'యమదొంగ'లా సన్నగా అయిపోతాడా ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఫిక్షన్ పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు.ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఉక్రెయిన్ లో జరిగే సాంగ్ షూట్ తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.

ఎన్టీఆర్ తదుపరి చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సోషల్ మెసేజ్ కథతో కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఈ చిత్రంలో తన పాత్రకు అనుగుణంగా ఎన్టీఆర్ వెయిట్ లాస్ కావాల్సి ఉందట. ఇప్పటికంటే బాగా బరువు తగ్గాలని కొరటాల యంగ్ టైగర్ కు సూచించినట్లు తెలుస్తోంది.

గతంలో ఎన్టీఆర్ యమదొంగ చిత్రం కోసం ఒక్కసారిగా బరువు తగ్గి అందరిని ఆశ్చర్యపరిచాడు. అంతకు ముందు ఆది, రాఖీ చిత్రాల్లో ఎన్టీఆర్ కాస్త బొద్దుగా ఉన్నాడనే కామెంట్స్ వినిపించాయి. యమదొంగ తర్వాత నుంచి మాత్రం ఎన్టీఆర్ పర్ఫెక్ట్ ఫిజిక్ మైంటైన్ చేస్తున్నాడు.

ఇక అరవింద సమేత చిత్రంలో అయితే సిక్స్ ప్యాక్ బాడీతో ఎన్టీఆర్ చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు. మరి కొరటాల శివ చిత్రంలో ఎన్టీఆర్ న్యూ లుక్ ఎలా ఉండబోతోందో తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే.

ఎన్టీఆర్, కొరటాల కాంబోలో వస్తున్న రెండవ చిత్రం ఇది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన జనతా గ్యారేజ్ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.