రక్షించాలంటూ సీఎంకు ప్రముఖ దర్శకుడి మొర

  • IndiaGlitz, [Wednesday,October 28 2020]

తన జీవితం ప్రమాదంలో ఉందని రక్షించాలంటూ ఏకంగా ముఖ్యమంత్రికి ప్రముఖ దర్శకుడు మొరపెట్టుకోవడం సంచలనంగా మారింది. ఆయన మరెవరో కాదు.. జాతీయ అవార్డు గ్రహీత అయిన శీను రామస్వామి. ఆయనే ‘800’ను తెరకెక్కించాలనుకున్నారు. శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కాల్సి ఉంది. ఈ సినిమా కోసం విజయ్ సేతుపతిని హీరోగా శీను రామస్వామి ఎంచుకున్నారు. దీనిపై తమిళుల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. దీంతో తన బయోపిక్ నుంచి వైదొలగాలంటూ విజయ్ సేతుపతికి మురళీధరన్ రిక్వెస్ట్ చేయడంతో ఆయన సినిమా నుంచి తప్పుకున్నారు.

కాగా.. విజయ్‌ సేతుపతిని ప్రాజెక్ట్‌ నుండి తప్పుకోమని సూచించిన వారిలో శీను రామస్వామి కూడా ఉన్నారు. అలా కోరినందుకే ఇప్పుడు శీను రామస్వామి బెదిరింపులను ఎదుర్కొంటున్నారని సమాచారం. దీనిపై ఆయన ట్విట్టర్‌ వేదికగా తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి మొర పెట్టుకున్నారు. తన జీవితం ప్రమాదంలో ఉందని... ముఖ్యమంత్రిగారు.. మీరు తప్పకుండా సహాయం చేయాలని కోరారు. అంతే కాకుండా ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ తన సమస్యను శీను రామస్వామి వెల్లడించారు. తనకు, విజయ్‌ సేతుపతికి మధ్య దూరం పెంచడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.

శ్రీలంక తమిళియన్ అయిన ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ ఆధారంగా ‘800’ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి టైటిల్ రోల్ పోషిస్తున్నట్టు ప్రకటించిన కొద్ది సేపటికే తమిళనాడులో వివాదం మొదలైపోయింది. శ్రీలంక మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత ప్రధాన మంత్రి మహింద్ర రాజ్‌పక్సేను గతంలో మురళీధరన్ సపోర్ట్ చేశారు. శ్రీలంకలో తమిళ పులుల అంతర్యుద్ధాన్ని అంతమొందించడం కోసం దాదాపు 30 ఏళ్ల పాటు కొన్ని లక్షల మంది తమిళులను ఊచకోత కోశారు. దీంతో మహింద్ర రాజ్‌పక్సేపై తమిళనాడులో తీవ్ర వ్యతిరేకత ఉంది. అలాంటి మహింద్ర రాజ్‌పక్సేను సపోర్ట్ చేయడంతో మురళీధరన్‌పై కూడా తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది.