వైఎస్ జగన్ గిఫ్ట్‌ను కాదనలేకపోయిన కేటీఆర్!

  • IndiaGlitz, [Monday,June 17 2019]

తెలంగాణ సీఎం కేసీఆర్ అమరావతిలో పర్యటించిన సంగతి తెలిసిందే. కేసీఆర్‌ వెంట తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, రాజ్యసభ సభ్యుడు సంతోష్, మాజీ ఎంపీ వినోద్‌ ఉన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘కాళేశ్వరం ప్రాజెక్ట్’ ఓపెనింగ్‌కు రావాలని జగన్‌ను కేసీఆర్ స్వయంగా ఆహ్వానించారు. అనంతరం ఇద్దరి మధ్య సుమారు అరగంటకుపైగా తాజా రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న ప్రధాన సమస్యలు, విభజన విషయాలు చర్చకు వచ్చాయి. ఈ క్రమంలో నీతి అయోగ్‌లో జగన్ ప్రసంగంపై కేసీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు.

అనంతరం కేటీఆర్‌కు వైఎస్ జగన్ ఊహించని గిఫ్ట్ ఇచ్చారు. జగన్ తన చేతుల మీదుగా కేటీఆర్‌కు వినాయకుడి ప్రతిమను అందించారు. సహజంగా కేటీఆర్‌ దైవసంబంధిత కార్యక్రమాలకు దూరంగా ఉంటారన్న విషయం తెలిసిందే. తప్పనిసరి అయితే తప్ప ఆయన పెద్దగా ఆసక్తి చూపరు. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ లాంటి స్థాయి వ్యక్తి ఇవ్వడంతో కాదనలేకుండా కేటీఆర్ తీసుకున్నాడట. ఇదిలా ఉంటే.. ఇవాళ కేసీఆర్ అమరావతి పర్యటనలో భాగంగా కనకదుర్గమ్మను దర్శించుకోగా.. కేటీఆర్ మాత్రం వెళ్లలేదు.

 
అంతేకాదు.. జగన్‌తో కలిసి కేసీఆర్ విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి సన్యాసదీక్ష స్వీకారానికి వెళ్లగా.. కేటీఆర్ మాత్రం అక్కడికి కూడా వెళ్లలేదు. అయితే జగన్ వినాయకుడి ప్రతిమ ఇవ్వడంతో కాదనకుండా తీసుకోవడం విశేషమని టీఆర్ఎస్ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. తన పర్యటన.. తన నిత్య జీవితంలో జరిగే ప్రతి విషయంపై సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యే కేటీఆర్.. ఈ గిఫ్ట్ వ్యవహారంపై ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.