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అంటే నిన్న కేసీఆర్.. ఇవాళ హరీశ్ రావు కేంద్రంపై మాటల యుద్ధం చేశారన్న మాట. ఇవాళ పర్యటనలో భాగంగా మెదక్‌లో హరీష్ మీడియా మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ప్రతిపక్ష కాంగ్రెస్‌లపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఏం ఉద్ధరించారో చెప్పండి..!

తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ విధానం దేశానికే ఆదర్శం. కరోనా పరిస్థితుల్లో‌ కేంద్రం చేసిన సాయం ఏమీ లేదు. ఎఫ్.ఆర్.బి.ఎం పరిమితి పెంచాలని కోరినా.. కేంద్రం స్పందించడం లేదు. రైతు‌బంధు కోసం‌ రూ. 12 వేల కోట్లు కేటాయిస్తే రూపాయి కోత పెట్టకుండా 12 వేల‌కోట్లు విడుదల చేశాం. రైతుల కోసం పనిచేస్తున్న సీఎం కేసీఆర్ మీద ఇష్టారీతిన విమర్శలు చేస్తున్నారు.. ఇది ఏ మాత్రం సబబు కాదు. రైతులకు 25 వేల‌రూపాయల రుణాలను ఒకే సారి మాఫీ చేయనున్నాం. ఇందు కోసం‌ ఆర్థిక శాఖ‌1200 కోట్లు విడుదల చేసింది. వ్యవసాయ శాఖ ఈ మొత్తాన్ని దాదపు 5 లక్షల 85 వేల‌మంది రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయనుంది. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో‌ఏం ఉద్ధరించారో‌ ముందు చెప్పండి. దేశంలో‌ రైతులకు మద్ధతు ధర ఇచ్చి అన్ని పంటలు‌ కొంటున్న ఏకైక‌ రాష్ట్రం తెలంగాణ. రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఒకే విడతలో చేస్తామని రాహుల్ గాంధీ హమీ ఇచ్చి చత్తీస్‌గఢ్ ప్రజలను మోసం చేశారు. రైతు బంధు, దేశంలో 24 గంటల కరెంట్, రైతులకు బీమా ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే’ అని హరీష్ తెలిపారు.

సమాధానమివ్వరేం..!?

‘ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం‌ చేయమని ఎన్ని సార్లు కోరినా కేంద్రం పట్టించుకోలేదు. కరోనా విషయంలోనూ ఏ సాయం చేయలేదు. ఎఫ్.ఆర్.బి.ఎం పరిమితి పెంచాలని కోరినా సమాధానం ఇవ్వడం లేదు. రాష్ట్రం అప్పులను రీషెడ్యూల్ చేయాలని, మారటోరియం ప్రకటించాలని కోరాం. దీనికి కేంద్రం సమాధానమివ్వలేదు. ఏప్రిల్ నెలలో రూ.2300‌ కోట్లు కోత పెట్టారు. జీఎస్టీ,‌ ఐ జీఎస్టీ బకాయిలు ఇవ్వలేదు. ఇవ్వాల్సినవి ఇవ్వకుండా మాపై విమర్శలు చేస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. మమ్మల్ని విమర్శించే నైతిక హక్కు ఎవరికీ లేదు’ అని కేంద్రంపై హరీష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కష్టం కాలం తర్వాత యుద్ధమే..!

మొత్తానికి చూస్తే కేంద్రంపై కేసీఆర్, హరీష్ రావు గుర్రుగానే ఉన్నారు. ఎన్నికలకు ముందు ఫెడరల్ ఫ్రంట్ అని కేసీఆర్ ఢిల్లీ వేదికగా చక్రం తిప్పారు. కేసీఆర్‌కు ఊహించిన దానికంటే ఎక్కువ రాష్ట్రాల ప్రభుత్వాలు, మాజీ ముఖ్యమంత్రులు, పలువురు ఉద్ధండులు మద్దతిచ్చారు. కేంద్రం ఇలాగే ప్రవర్తిస్తే మరోసారి కేసీఆర్ ఢిల్లీకెళ్లి బీజేపీ వ్యతిరేక.. ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే.. కరోనా కష్ట కాలం తర్వాత కచ్చితంగా కేసీఆర్ మాత్రం కేంద్రంపై యుద్ధం చేస్తానడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. ఏం జరుగుతుందో జస్ట్ వెయిట్ అండ్ సీ.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.