‘మా’ ముఖ్య సలహాదారునిగా కృష్ణంరాజు ఎంపిక

  • IndiaGlitz, [Sunday,June 23 2019]

‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ముఖ్య సలహాదారునిగా సీనియర్ నటుడు కృష్ణంరాజును ఎంపిక చేసుకున్నామని ‘మా’ అధ్యక్షుడు నరేష్ స్పష్టం చేశారు. ఆదివారం నాడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా కొత్త ప్యానెల్ ఏర్పాటయినప్పట్నుంచి చేపట్టిన కార్యక్రమాలు.. ముఖ్యంగా హెల్ప్‌ లైన్‌ గురించి నరేష్ మీడియాకు వివరించారు. తమ ప్యానెల్ ఏర్పాటు అయిన తర్వాత.. ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హెల్ప్‌లైన్‌కు 30 కాల్స్ వచ్చాయన్నారు.

కొత్తగా 30 మందికి రూ. 6 వేల పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించుకున్నామన్నారు. రూ. 25 వేలకు మా సభ్యత్వ నమోదు చేసినట్లు నరేష్ తెలిపారు. అంతేకాకుండా.. జీవిత బీమా రూ. 3 లక్షలకు పెంచామని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఇచ్చే రెండు పడకల గదుల ఇళ్లకు 70 ధరఖాస్తులు పెట్టామని.. ‘మా’లో సభ్యులను ప్రభుత్వ పథకాలకు అనుసంధానం చేస్తున్నామని అధ్యక్షుడు స్పష్టం చేశారు. ఎలాంటి వివాదాలు లేకుండా ‘మా’ అసోసియేషన్‌ను ముందుకు తీసుకెళ్తున్నామని నరేష్ తెలిపారు. కాగా ఈ మీడియా సమావేశంలో మా సభ్యులతో పాటు పలువురు పాల్గొన్నారు.