close
Choose your channels

కేసీఆర్ ప్లాన్.. తెలంగాణలో వైసీపీ.. షర్మిలకు బాధ్యతలు!

Tuesday, December 8, 2020 • తెలుగు Comments
KCR
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కేసీఆర్ ప్లాన్.. తెలంగాణలో వైసీపీ.. షర్మిలకు బాధ్యతలు!

రాష్ట్రంలో వరుసగా ఎదురవుతున్న పరాభవాల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ అప్రమత్తమయ్యారు. ఇక మీదట కూడా లైట్ తీసుకుంటే పరిస్థితి చేజారి పోతుందని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆపరేషన్ లోక్‌సభ, అసెంబ్లీని చేపట్టినట్టు సమాచారం. వ్యూహ.. ప్రతివ్యూహాలతో ఇక మీదట ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయనున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకత నుంచి పార్టీని, ప్రభుత్వాన్ని బయటపడేసే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ మేరకు చాలాకాలం క్రితం తెలంగాణ రాజకీయాలకు వైసీపీ దూరంగా ఉంటూ వస్తోంది. ప్రస్తుతం వైసీపీతో తెలంగాణలో కార్యకలాపాలను ప్రారంభింపచేసి బీజేపీని నిలువరించేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. తద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో చీలిక తేవటం లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం.

ఈ మేరకు కేసీఆర్.. ఇప్పటికే వ్యూహ రచన చేసినట్టు తెలుస్తోంది. ఏపీ సీఎం జగన్‌కు తెలంగాణలోనూ అభిమానులున్నారు. ఆయన తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి ఇప్పటికీ వీరాభిమానులున్నారు. ఆయన సమైక్యాంధ్రకు సీఎంగా కొనసాగిన సమయంలో ప్రవేశపెట్టిన పథకాల ద్వారా ఎందరో లబ్ది పొందారు. వారంతా ఇప్పటికీ వైఎస్‌ను ఎంతగానో అభిమానిస్తారు. అదే అభిమానంతో ఆయన హఠాన్మరణం తరువాత జగన్ సీఎం కావడానికి కావల్సిన సహాయ సహకారాలను తెలంగాణలోని పలువురు ముఖ్యులు అందించారు. వైఎస్ కుటుంబాన్ని ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రజలు ఆదరిస్తూనే ఉన్నారు. జగన్ జైలులో ఉన్నప్పుడు ఆయన సోదరి షర్మిల తెలంగాణలో సైతం పాదయాత్ర చేపట్టారు. ఆమె పాదయాత్రకు తెలంగాణలో మంచి స్పందనే వచ్చింది. ఒక్క తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకారం అందించలేదన్న భావన తప్ప తెలంగాణ ప్రజల్లో జగన్‌పై మంచి అభిమానమే ఉంది. ఇప్పుడు ఆ అభిమానాన్ని క్యాష్ చేసుకునేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో వైసీపీతో కార్యకలాపాలు ప్రారంభింపజేసి.. షర్మిలకు వాటి బాధ్యతలు అప్పగించేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

కేసీఆర్, జగన్ మధ్య సత్సంబంధాలున్నాయి. జగన్ సీఎం అయ్యాక ఇవి మరింత బలపడ్డాయి. ఎన్నికల్లో ఒకరికొకరు సహకారం అందించుకోవడం నుంచి ప్రతి విషయంలో ఏకతాటిపైనే నడుస్తున్నారు. అటు దుబ్బాక, ఇటు జీహెచ్ఎంసీ ఫలితాలతో కంగు తిన్న కేసీఆర్.. ఇక మీదట జగన్‌ను రంగంలోకి తీసుకొచ్చి తెలంగాణలో బీజేపీకి చెక్ పెట్టాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం.

ప్రస్తుతం నాగార్జున సాగర్ ఉప ఎన్నికతో పాటు కొద్ది నెలల్లో ఖమ్మం, వరంగల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలున్నాయి. వీటిల్లో బీజేపీకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలి. పైగా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధమవ్వకపోతే మొదటికే మోసం వస్తుంది. ఈ క్రమంలోనే వైసీపీతో కార్యకలాపాలు ఏర్పాటు చేయించి బలమైన రెడ్డి సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకోవడంతో పాటు జగన్ కుటుంబానికున్న నేమ్‌తో బీజేపీకి చెక్ పెట్టాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం కోర్టు కేసులను ఎదుర్కొంటున్న జగన్.. మరి బీజేపీకి ఎదురెళతారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. కేసీఆర్ ప్రతిపాదనకు దాదాపు ఆయన అంగీకరించకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.