Download App

Kittu Unnadu Jagratha Review

గ‌తేడాది ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యానర్‌పై ఈడోర‌కం ఆడోర‌కం సినిమాతో స‌క్సెస్ కొట్టిన రాజ్ త‌రుణ్, అదే బ్యాన‌ర్‌లో చేసిన సినిమా `కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌`. హీరో కుక్క‌ల‌ను కిడ్నాప్ చేస్తాడ‌నే కాన్సెప్ట్ ముందుగానే తెలియ‌డంతో, హీరో ఏంటి, కుక్క‌ల‌ను కిడ్నాప్ చేయ‌డం ఏంట‌నే ఆస‌క్తి ప్రేక్ష‌కుల్లో క‌లిగింది. దొంగాట ద‌ర్శ‌కుడు వంశీకృష్ణ సినిమాను డైరెక్ట్ చేశాడు. ప‌ద‌కొండేళ్ళ త‌ర్వాత అర్బాజ్ ఖాన్ చేసిన తెలుగు సినిమా కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌. మ‌రి ఈ కిట్టు ఎలా ఆక‌ట్టుకున్నాడో తెలుసుకోవాలంటే ముందు క‌థ‌ను తెలుసుకుందాం...

క‌థ:

అనాధ అయిన కృష్ణ‌మూర్తి అలియాస్ కిట్టు(రాజ్‌త‌రుణ్‌) మెకానిక‌ల్ ఇంజ‌నీరింగ్ చ‌దివి కారు గ్యారేజ్‌ను న‌డుపుతుంటాడు. కిట్టు స్నేహితులు ప్ర‌వీణ్‌, సుద‌ర్శ‌న్‌లు అత‌నికి తోడుగా ఉంటారు. ఓ సారి కారు రిపేరుక‌ని వ‌చ్చిన జాన‌కి(అను ఇమ్మాన్యుయ‌ల్‌)ను చూసి కిట్టు ఆమెతో ప్రేమ‌లో ప‌డ‌తాడు. కిట్టు మంచిత‌నం చూసి జానకి కూడా అత‌న్ని ప్రేమిస్తుంది. ఇల్లు కొన‌డానిక‌ని జానకి వాళ్ళ నాన్న ఇచ్చిన పాతిక‌ల‌క్ష‌ల‌ను జాన‌కి త‌న కారులో మ‌రచిపోయి, ఆ డ‌బ్బును జాగ్ర‌త్త చేయ‌మ‌ని చెబుతుంది. కానీ కిట్టు స్నేహితుడు ఒక‌డు డ‌బ్బుతో పారిపోవ‌డంతో, కిట్టు త‌న ప్రేయ‌సి కోసం పాతిక లక్ష‌లు అప్పు చేస్తాడు. ఆ అప్పు కిట్టు అత‌ని స్నేహితుల ప్రాణం మీద‌కు వ‌స్తుంది. వ‌డ్డీని క‌ట్టాల‌నుకున్న కిట్టు అండ్ గ్యాంగ్ విధిలేక కుక్క‌లను కిడ్నాప్ చేయ‌డం మొద‌లు పెడ‌తారు. చివ‌ర‌కు కిట్టు ప్రేయ‌సి కూడా దూర‌మైపోతుంది. చివ‌ర‌గా ఓ కుక్క‌ను కిడ్నాప్ చేయాల‌నుకుంటాడు కిట్టు. ఆ కుక్క ఐటీ క‌మీష‌న‌ర్ ఆదిత్య నారాయ‌ణ‌న్‌(నాగ‌బాబు)ది. జాన‌కి, ఆదిత్య కూతురని కూడా కిట్టుకు తెలియ‌దు. చివ‌ర‌కు కిట్టు పొర‌పాటు వ‌ల్ల జాన‌కి ప్ర‌మాదంలో ప‌డుతుంది. పోలీసులు కిట్టునే అనుమానిస్తారు. అప్పుడు కిట్టు ఏం చేస్తాడు? అస‌లు జానకికి వ‌చ్చిన ప్ర‌మాదం ఏంటి?  చివ‌ర‌కు కిట్టు త‌న ప్రేమ‌ను ఎలా గెలుచుకున్నాడ‌నేదే క‌థ‌..అది తెలియాలంటే సినిమా చూడాల్సిందే...

