అసెంబ్లీలో వైఎస్ జగన్.. కేసీఆర్ సడన్‌ సర్‌ఫ్రైజ్ !

  • IndiaGlitz, [Monday,June 17 2019]

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సోమవారం నాడు మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కూడా ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్నారు. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ అమరావతికి వెళ్లనున్నారు. అటు జగన్ అసెంబ్లీలో ఉండగా.. కేసీఆర్ సడన్ సర్‌ఫ్రైజ్ ఇవ్వనున్నారు. కాగా.. అమరావతిలో కేసీఆర్ పర్యటనకు రెండు కారణాలున్నాయి. ఈనెల 21న తెలంగాణలో నిర్వహించనున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్ మోహన్ రెడ్డిని ఆహ్వానించనున్నారు. అనంతరం విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి దీక్షా స్వీకరణ కార్యక్రమానికి వైఎస్ జగన్‌తో కలిసి కేసీఆర్ హాజరు కానున్నారు.

కేసీఆర్ పర్యటన ఇలా...

సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి బయల్దేరి 12: 45గంటలకు కేసీఆర్ గన్నవరం విమానాశ్రయం చేరుకోనున్నారు. అక్కడ నుంచి నేరుగా విజయవాడ ఎంజీ రోడ్డులోని గేట్‌ వే హోటల్‌కు వెళతారు. అనంతరం రోడ్డుమార్గంలో ఇంద్రకీలాద్రి వెళ్ళనున్నారు. 1: 45 గంటలకు విజయవాడలో కనకదుర్గమ్మను కేసీఆర్ దర్శించుకుంటారు. ఆ తర్వాత 2.30 గంటలకు అమరావతిలోని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు జగన్ ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. ఇద్దరూ కొద్దిసేపు చర్చలు జరుపుతారు. అనంతరం సాయంత్రం తర్వాత 5 గంటలకు విజయవాడలోని గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి చేరుకుంటారు. అక్కడ విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి దీక్షా స్వీకరణ కార్యక్రమానికి హాజరవుతారు. రాత్రి 7: 40 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి 8: 25 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటారు.