Download App

Lanka Review

ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్స్ స్టేట‌స్‌తో ఉన్న చాలా మంది సీనియ‌ర్ హీరోయిన్‌లుగా మారిన త‌ర్వాత అత్త‌, త‌ల్లి, వ‌దిన‌, అక్క పాత్ర‌ల‌తో రీ ఎంట్రీ ఇస్తున్నారు. అలా రీసెంట్‌గా తెలుగు తెర‌పై రీ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ రాశి. ఒక్ప‌పుడు స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించిన రాశి చాలా గ్యాప్ త‌ర్వాత ఓ పెర్‌ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్ర‌లో న‌టించిన చిత్ర‌మే `లంక‌`.  స‌మాజంలోస్త్రీల‌పై జ‌రుగుతున్న అత్యాచారాల‌కు, టెలిప‌తికి లింక్ పెడుతూ రాశి భ‌ర్త‌, ద‌ర్శ‌కుడు శ్రీముని తెర‌కెక్కించిన లంక చిత్రం రాశికి ఎలాంటి గుర్తింపు తెచ్చిందో చూడాలంటే ముందు క‌థ‌ను చూద్దాం...

క‌థ:

షార్ట్ ఫిలిం తీసి ద‌ర్శ‌కుడుగా త‌నెంటో నిరూపించుకోవాల‌నుకునే యంగ్ డైరెక్ట‌ర్(సాయిరోన‌క్‌) తీయాల‌నుకునే ఓ షార్ట్ ఫిలింలో న‌టిస్తానంటూ ఓ స్వాతి(ఐనా సాహా) ఫోన్ చేస్తుంది. స‌రేన‌ని అంద‌రూ క‌లిసి షార్ట్ ఫిలిం తీయ‌డానికి రెబాకా విలియ‌మ్స్(రాశి) ఉండే బంగ‌ళాకు వెళ‌తారు. టెలిప‌తిలో మంచి ఎక్స్‌ప‌ర్ట్ అయిన రెబాకా టెలిప‌తి కార‌ణంగా లేని పిల్ల‌ల‌ను ఉన్న‌ట్లుగా ఊహిస్తుంటుంది. స్వాతికి ఉన్న‌స‌మస్య‌ల‌ను ప‌సిగ‌ట్టి టెలిప‌తితో న‌యం చేస్తుంది. ఈలోపు షార్ట్‌ఫిలిం పూర్తికావ‌డంతో స్వాతి అమెరికా వెళ్ళిపోవాల‌నుకంటుంది. అయితే, ఆరోజు నుండి స్వాతి ఎవ‌రికీ క‌న‌ప‌డ‌దు, ఫోన్ స్విచాఫ్ అయిపోతుంది. హీరోయిన్ మిస్సింగ్ కావ‌డంతో పోలీసులు రంగ ప్ర‌వేశం చేస్తారు. కేసును శ్రీనివాస్‌(సుప్రీత్‌) టేక‌ప్ చేసి విచార‌ణ చేస్తాడు. విచార‌ణ‌లో భాగంగా సాయిరోన‌క్‌, అతని మిత్రులు సుద‌ర్శ‌న్‌, స‌త్య‌, రెబాకావాలి విలియ‌మ్స్‌ను అరెస్ట్ చేస్తారు. రెబాకా విలియ‌మ్స్ కార‌ణంగానే స్వాతి క‌న‌ప‌డ‌కుండా పోయింద‌ని పోలీసులు నిర్ధారిస్తారు. చివ‌ర‌కు పాండిచ్చేరిలో స్వాతి ఉన్న‌ట్లు తెలుసుకుంటారు.  పాండిచ్చేరి చేరుకున్న‌పోలీసుల‌కు రెబాకా, స్వాతి గురించి కొన్ని నిజాలు తెలుస్తాయి. అస‌లు స్వాతి ఎవ‌రు?  స్వాతి,రెబాకా మ‌ధ్య ఉన్న రిలేష‌న్ ఏంటి? శ‌ర‌త్ ఎవ‌రు? శ‌ర‌త్, స్వాతి, రెబాకా మ‌ధ్య ఉన్న రిలేష‌న్ ఏంటి? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...

