వైసీపీలో చేరాలని లక్ష్మీ నారాయణకు ఆహ్వానం

  • IndiaGlitz, [Wednesday,April 24 2019]

అవును మీరు వింటున్నది నిజమే.. ఈ విషయం స్వయానా సీబీఐ మాజీ జేడీ, జనసేన నేత వీవీ లక్ష్మీనారాయణే స్వయానా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. వైసీపీలో చేరాలని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని.. పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించడమే దాని సారాంశమన్నారు.

మాజీ జేడీ మాటల్లోనే...

నాకు విజయసాయిరెడ్డి ఫోన్ చేసి జగన్ అరెస్ట్ వ్యవహారం అంతా మీరు వృత్తిపరంగా చేశారు. రాజకీయాలు వేరే. మేం కూడా ప్రజల కోసం మంచి పనులు చేయాలనుకుంటున్నాం. అందుకే జగన్ పాదయాత్ర కూడా చేశారు. కాబట్టి గతంలో జరిగింది పక్కన పెట్టేసి మీరు కూడా ప్రజల కోసం ఇందులో భాగస్వామి అయితే బాగుంటుందని చెప్పారు అని మాజీ జేడీ చెప్పుకొచ్చారు. కాగా.. రాజకీయాల్లో వేర్వేరు పార్టీల నుంచి ఆహ్వానం రావడం అన్నది సాధారణమేనని ఆయన అభిప్రాయపడ్డారు.

లక్ష్మీ నారాయణకు స్ట్రాంగ్ కౌంటరిచ్చిన విజయసాయి!

ఇదిలా ఉంటే.. గత కొన్ని రోజులుగా ట్విట్టర్ వేదికగా విజయసాయి-మాజీ జేడీ మధ్య వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే అది కాస్త జనసేన వర్సెస్ వైసీపీగా మారింది. అయితే పార్టీలోకి ఆహ్వానం వ్యవహారంపై తాజాగా విజయసాయిరెడ్డి ట్విట్లర్‌లో స్పందించారు.చంద్రబాబు మోచేతి నీళ్లు తాగే జేడీ గారికి మా పార్టీలో ఎన్నటికీ స్థానం లేదు. ఉండదు కూడా. బహుశా ఆయనే చేరాలనుకున్నారేమో. కోవర్టు ఆపరేషన్ల కోసం వచ్చే ఆలోచన చేశారని ఇప్పడు అనిపిస్తుంది. సీబీఐ లాంటి సంస్థను బాబుకు పాదాక్రాంతం చేసిన వ్యక్తి దేశాన్ని మార్చే కలలు కంటున్నాననడం పెద్ద జోక్ అని మాజీ జేడీకి విజయసాయి స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. అయితే దీనిపై జనసేన నేతలు ఎలా రియాక్టవుతారో వేచి చూడాల్సిందే మరి.