టాలీవుడ్‌ బెస్ట్‌గా ఉండాలన్నది కేసీఆర్ కోరిక : తలసాని

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో టాలీవుడ్ దర్శకనిర్మాతలు, సీనియర్ హీరోలు భేటీ అయ్యిన విషయం తెలిసిందే. సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీకి చిరు అధ్యక్షత వహించారు. హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌లో ఉన్న చిరు ఇళ్లు ఈ భేటీకి వేదిక అయ్యింది. ఈ సందర్భంగా పలు విషయాలను మంత్రి తలసాని దృష్టికి తీసుకెళ్లారు. ఈ కీలక సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి.. అన్ని ఇండస్ట్రీల్లో టాలీవుడ్‌‌ను బెస్ట్‌గా చేయాలన్నదే సీఎం కేసీఆర్ కోరిక అని చెప్పారు. అందరి అభిప్రాయాలు తీసుకుని షూటింగులు, థియేటర్ల పునఃప్రారంభంపై ముందుకెళ్తామని తెలిపారు. మరీ ముఖ్యంగా.. షూటింగుల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించామని.. సినిమాల చిత్రీకరణపై ప్రాధాన్యతలు గుర్తించాలని, వాటిపై మరింత చర్చించాలని నిర్ణయం తీసుకున్నట్లు తలసాని తెలిపారు.

సీఎం దృష్టికి తీసుకెళ్తా..!

చిరు మాట్లాడిన తర్వాత పలువురు నిర్మాతలు కూడా సమావేశంలో మాట్లాడారు. షూటింగ్‌లు, పోస్ట్‌ ప్రొడక్షన్స్‌ అనుమతులు కావాలని నిర్మాతలు కోరారు. నిర్మాత అభ్యర్థనను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని తలసాని చెప్పుకొచ్చారు. దేశంలోని సినిమా ఇండస్ట్రీల్లో మనదే బెస్ట్ ఉండాలనేది సీఎం గారి కోరిక అని మంత్రి తెలిపారు. బెస్ట్ పాలసీని తీసుకురావాలని సీఎం గారితో చర్చలు జరుపుతున్నామన్నారు. సీఎంగారితో చర్చించి త్వరలోనే మంచి సినిమా పాలసీని ప్రకటిస్తామని ఆయన తెలిపారు. కాగా.. షూటింగ్ ఎలా చేస్తారు..? ఏమేం ఉండాలి..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు..? అనే దానిపై మాక్ వీడియో ఇవ్వాలని మంత్రి కోరగా.. త్వరలోనే ప్రభుత్వానికి అందిస్తామని నిర్మాతలు తెలిపారు. ఇదిలా ఉంటే.. ఈ సమావేశానికి అక్కినేని నాగార్జున, దిల్ రాజు, రాజమౌళి, నాని, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, అల్లు అరవింద్, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, సి కల్యాణ్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.