ప్ల‌స్ పాయింట్స్:

- న‌టీన‌టుల ప‌నితీరు
- సంగీతం
- బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌
- సినిమాటోగ్ర‌ఫీ
- ద‌ర్శ‌క‌త్వం
- పృథ్వీ కామెడి

మైన‌స్ పాయింట్స్:

- అక్క‌డ‌క్క‌డా కొన్ని బోరింగ్ సీన్స్ ఉండ‌టం
- పృథ్వీ కామెడి మిన‌హా కామెడి ట్రాక్ స‌రిగా అనిపించ‌దు.
- అర్భాజ్ ఖాన్ పాత్ర‌ను చివ‌ర్లో బ‌ఫూన్ చేయ‌డం
- సెకండాఫ్‌లో సినిమా ట్రాక్ త‌ప్ప‌డం

విశ్లేష‌ణ:

రాజ్‌త‌రుణ్ కిట్టుగా సినిమాను తానై ముందుకు న‌డిపించాడు. అక్క‌డ‌క్క‌డా చిన్న చిన్న ఫైట్స్ చేసినా ఎక్క‌డా ఓవ‌ర్ చేసిన‌ట్టు అనిపించ‌దు. అనుఇమ్మాన్యుయ‌ల్ లుక్స్ ప‌రంగా ఆక‌ట్టుకుంది. త‌న పాత్ర‌కు న్యాయం చేసింది. అర్భాజ్‌ఖాన్ రోల్‌ను స్టార్టింగ్‌లో ప‌వ‌ర్‌ఫుల్‌గా చూపించినా, చివ‌ర్లో కామెడి చేసేశారు. ఇక రేచీక‌టి రేచీగా పృథ్వీ కామెడి మెప్పిస్తుంది. నాగ‌బాబు, రాజా ర‌వీంద్ర‌, ప్ర‌వీణ్‌, సుద‌ర్శ‌న్ త‌దిత‌రులు వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. ర‌ఘుబాబు ట్రాక్ బాలేదు. ఇక ద‌ర్శ‌కత్వం విష‌యానికి వ‌స్తే, ద‌ర్శ‌కుడు వంశీకృష్ణ సినిమాను గ్రిప్పింగ్‌గా న‌డిపించాడు. సెకండాఫ్‌లో సినిమా ట్రాక్ త‌ప్పి రొటీన్ అనిపించేస్తుంది కానీ, హీరో కుక్క‌ల‌ను కిడ్నాప్ చేయ‌డం, దానికి అత‌ను ప‌డే పాట్లు ప్రేక్ష‌కుల‌ను న‌వ్విస్తాయి. అనూప్ మ్యూజిక్‌లో పాట‌లు ప‌రావాలేదు.బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బావుంది. రాజ‌శేఖ‌ర్ ప్ర‌తి సీన్‌ను ఫ్రెష్ లుక్‌తో చూపించాడు. ఎం.ఆర్‌.వ‌ర్మ ఎడిటింగ్ బావుంది. సినిమా ఆసాంతం అక్క‌డ‌క్క‌డా కొన్ని బోరింగ్ సీన్స్ క‌న‌ప‌డ‌తాయి. సింగ‌పూర్ సిరిమల్లి అంటూ హంసానందిని చేసిన స్పెష‌ల్ సాంగ్ బావుంది. క‌న్‌ఫ్యూజింగ్ కామెడితో చాలా చిత్రాలే వ‌చ్చినా ద‌ర్శ‌కుడు అండ్ టీం సినిమా ఆస‌క్తిక‌రంగా ముందుకు  న‌డ‌ప‌డంలో స‌క్సెస్ అయ్యారు.

బోట‌మ్ లైన్: టైంపాస్ ఎంట‌ర్ టైనింగ్‌తో కిట్టు ప‌డ్డ జాగ్ర‌త్త మెప్పిస్తుంది

Kittu Unnadu Jagratha English Version Review

Rating : 3.0 / 5.0