ప్ల‌స్ పాయింట్స్:

- క‌థ‌
- సినిమాటోగ్ర‌ఫీ
- క్లైమాక్స్‌

మైనస్ పాయింట్స్:

- స్కీన్‌ప్లే
- ఫ‌స్టాఫ్ సాగిదీసిన‌ట్టు ఉండ‌టం
- ఎడిటింగ్

విశ్లేష‌ణ:

ఇందులో ముఖ్యంగా న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే క‌థంతా రాశి చుట్టూనే తిరుగుతుంది. ముందు రాశి పాత్ర భ‌య‌పెట్టేలా స‌స్పెన్సివ్‌గా ఉంటుంది. త‌న పాత్ర ప‌రంగా రెబాకాగా  రాశి త‌న పాత్ర‌లో అద్భుతంగా న‌టించింది. టెలిప‌తి ఎక్స్‌ప‌ర్ట్ అయిన వ్య‌క్తి రాశి న‌ట‌న ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది. ఐనా సాహా, సాయిరోన‌క్‌లు కొత్త హీరో హ‌రోయిన్లుగా కాబ‌ట్టి న‌ట‌న ప‌రంగా గొప్ప‌గా ఆశించలేం. ఐనా సాహా కొన్ని చోట్ల బాగానే ఉన్న‌ట్లు క‌న‌ప‌డింది. ఇక టెక్నిషియ‌న్స్ విష‌యానికి వ‌స్తే ఒక‌ప్పుడు ఋషులు భావ వ్య‌క్తీక‌ర‌ణ చేసే విద్య టెలిప‌తి..సైన్స్‌లో దీనికి చాలా ర‌కాలైన ఆధారాలు కూడా ఉన్నాయి. వీటి ఆధారంగా ద‌ర్శ‌కుడు శ్రీముని రాసుకున్న క‌థ `లంక‌`. ద‌ర్శ‌కుడు టెలిప‌తికి, హ్యుమ‌న్ ట్రాఫికింగ్‌కు లింక్ పెడుతూ రాసిన క‌థ అంద‌రిని ఆక‌ట్టుకునేలా ఉంది. అయితే క‌థ‌ను ఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కించాల‌నుకున్నాడేమో కానీ క‌థ‌ను అనేక ట్విస్టుల‌తో ముందుకు న‌డ‌ప‌డం వ‌ల్ల సినిమా చూస్తున్న ప్రేక్ష‌కుడుకి తిక‌మ‌క‌గా అనిపిస్తుంది. థ్రిల్ల‌ర్ సినిమాల నిడివి ఎంత త‌క్కువుంటే అంత మంచింది. మ‌ల్టీ ప్లెక్స్ ఆడియెన్స్‌కు అర్థ‌మ‌య్యే కాన్సెప్ట్ . ఫ‌స్టాఫ్ అంతా సినిమాను అటు ఇటు సాగ‌దీసిన‌ట్లు అనిపించింది. హీరోయిన్‌, హీరో గ్యాంగ్‌పై రాశి దాడి చేసినట్లు హీరోయిన్ క‌ల‌గ‌న‌డం, సెకండాఫ్‌లో పోలీసులు హీరోయిన్ వెంట‌ప‌డ‌టం, మంచి పెయింట‌ర్ అయిన సిజ్జు పాత్ర‌ను వీలైనంత క్లుప్తంగా చెప్ప‌కుండా నెరేష‌న్ ఎక్కువ ఇవ్వ‌డంతో సినిమా బోరింగ్‌గా అనిపిస్తుంది. ఇక సెకండాఫ్‌లో క్లైమాక్స్ ముందు వ‌ర‌కు స‌స్పెన్స్ వీడేంత వ‌ర‌కు  క‌థ ఎక్క‌డెక్క‌డికో వెళుతున్న‌ట్లు ఉంటుంది. ద‌ర్శ‌కుడు క‌థ‌లో అనుకున్న పాయింట్ బావున్నా దాన్ని ఆస‌క్తిక‌రంగా మ‌ల‌చ‌లేక‌పోయాడు. ప్రీక్లైమాక్స్‌లో ఓ క్లారిటీ వ‌చ్చేస‌రికి ప్రేక్ష‌కుడి మ‌దిలో గంద‌ర‌గోళం నెల‌కొని ఉంటుంది.

బోట‌మ్ లైన్: క్లైమాక్స్ మిన‌హా 'లంక‌'.. తిక‌మ‌క‌...

Lanka English Version Review

Rating : 2.3 / 5.0